కేంద్రానికి ‘పవర్’ పంచ్
ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు
- విద్యుత్ సంస్థల పై పట్టు బిగుస్తున్న కేంద్రం
- విద్యుత్ చట్టంలో పలు కీలక సవరణలు చేయనున్న కేంద్ర సర్కారు
- రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే దిశగా అడుగులు
- తీవ్రంగా విభేదిస్తున్న తెలంగాణ, ఏపీ సర్కారులు
- మరికొన్ని రాష్ట్రాలదీ అదే దారి
- ఇక ఉచిత విద్యుత్ హామీలకు మంగళం
- మోదీ సర్కారుకు లేఖ రాయనున్న తెలంగాణ మంత్రి
- ఒకే దేశం ఒకే విద్యుత్ రేట్లు అంటున్న కేంద్రం
- ఈ విషయంలో పోరుకు సిద్ధమవుతున్న టి.సర్కారు
హైదరాబాద్: విద్యుత్ వ్యవస్థను కైవసం చేసుకునే దిశగా కేంద్రం..అడుగులు వేస్తోందా..ఇక విద్యుత్ పంపిణీ సంస్థలపై కీలక అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనున్నాయా? ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం పై తిరుగుబాటు చేసేందుకు సిద్దం అవుతున్నాయా? అంటే అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో భారీ వివాదం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది విద్యుత్ రంగంలో. విద్యుత్ వ్యవస్థ పై మొత్తం పెత్తనానికి కేంద్రం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విద్యుత్ చట్టంలో పలు కీలక సవరణలను తీసుకురానుంది. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు డ్రాఫ్ట్ ను సిద్ధం చేసి రాష్ట్రాలకు పంపింది. విద్యుత్ వ్యవస్థను కైవసం చేసుకునే దిశగా కేంద్రం..! కేంద్రం తీసుకొస్తున్న సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, ఇద్దరి సభ్యుల నియామకం పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. అంతే కాదు.. విద్యుత్ పంపిణీ సంస్థల పై అధికారాలు కూడా కేంద్రానికి వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ ధరల పెంపు.. తగ్గింపు పై.. రాష్ట్రాలకు అధికారం ఉండదు. ఒప్పందాలకు చాన్స్ ఉండదు. ఒప్పందాల సమీక్షకు కూడా చాన్స్ ఉండదు. ఓ రకంగా విద్యుత్.. కేంద్ర అంశంగా మారిపోతుంది. ఒకే దేశం.. ఒకే ధర అన్న విధానంతో దేశం మొత్తం ఒకే విద్యుత్ రేటు అమలు చేస్తారు. బిల్లును సమర్థించే ప్రశ్నే లేదన్న తెలంగాణ సర్కార్..! దీని పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. విద్యుత్ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని.. ప్రైవేటీకరణకు కేంద్రం వ్యూహం రూపొందించిందని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు నేరుగానే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కేంద్రం చెబుతున్న చట్టం అమలులోకి వస్తే.. రైతులకు ఉచిత విద్యుత్ ఆగిపోతుందని… గృహవినియోగదారులపై అదనపు భారం పడుతుందని అంటున్నారు. ఈ ఇక వ్యతిరేకత ఎలా చేయాలో తెలియక ఏపీ సర్కార్ సతమతం..అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్ కు కూడా కేంద్రం ఈ బిల్లు ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. కానీ మద్దతివ్వాలా.. వ్యతిరేకించాలా.. అన్నదానిపై ఆయన స్పష్టతకు రాలేదు. మరోసారి సమీక్ష నిర్వహిద్దామని ఉన్నతాధికారులకు సీఎం జగన్ తెలిపారు. అంతర్గతంగా మాత్రం.. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను లాగేసుకోవడమేనని.. విద్యుత్ వ్యవస్థ పై కేంద్రానికే నియంత్రణ వెళ్తే.. