నగర‘నగారా’…

  • ఏపిలో మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా
  • ఆగిపోయిన ఎన్నికలను కొనసాగిస్తూ కమిషన్‌ ‌నోటిఫికేషన్‌
  • ‌మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ..14న ఓట్ల లెక్కింపు
  • 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు,నగర పంచాయితీల్లో ఎన్నికలు
  • మున్సిపల్‌ ఎన్నిక పక్రియ మళ్లీ మొదలు పెట్టాలి
  • గతంలో జరిగిన ఘటనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగింది. ఆంధప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. గతంలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికల పక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన వరకూ వచ్చిన మున్సిపల్‌ ఎన్నికల పక్రియ కోవిడ్‌-19 ‌లాక్‌డౌన్‌ ‌వల్ల గత ఏడాది మార్చి 15న ఆగి పోయింది. తదుపరి ఆదేశాల వరకూ మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది మే 6న ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎస్‌ఈసీ, ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన పురపాలక ఎన్నికల పక్రియను కూడా కొనసాగించాలని నిర్ణయించింది.ఆంధప్రదేశ్‌లోని మొత్తం 12 మునిసిపల్‌ ‌కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు,నగర పంచాయితీల్లో అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ దశ నుంచి ఎన్నికల పక్రియను కొనసాగిస్తున్నట్లు ప్రకటించి.. సోమవారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మున్సిపల్‌ ఎన్నికల పక్రియను కొనసాగిస్తూ ఈసీ తాజా నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. గతేడాది మార్చి 15న నిలిచిన పక్రియ నుంచే కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రకటించారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు మార్చి 8న సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ ‌నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ‌నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ‌ప్రారంభమవుతుంది. అయితే రీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేయడంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్‌ను కొనసాగిస్తూ విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. ఎస్‌ఈసీ కొత్తగా నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దౌర్జన్యాలు, బెదిరింపులతో పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఏకగ్రీవాలను కొనసాగించడం అన్యాయమని శైలజానాథ్‌ ‌పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల రీ నోటిఫికేషన్‌ ‌విడుదలపై ఎస్‌ఈసీ పునరాచించాలని శైలజానాథ్‌ ‌విన్నవించారు.
మున్సిపల్‌ ఎన్నిక పక్రియ మళ్లీ మొదలు పెట్టాలి
మున్సిపల్‌ ‌నామినేషన్‌ ‌పక్రియ మొదటి నుంచి ప్రారంభిస్తే.. అందరికీ న్యాయం జరుగుతుందని జనసేన పీఏసీ చైర్మన్‌ ‌నాదెండ్ల మనోహర్‌ ‌పేర్కొన్నారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ‌నామినేషన్‌ ‌పక్రియ ప్రజాస్వామ్య బద్దంగా లేదన్నారు. వలంటీర్లను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ మరోసారి ఆలోచించాలని నాదెండ్ల మనోహర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కరోనా పరిస్థితుల్లో ఈసీ తీసుకునే నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు సమర్థించాయని తెలిపారు. ఆనాడు వైసీపీ నేతలు చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్‌ ‌తెలిపారు. ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి వైసీపీ నేతలు నామినేషన్‌ ‌వేశారని చెప్పారు. అవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్లీ ఆగిన చోటినుంచి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఇదే విధానం కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని తాము ఆశించడం లేదన్నారు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరుగుతున్న ఎన్నికలను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించాలని కోరారు. సామాన్యులకు ధైర్యం నింపేలా, అభ్యర్థులకు అండగా ఉండేలా ఈ ఎన్నికలు ఉండాలని చెప్పారు. జనసేన అభ్యర్థులకు అండగా నిలుస్తామన్నారు. ఓటర్‌ ‌స్లిప్పులపై పథకాల పేర్లు రాసి నిలిపివేస్తామని వలంటీర్లు హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తమ స్వలాభం కోసం వలంటీర్లను రాజకీయాలకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎస్‌ఈసీ మరోసారి మున్సిపల్‌ ‌నామినేషన్‌ ‌పక్రియపై పునరాలోచించాలని నాదెండ్ల మనోహర్‌ ‌తెలిపారు. ఇదిలావుంటే అక్షయ గోల్డ్ ‌బాధితులను ఆదుకుంటానని పాదయాత్రలో ఇచ్చిన హాని జగన్‌ ‌నెరవేర్చాలని నాదెండ్ల మనోహర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సమస్యలు పరిష్కరించాలని అడిగితే బాధితులను అరెస్ట్ ‌చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 15 లక్షల 94 వేల మంది రూ.385 కోట్లు డిపాజిట్‌ ‌చేశారని పేర్కొన్నారు. అక్షయగోల్డ్ ‌బాధితులకు జనసేన అండగా ఉంటుందన్నారు.
………………………..