కేసులు తగ్గడంపై అనుమానాలున్నాయి
పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత పార్టీ కార్యాలయానికి అనేక సార్లు వచ్చినప్పటికీ లా డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, మోత్కుపల్లి నరసింహులు తదిరుల సమక్షంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్ ను నియమించిన విషయం తెలిసిందే. కరోనాపై యుద్ధంలో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం
నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులను దాచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం సంతోషకరమే అయినప్పటికీ
ఒక్కసారిగా తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వ వ్యవహారశైలి వల్లే ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో పరీక్షలు ఎక్కువగా ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్ని సౌకర్యాలున్న హైదరాబాద్లో కరోనా కేసులు పెరగడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రోజూ 2 వేలకుపైగా కరోనా పరీక్షలు చేసేందుకు కేంద్రం సౌకర్యాలు కల్పించిందని సంజయ్ అన్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం సహకరిస్తోందన్నారు. ఇప్పుడే కాదు.. ప్రజల శ్రేయస్సు కోసం భవిష్యత్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. లాక్ డౌనకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇతర పార్టీల నేతలు, వైద్య నిపుణుల
సలహాలు, సూచలను తీసుకోవాలని సూచించారు.