1వ తేదీ నుంచి సిటీ సర్వీసులు

  • సిద్ధమవుతున్న ఆర్టీసి యంత్రాంగం
  • మెట్రో రైళ్లు కూడా పట్టాలెక్కబోతున్నాయ్…
  • అలాక్ 4.0 ఆదేశాల అమలుకు రంగం సిద్ధం
  • అంతరాష్ట్ర సర్వీసులు పునరుద్ధరణ దిశగా చర్యలు

హైదరాబాద్,జ్యోతిన్యూస్ : కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించెన్న కేంద్రం అలాక్ 4.0 ఆదేశాలు దరిమిలా అంతరాష్ట్ర సర్వీసులు పునరుద్ధరణ దిశగా చర్చలు సాగుతూ సత్ఫలితాలనే అందిస్తున్నాయి. మరోవైపు మెట్రో రైలుకు పచ్చజెండా లభించడంతో హైదరాబాద్ లోనూ సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. దీంతో, హైదరాబాద్ లో సిటీ బస్సులు నడి పేందుకు టిఎస్ఆర్టీసి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. సిటీలో సిటీ సర్వీసులు నడవక చిరు ఉద్యోగులు, ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. కరోనా కష్టకాలంలో చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న సగటు చిరు ఉద్యోగి ప్రజా రవాణా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇంటికి సమీపంలో ఉన్నవాళ్లయితే కాలిబాట పడుతున్నప్పటికీ ఇతరత్రా చిరుద్యోగులకు తాము పనిచే సే స్థలానికి వెళ్లడం గగన కుసుమంగానే ఉంది. నిత్యం ఆటో, క్యాబ్ లలో వెళ్లి రావాలంటే ఇక తాము నెలసరి జీతం ఇంటికి తెచ్చుకునే పరిస్థితి ఉండబోదని సగటు చిరుద్యోగి వాపోతున్న సందర్భాలనేకం. ఈ పరిస్థితుల దృష్టా హైదరాబాద్ సిటీలో సిటి సర్వీసుల పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు, ఇతరుల నుంచి విజ్ఞాపనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ నిబంధనలతోనైనా సరే జీహెచ్ఎంసీలో సిటీబస్సులు పునరుద్ధరించాలని కోరుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అప్పట్నించీ ఆర్టీసీ అధికారులు సిటీ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నా జీహెచ్ఎంసీలో కరోనా విజృంభణ బ్రేక్ వేసింది. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు నడపాలా ? వద్దా ? అన్న అయోమయ స్థితి నెలకొంటూ వచ్చింది. అంతరాష్ట్ర సర్వీసులతో పాటు హైదరాబాద్ లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనుండటంతో సిటీ బస్సులను సైతం సెప్టెంబర్ మొదటివారంలో రోడ్డెక్కే విధంగా టిఎస్ఆర్టీసి వ్యూహరచన చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే సిటీబస్సులు రోడ్డెక్కె విధంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను సైతం ఇందుకు కార్మోన్ముఖు లను చేస్తున్నట్లు సమాచారం. కష్టాల కడలిలో వున్న ఆర్టీసి గట్టెక్కాలంటే అటు అంతరాష్ట్ర సర్వీసులతో పాటు ఇటు హైదరాబాద్ లో సిటీ బస్సులు నడవాల్సిన అత్యయిక పరిస్థితి ఉంది. సిటీలో రోజు దాదాపు 33 లక్షల మంది ప్రజలు సరాసరిగా ఆర్టీసి బస్సులు ఎక్కుతుంటారు. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో వారంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే పరిస్థితి దాపురించింది. ప్రజాభిమానం చూరగొన్న ఆర్టీసి సేవలను కొనసాగించాలని నేటికి అంతా కోరుకుంటున్నారు. దీంతో సెప్టెంబర్ నుంచే సిటీ బస్సులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీసీ అధికారులు సైతం రవాణాశాఖ మంత్రి పువ్వాడతో ఇదే విషయంపై పలు దఫాలుగా చర్చలు కొనసాగిస్తున్నారని వినికిడి. ఈ విషయం పై ప్రభుత్వంకు విన్నవించి తద్వారా నిర్ణయం తీసుకోగలనని మంత్రి పువ్వాడ ఆర్టీసి అధికారులతో అన్నట్లు సమాచారం. