నేటి నుంచి శారదాపీఠం వార్షికోత్సవాలు

  • హాజరుకానున్న సీఎం జగన్‌

విశాఖపట్నం,జ్యోతిన్యూస్‌
‌విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు వేడుకగా సాగనున్నాయి. ఉదయం 7.30 గంటలకు పీఠాధిపతులు ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. మొట్టమొదటగా ఆలయ ప్రాంగణంలోని దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకుంటారు. గో పూజ నిర్వహించి శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. స్వయం జ్యోతి మండపంలో ఏర్పాటు చేసిన రాజశ్యామల అమ్మవారి విశేష అలంకరణను దర్శిస్తారు. అనంతరం దేశ రక్షణ కోసం తలపెట్టిన రాజశ్యామల యాగానికి శ్రీకారం చుడతారు. అలాగే లోక కళ్యాణార్థం పండిత ప్రముఖులతో కలిసి చతుర్వేద పారాయణ చేపడతారు. వార్షిక మహోత్సవాలను విశేష హోమాలు నిర్వహించాలని సంకల్పించిన విశాఖ శ్రీ శారదాపీఠం తొలి రోజున జనావళి వ్యాపారాభివృద్ధి కోసం లక్ష్మీ గణపతి హోమం చేపడుతుంది. సాయంత్రం 6.30 గంటలకు విజయనగరంకు చెందిన ప్రముఖ కళాకారులు పవన్‌ ‌కుమార్‌ ‌గాత్ర కచేరీ ఉంటుంది.
వార్షికోత్సవాలకు హాజరవుతున్న జగన్‌
‌విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి హాజరవుతున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు విశాఖ శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు అందుకుంటారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శిస్తారు. పీఠాధిపతులతో కలిసి గోపూజలో పాల్గొని శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా చేపడుతున్న రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. యాగ క్రతువులో పూజలు నిర్వహించిన అనంతరం పీఠాధిపతులతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. అనంతరం 12:30 గంటలకు విజయవాడకు తిరుగు పయనమవుతారు. ఈమేరకు శారద థియేటర్‌ ‌వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.