వైద్య సిబ్బంది పై దాడిచేస్తే 7 ఏళ్ల వరకు జైలు
కీలక ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కరోనా పై యావత్ దేశం పోరాడుతున్న వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వైద్య సిబ్బంది పై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇక పై ఎవరైనా కరోనా పై పోరాడుతున్న వైద్య సిబ్బంది పై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు 1987 నాటి అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాకు వివరించారు. కరోనా పై దేశాన్ని కాపాడుతున్న వైద్య సిబ్బంది పై దాడులు జరగడం హేయమని కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఇక పై అలాంటివి చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. ఇందుకోసం కఠిన నిబంధనలతో ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. వైద్యుల పై దాడికి పాల్పడిన వారి పై కేసు తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు విధిస్తామని, రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. దాడి సమయంలో వైద్య సిబ్బంది వాహనాలు, ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఆస్తి నష్టం సంభవిస్తే మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి అంతకు రెట్టింపు మొత్తాన్ని నిందితుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ అమల్లోకి రానుందని తెలిపారు. క్లిష్టమైన సమయంలో వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారని జావడేకర్ కొనియాడారు. కాబట్టి కరోనా విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ బాధితులకు ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కరోనా పై పోరుకు రూ.15వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విమాన సేవలు ప్రారంభం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవల పునరుద్ధరణకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని జావడేకర్ చెప్పారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 50 లక్షల మాస్క్ లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే 3 వరకూ విధించిన లాక్ డౌన్ అమలు తీరుతెన్నులను కేంద్ర మంత్రివర్గం సమీక్షించిందని చెప్పారు. లాక్ డౌన్ నియమ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పర్యవేక్షించామని తెలిపారు. భారత్ లో ఒక్క రోజులోనే 50 మరణాలు 20 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో దాదాపు 50మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనాతో (బుధవారం ఉదయానికి) 640మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,984కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3870మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం 19.36గా ఉందని ప్రభుత్వం తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. మహారాష్ట్రలో కొనసాగుతున్న మరణాలు… మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొవిడ్ సోకి ఇప్పటి వరకూ 251మంది మృత్యువాత పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 5218కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ ఈ వైరస్ బారినపడి 90మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2178కి చేరింది. మధ్యప్రదేశ్ లోనూ కరోనాతో మరణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ వైరసు 76మంది బలయ్యారు. దిల్లీలోనూ కరోనా వైరస్లో ఇప్పటివరకు 47మంది మరణించారు. కేసుల సంఖ్య 2156కు చేరింది. దేశంలో ఏడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేయి దాటింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 928కి చేరింది. వీరిలో 23మంది మరణించగా 194మంది కోలుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 761మంది ఈ వైరస్ బారినపడగా 22మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 96మంది కోలుకున్నారు.