ఇప్పటికే 3 వేల కోట్లు నష్టపోయిన భారతీయ చిత్ర పరిశ్రమ…
తెలుగు చిత్ర పరిశ్రమ నష్టం రూ.800 కోట్లకు పైమాటే..
- సంక్షోభం దిశగా 100 ఏళ్ల చిత్ర పరిశ్రమ
- షూటింగులు పూర్తయిన సినిమాలకు పెరిగిపోతున్న వడ్డీలు
- భారీ నిర్మాతలనుంచి రోజువారీ సినీ కార్మికుల దాకా..
- రెండు తెలుగు రాష్ట్రాలలో 800కు పైగా మల్టీ ప్లెక్స్ లు
- ఒక్కో థియేటర్‌కు సగటున నెలకు 3 లక్షలు అద్దె
- టీవీ, సినిమాల షూటింగులతో నెట్టుకొస్తున్న కార్మికులకు తీరని నష్టం
- నెల రోజులుగా సినీ పెద్దల సాయంతోనే కడుపునంపుకుంటున్న దైన్యం
- ఎప్పటికి సినీరంగం మళ్లీ దారిలోకి వస్తుందో చెప్పలేని స్థితి
హైదరాబాద్: కృష్ణానగరే మామ..లైఫంతా పస్తురా మామ అంటూ హీరో పాడే పాట అప్పట్లో చాలా ఫేమస్.. కృష్ణానగర్ లో నివాసం ఉ ండే ప్రతి సినీ కార్మికుడికీ ఆ పాట బాగా కనెక్ట్ అయింది. సినిమా కార్మికులకు ఇన్ని కష్టాలు ఉంటాయా అని రవితేజ నటించిన నేనింతే సినిమా ద్వారా దర్శకుడు పూరీ చక్కగా వివరణ ఇచ్చాడు. అయితే ఆ పాట సరిగ్గా ఇప్పటి పరిస్థితికి సరిపోతుందనిపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగిలినవాటితో పోలిస్తే ఈ రంగానికి వచ్చిన నష్టం చాలా ఎక్కువ. పైగా కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉ ంది. కరోనా భయం నేపథ్యంలో మునుపటిలా జనాలు థియేటర్లకు వస్తారా అనే సందేహం అటు నిర్మాతల నుంచి ఇటు థియేటర్ యజమానుల వరకు అందరిలో నెలకొంది. ఇప్పటికే సినిమాలు, షూటింగులు నిలిపేసి నెలరోజులు దాటేసింది. తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రపంచం కనీవినీ ఎరుగని ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తోంది. ఈ ప్రభావం సినీ రంగం పై కూడా తీవ్ర స్థాయిలో పడింది. కరోనా ప్రభావం కారణంగా భారతీయ సినీ పరిశ్రమ ఏకంగా రూ.3000 కోట్లు నష్టపోయిందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా మన దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దాదాపు రూ. 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. ఒక్క టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే రూ. 800 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్టు సమాచారం. ఒక్కో వీకెండ్ కు ఇండియన్ సినిమాకు రూ.500 కోట్ల చొప్పున నష్టం కలుగుతోందట. బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలైన సూర్యవంశీ, 83, వంటివి కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. భారత్ లో మే లేదా జూన్ తర్వాత పరిస్థితి సద్దుమ ణిగినప్పటికీ ఓవర్సీస్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఆమెరికాతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ వంటి దేశాల్లో మే నెల చివరి వరకు థియేటర్లు, మాల్స్ తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నష్టం మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఈ రంగం పై ఆధారపడిన చాలామంది ఉపాధి కోల్పోయినట్టయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1600 థియేటర్లు ఉన్నాయి. ఇందులో 800 వరకు మల్టీ ప్లెక్స్ లే. ఒక్కో థియేటర్ కు నెలకు సగటున రూ.3 లక్షల అద్దె ఉండగా.. కార్మికుల జీతాలకు రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తారు. నెలరోజులుగా సినిమాలు వేయకపోవడంతో ఈ మేరకు కార్మికులు తమ ఆదాయం కోల్పోయారు. మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ, సినిమా హాళ్లకు వెంటనే అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవేళ ఏ జూన్ కో అనుమతి వచ్చినా.. మునుపటిలా జనం థియేటర్లకు వస్తారా అన్నది సందేహమే. సినిమాలకు సమ్మర్ సీజన్ చాలా కీలకం. కానీ కరోనా కారణంగా ఈ సమ్మర్ సీజన్ మొత్తం వృథా