ఆపద మొక్కులవాడ ఓ శ్రీనివాసా…
కరోనా నుంచి కాపాడు తిరుమలవాసా…
ఆపదలను తీర్చే ఆ శ్రీనివాసుడికే కరోనా వ్యాప్తితో ఆపద వచ్చి పడింది. లాక్ డౌ తో దేవాలయం మూసివేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా దేవాలయ ద్వారాలు తెరుచుకోలేక ఆ తిరుమల బోసిపోతోంది. వెలుగులు నింపే ఆ దైవ దీపం వెలవెలపోతోంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఆ తిరుమల కొండలు నేడు వన్యప్రాణులకు ఆటవిడుపుగా మారాయి. జగమంతా వెల్లివిరిసే ఆ దేవదేవుని చూపులు నేడు కరుణించలేని స్థితి ఏర్పడింది. తిరువీధులన్నీ వెలవెలబోతున్నాయి. రద్దీగా ఉండే తిరుమల బజారులన్నీ భక్తుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. ఆపదలను తీర్చే ఆ బ్రహ్మండ నాయకు డికి కరోనా దెబ్బకు ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఆపదలు తీర్చే దేవుడంటూ తిరుమలకు చేరే భక్తులు నేడు కరోనా నుంచి మా బతుకులను మంటల పాలుకాకుండా కాపాడి వెలుగులు నింపాలని, నీ చల్లని చూపులు తమ పై చూపాలని కోరుతున్నారు. తిరుమల ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శతాబ్దాల కాలం నుంచి నిత్యం భక్తుల రాకపోకలు సాగుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యాధులు, వైరస్ వ్యాప్తి కారణంగా తిరుమలను మూసివేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. గ్రహణాల సందర్భంగా కొన్ని గంటల పాటు ఆలయాలు మూసివేయడం చాలా సాధారణం. రెండేళ్ల క్రితం సంప్రోక్షణ పేరుతో బాలాలయం కోసం 9 రోజుల పాటు దర్శనాలు నిలిపివేశారు. బంద్, ఇతర ఆందోళనల కారణంగా కొన్ని రోజుల పాటు భక్తుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడిన అనుభవాలున్నాయి. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాకుండా ఆలయాన్ని మూసివేసినట్లు రికార్డులు ఉన్నాయి. గత ఏడాది ఈ సీజన్లో దాదాపు 18లక్షల మంది యాత్రికులు తిరుమల ఆలయంలో దర్శనాలు చేసుకున్నారు. అయితే ఈసారి వారి సంఖ్య సుమారు 14లక్షల వరకూ ఉండవచ్చని టీటీడీ అధికారులు అంచనాలు వేశారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఆలయానికి దర్శనాల కోసం వచ్చే వారి పై ఆంక్షలు విధించడంతో రాబోయే కొద్ది రోజుల పాటు తిరుమల పూర్తిగా బోసిపోయే అవకాశం కనిపిస్తోంది. కరోనాను కట్టడి చేసి ప్రపంచాన్ని కాపాడాలని అఖిలాండ బ్రహ్మండనాయకుడిని అశేష భక్తులు వేడుకుంటున్నారు.