కరోనా రెండోసారి రాదని గ్యారెంటీ లేదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టీకరణ

న్యూయార్క్ : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారికి మళ్లీ కరోనా వైరస్ సోకినట్లు అక్కడక్కడా వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమా, అబద్ధమా తెలియక ప్రజలు గందరగోళంలో పడగా, దీనికి ఏం సమాధానం చెప్పాలో 2009 తెలియక వైద్యులు ఇంతకాలం మౌనంగా ఉండిపోయారు. ఈ విషయంలో మొదటిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థనే నోరు విప్పింది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంతవరకు జరిపిన యాంటీ బాడీస్ (రోగ ప్రతిఘటనా) పరీక్షల్లో ఎక్కడ కూడా తమ రోగ నిరోధక శక్తి కారణంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ ఎపిడిమాలాజిస్టు తెలిపారు. అందుకని ఒకసారి వైరస్ బారిన పడి కోలుకున్న వారు మళ్లీ వైరస్ బారిన పడరన్న గ్యారంటీ లేదని వారు చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు 35 లక్షల రక్తం నమూనాల్లో యాంటీ బాడీస్ స్థాయిని పరీక్షించిందని, వాటిలో కరోన బారిన పడి కోలుకున్న వారి రక్తం నమూనాలను కూడా సేకరించిందని, అలా కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఎక్కువ ఉ న్న దాఖలాలు కనిపించలేదని డాక్టర్ మరియా వాన్ ఈ రోజు జెనీవాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. యాంటీ బాడీస్ ఎక్కువ ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ బారిన పడి కచ్చితంగా కోలుకుంటారని కూడా చెప్పలేమని ఆమె తెలిపారు. పలు దేశాల నుంచి సేకరించిన రక్తం నమూనాలను పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం ధ్రువపడిందని ఆమె అన్నారు. ఈ కారణంగా ఒక్కసారి కరోనా బారిన పడి కోలుకున్నవారు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడరని కూడా చెప్పలేమని చెప్పారు. మానవాళి పై ప్రతాపం చూపుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్ డౌన్, సామాజిక దూరం, హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి అస్త్రాలతో వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నారు. అయినా ఓవైపు కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు వైరస్ బారినపడిన చాలామంది కోలుకుంటున్నారు. అయితే కరోనా కోరలు నుంచి పూర్తిగా కోలుకున్న వారికి వైరస్ మళ్లీ తిరగబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ కొరియాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రెండు శాతం మంది బాధితులకు మరోసారి కరోనా పాజిటివ్ గా తేలడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వైరసను కొంత మేర నియంత్రించామని ఊరట చెందుతున్న వేళ మళ్లీ తిరగబడటం కలకలం రేపుతోంది. దక్షిణ కొరియా వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7829మంది కోలుకున్నారు. అయితే వీరిలో చాలా మందికి తాజాగా లక్షణాలు కనిపించడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వారిలో 163 మందికి పైగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారితో పాటు మరో 300 మందిని క్వారెంటైన్ కు తరలించారు. ఇక దీని పై వైద్యులు స్పందిస్తూ వైరస్ నుంచి కోలుకున్న వారికి మళ్లీ పాజిటివ్ గా తేలడం అసాధ్యమని తెలుపుతుండగా.. తాజా కేసుల పై ఆ దేశ వైద్య విభాగం ఆరా తీస్తోంది.