అయిపోయింది. దీంతో పలు చిన్న సినిమాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. పూర్తిస్థాయిలో థియేటర్లు ప్రారంభమైన తర్వాత కూడా జనం సినిమాలు చూడటానికి భయపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏం చేయాలా అని పరిశ్రమకు చెందిన పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. చైనా తరహాలో థియేటర్ సామర్థ్యంలో సగం టికెట్లు మాత్రమే అమ్మాలని యోచిస్తున్నారు. అంటే.. సీటుకి, సీటుకి మధ్య ఒకటి రెండు సీట్లు ఖాళీ ఉంచాలన్నది దీని ఉద్దేశం. అదే సమయంలో టికెట్ రేట్లు కూడా తగ్గించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. తద్వారా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సినిమాలో చూసిన కష్టాలు ఇప్పుడు సినిమారంగాన్ని చుట్టుముట్టాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మంచి ఆదాయ వనరుగా మారింది. తెలుగు అగ్ర హీరోలందరికీ ఓవర్సీస్ మార్కెట్ భారీ కలెక్షన్లు అందిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా కుదేలైంది. ప్రస్తుతం షూటింగ్లు, సినిమా థియేటర్లు బంద్ అయిపోయాయి. భారత్ లో మే నెల నుంచి పరిస్థితి చక్కబడవచ్చని ఆశిస్తున్నారు. అయితే ఓవర్సీస్ మార్కెట్ మాత్రం ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు. కరోనా కారణంగా భారీ నష్టం మూటగట్టుకున్న అమెరికాలో ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు లేవు. ఆరు నెలల తర్వాతే పరిస్థితి చక్కబడవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా జనాలు ఇంతకుముందులాగా క్యూ కట్టే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ మార్కెట్ పై నిర్మాతలు ఆశలు వదిలేసుకోవాల్సిందేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత నెల రోజులుగా కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ లాక్ డవున్లోకి వెళ్ళిపోయారు. ఎవరికి వారు ఇళ్ళకే పరిమితమయిపోయి ఎక్కడికక్కడ అన్ని మూసివేయబడ్డాయి. ప్రతి వ్యాపారానికి అన్ని రంగాలకు ఈ కరోనా ఎఫెక్ట్ చాలా గట్టిగా పడిందని చెప్పాలి. మును పెన్నడూ జరగనంతగా ఆర్ధిక నష్టం జరిగిందని చెప్పాలి. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద పడినట్లే సినీ రంగం మీద కాస్త ఎక్కువగా పడిందని చెప్పాలి. ఎక్కడి కక్కడ పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. ఇక షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ రెఢీగా ఉన్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. దీంతో మొత్తం సినీరంగం అంతా సైలెంట్ అయిపోయింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. మరో రెండు నెలల వరకు సినిమా షూటింగ్లు ఉండవు. జూన్ నుంచి షూటింగ్లు సినిమా ప్రారంభోత్సవాలు మొదలయినప్పటికీ అవన్నీ పూర్తయి విడుదలకు టైమ్ పడుతుంది. ఇక ఇదిలా ఉంటే… ఒక నాలుగు నెలల తర్వాత అయినా సినిమాలు విడుదలయితే థియేటర్ కి వచ్చి సినిమా చూసే జనం థియేటర్లకు వచ్చి మరీ సినిమాలు చూస్తారని గ్యారెంటీ అయితే లేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు బెంబేలెత్తిపోతున్నారు. అన్నిటికంటే అతి పెద్ద ఎంటర్ టైన్మెంట్ రంగమైన సినీ రంగం ఈ విధంగా కుప్పకూలిపోతుందని ఎవ్వరూ ఊహించని రీతిలో ఇది జరిగింది. మరి నిర్మాతలు, డిస్ట్రిట్యూటర్లు ఇలా ఉంటే…ఒక సినిమాలో నటించడానికి తారలు వాళ్ళ వాళ్ళకుండే క్రేజ్ ని బట్టి కొన్ని వేల కోట్లు తీసుకుంటున్నారు. మరి ఈ కరోనాతో చాలా నష్టం జరిగింది కాబట్టి పారితోషకాలు వాళ్ళు ఏమన్నా తగ్గించుకుంటారా…అలాగే ఇప్పటి వరకు అడ్వాన్లు తీసుకున్న కొంత మంది హీరోలుగాని, హీరోయిన్లుగాని తిరిగి కొంత వరకు ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా లేదా అన్నది చూడాలి.