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే మాసాల్లో టిఎస్ఆర్టీసికి ఎలాంటి ఆదాయం లేదు. ఈ ఏడాది మార్చి 22 నుంచి మే 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఆర్టీసి బస్సులు నడపలేదు. మే 19వ తేదీ నుంచి ఆర్టీసి బస్సులు హైదరాబాద్ మినహా జిల్లాల వ్యాప్తంగా పునరుద్ధరణకు నోచుకున్నాయి. రాష్ట్రంలో పది వేల బస్సులుంటే 30 నుండి 50 శాతం బస్సులు మాత్రమే జిల్లాల్లో నడుపుతున్నారు.కరోనాకు ముందు రాష్ట్రంలో ఆర్టీసికి ప్రతి రోజూ రూ.12 కోట్ల ఆదాయం గడించేది. ప్రస్తుతం కరోనా విజృంభణతో రోజుకు రూ.2 కోట్ల మేర కూడా ఆదాయం రావడం లేదు. దీంతో టికెట్టేతర ఆదాయం పైనా ఆర్టీసి దృష్టి పెట్టింది. పార్సిల్, కొరియర్, కార్గో సేవలు (పిసిసి) సేవలను సైతం ప్రారంభించింది. ఇంకా ఇతరత్రా టికెట్టేతర ఆదాయాల దిశగా యోచిస్తోంది. సదరు సేవల ద్వారా రోజుకు రూ.15వేలు మాత్రమే ఆర్జించిన టిఎస్ఆర్టీసి అనతి కాలంలోనే ఆ సేవల ద్వారా ఏరోజుకారోజు ఆదాయాన్ని పెంచు కుంటూ ప్రస్తుతం రోజుకు రమారమి రూ.15 లక్షల మేర ఆదాయానికి ఎగబాకింది. మరోవైపు ఆర్టీసి ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రతి నెల రూ.140 కోట్లు వెచ్చించాల్సి ఉంది. జిల్లాల్లో బస్సు సర్వీసుల కంటే అంతరాష్ట్ర, హైదరాబాద్ లో సిటీ బస్సులు నడపడం ద్వారానే ఆర్టీసికి ఆదాయ పరంగా లాభం చేకూరుతుంది. కరోనా సమయంలో ఖాళీగా బస్సులను డిపోలకే పరిమితం చేసేకన్నా జిల్లాల్లో బస్సులు తిప్పడమే మేలని టిఎస్ఆర్టీసి భావించి ఆ దిశగా బస్సు సర్వీసులను కొనసాగిస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్లాక్ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా అధికారులు ఇప్పటికే కొన్ని మార్గాలను ఎంపిక చేశారు. హయత్ నగర్? పటాన్ చెరు, లంగర్ హౌస్? రిసాలాబజార్, ఉప్పల్? మెహిదీపట్నం, సికింద్రాబాద్? బీహెచ్ఈఎల్, జీడిమెట్ల? ఎంజీబీఎస్ వంటి కొన్ని రూట్లలో మాత్రమే నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి, కూకట్ పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు టికెట్లు ఎలా ఇవ్వాలనే అంశం పై కూడా ఆర్టీసీలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ సెప్టెంబరు 1 నుంచి బస్సులు నడి పేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కోవిడ్ ఉద్ధృతి మాత్రం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బస్సులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుందా అనే అంశం పై కూడా చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం అనుమతిస్తే సికింద్రాబాద్? లింగంపల్లి రూట్లో మాత్రమే మొదట ఎంఎంటీఎస్ సర్వీసులు నడిచే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్కువగా హైటెక్ సిటీ, లింగంపల్లి తదితర ప్రాంతాల నుంచి రావాల్సివస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో కొన్ని సర్వీలను మాత్రమే ఈ రూట్ కు పరిమితం చేయనున్నారు. కాగా… ఎంఎంటీఎస్ రైళ్లకు కేంద్రం అనుమతిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. మెట్రో రైళ్లు వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లిఖిత పూర్వకంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఆ తర్వాతే తేదీలను ప్రకటించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.