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్న అంచనాలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్రం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. తెలంగాణ సర్కారు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు. అందుకే.. ఎలా తమ వ్యతిరేకత తెలియ చేయాలా.. అన్న అంశం పై తర్జన భర్జన పడుతున్నారు. ఏపీ సర్కార్ నిర్ణయాల వల్లే కేంద్రానికి ఈ బిల్లు ఆలోచన..!? నిజానికి కేంద్రానికి విద్యుత్ వ్యవస్థను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనే ఆలోచన లేదు. ఏపీ సర్కార్ నిర్ణయాల వల్లే ఈ ఆలోచన వచ్చింది. విద్యుత్ ధరలను తగ్గించాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రం నోటీసులు జారీ చేస్తుండటం, సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు కేంద్రం వద్ద పంచాయితీ పెట్టాయి. ఇవన్నీ ఏపీలోనే జరిగాయి. జగన్ సీఎం అయిన తర్వాత పీపీఏల పై జరిగిన రచ్చ పరిణామాలే ఇవి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉ ండాలంటే శాశ్వత విధానం ఉండాలని కేంద్రం భావించింది. ఇందుకోసం కేంద్రం పరిధిలో కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని కూడా ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టంలో పేర్కొంది. ఒకసారి ఈ అథారిటీ ఏర్పడ్డాక రాష్ట్రాలు పీపీఏలను పున:సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు. ‘ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకు వస్తోంది’ అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్రం యత్నిస్తుందన్నారు. కేంద్ర నిర్ణయాలతో రైతులు, పేదలకిస్తున్న రాయితీలు పూర్తిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలతో చర్చించి పార్లమెంట్ లో విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతామంటూ.. దీనిపై రాష్ట్ర వైఖరిని వివరిస్తూ ఆయన అన్నారు. 2020 విద్యుత్ చట్ట సవరణ బిల్లు పై రాష్ట్రానికి చాలా అభ్యంతరాలున్నాయి. ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంతోందంటే అందుకు మూడు ప్రధాన కారణాలున్నాయి. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పేద, వెనకబడిన వర్గాలకు చేయూతనివ్వడం కోసం రాష్ట్రం అందజేసే రాయితీల పంపిణీ పై ప్రభావం పడే అవకాశం ఉంది. రెండోది… రాష్ట్రాల హక్కులకు సంబంధించి రాష్ట్రాల పాత్రే లేకుండా పోతుంది. మూడోది.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రగా భావిస్తున్నాం. ఈ మూడు కారణాలచేత బిల్లును వ్యతిరేకిస్తున్నాం అని సీఎం కేసీఆర్ స్పష్టీకరించడం గమనార్హం. 2003 విద్యుత్ చట్టానికి 2020 చట్ట సవరణ బిల్లుకు మధ్య చాలా తేడాలున్నాయి. జాతీయ సంప్రదాయేతర ఇంధన విధానం పై అభ్యంతరాలున్నాయి. ఇక విద్యుత్ నియంత్రణ మండలిని నియమించే అధికారం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. దీని వల్ల కూడా ఇబ్బందులున్నాయి. ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం(ఆర్.ఎల్.డి.సి.) పాత్ర పరిమితం కానుంది. జాతీయ లోడు డిస్పాచ్ కేంద్రం(ఎన్.ఎల్.డి.సి.) పాత్రే కీలకం కావడం వల్ల ఇబ్బందులున్నాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రమే విద్యుత్ పంపిణీ చేయాలి. సవరణ బిల్లు చట్టమై అమలులోకి వస్తే వారు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వారు ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎవరికైనా విద్యుత్ సరఫరా చేయవచ్చు. దీంతో అరాచకం మొదలై ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ప్రాబల్యం లేకుండా పోతుంది. పంపిణీ, సరఫరాకు సంబంధించిన అనేక ఇబ్బందులున్నాయి. కేంద్రం చెప్పిన శాతం ప్రకారమే సంప్రదాయేతర ఇంధన వినియోగం జరగాలి. వాళ్లు చెప్పినట్లు వాడకపోతే జరిమానా వేస్తారు. ప్రస్తుతం 25 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం . చట్టం అమల్లోకి వస్తే ఈ రైతులు మీటర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే రైతులు మీటర్లు పెట్టుకుంటే పారదర్శకత, జవాబుదారితనం వస్తుందని భాజపా నేతలంటున్నారు కానీ కరెంటు ఛార్జీలను ఇవాళ రాష్ట్రస్థాయిలో నిర్ణయించుకుంటున్నారు. సవరణతో మాత్రమే కేంద్రం నిర్ణయిస్తుంది. క్రాస్ సబ్సిడీలిచ్చి విద్యుత్ సంస్థలను బతికించుకుంటున్నాయి రాష్ట్రాలు. ఆ ప్రకారం ప్రజలకు సేవలు అందించగలుగుతున్నాయి. ఉదాహరణకు పెద్ద వినియోగదారులు ఇచ్చే డబ్బులతో 69 లక్షల మంది గృహ, ఇతర చిన్న వినియోగదారులకు ఛార్జీల్లో రాయితీలిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ చట్టం అమల్లోకి వస్తే అందరికీ సమానంగా ఇవ్వాలి. గృహవినియోగదారులు రాయితీ కోల్పోయే ప్రమాదముంది. 25 లక్షల పంపుసెట్లకు మీటర్లు బిగించడం పెద్ద సమస్య. రాయితీ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోండి. బిల్లు మాత్రం కట్టాల్సిందే అని కేంద్రం అంటోంది. రైతులు యూనిట్ కు రూ.5 చొప్పున కట్టాలి. ఏ ప్రజలను ఏవిధంగా చూసుకోవాలో కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్రాల పాత్ర పరిమితం చేసి పూర్తిస్థాయిలో ప్రైవేట్ వాళ్లకు కొమ్ము కాస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాయాలని చూస్తోంది. వాస్తవానికి జరిగేదాంట్లో మంచి ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మొహమాటంగా సమర్థిస్తారు. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నది ముఖ్యమంత్రి భావన. దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. ప్రభుత్వాలు ప్రభుత్వాల మాదిరిగానే పనిచేయాలని మొదటి నుంచి ఆయన సూచిస్తున్నారు. దాంట్లో భాగంగా జీఎస్టీకి సంబంధించి మొదట్లో తమ అనుమానాలను నివృత్తి చేశారు. రాష్ట్రాలకు నష్టం కలగకుండా ఆదాయాలు తగ్గకుండా చూస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రాలకు ఉపయోగమవుతుందని వివరించారు. అధికారులు, మంత్రుల సలహాలు కూడా తీసుకుని కొంత ధైర్యం, హామీలిచ్చారు. అందుకే అప్పట్లో కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీకి మద్దతునిచ్చారు. ఇప్పుడు దానివల్ల కూడా కొన్ని చేదు ఫలితాలు ఎదు రవుతున్నాయి.. కేంద్రం ఇచ్చిన మాట తప్పుతోంది. ఇప్పటికీ ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వడం లేదు. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత వారి చేతిలోకి పెత్తనం తీసుకున్న తర్వాత మాట మీద నిలబడరని అర్థమైంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు అంతకంటే దారుణంగా ఉంది. చట్టంలోనే లోపాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేసారు. త్వరలోనే దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నారు తెలంగాణ సర్కారు. మిగతా రాష్ట్రాలతో ఈ బిల్లు పై మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతోంది. భావసారూప్యం ఉన్న రాష్ట్రాలను కలుపుకొని పార్లమెంట్ లో తప్పకుండా బిల్లును వ్యతిరేకించేందుకు సంసిద్ధమవుతోంది. దీని పై కొట్లాడాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేయడం గమనార్హం.