వామ్మో నిత్యావసరాలు

బె’ధర’ గొట్టేస్తున్నాయి! లాక్ డౌన్ ప్రభావంతో కొండెక్కిన ధరలు…సామాన్యుడికి చుక్కలు 

  • 25 నుంచి 30 శాతం పెరిగిన సరుకులు
  • పొరుగు రాష్ట్రాలనుంచి రవాణా నిలిపివేత
  • కిరాణా దుకాణదారుల కిరికిరి
  • అడిగిన సరుకు ఇయ్యకుండా నాసిరకంతో మోసం
  • డబుల్ రేట్లతో కొనసాగిస్తున్న అమ్మకాలు
  • పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
  • పాలప్యాకెట్లనుంచి పప్పు, నూనెల దాకా..అదే తీరు 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నెల చివరి వారం వరకు ధరలు నియంత్రణలోనే ఉన్నా, ఈ నెల తొలి వారం నుంచి సరుకుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల ధరలు గతానికన్నా తగ్గినా, పప్పులు, నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కిందటి నెలలో కందిపప్పు ధర కిలో రూ.75 నుంచి రూ.85 మధ్యలో ఉండేది. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో మేలురకం కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.130కి చేరింది. దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ల నుంచి రాష్ట్రానికి సరఫరా తగ్గుతోంది. వాహనాల రాకపోకలకు ఆటంకాలు, సిబ్బంది కొరతతో అక్కడి నుంచి సరఫరా ఆగడంతో ధరలు పెరిగాయి. పెసర, మినపపప్పు ధరలు సైతం ఇంతకింతకీ పెరుగుతున్నాయి.సరఫరాలో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20% నుంచి 25% వరకు ఉంది. పెసర పప్పు ధర వారం కింద రూ.85 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.130 140కి చేరింది. మినపపప్పు ధర సైతం కిలో రూ. 130-135కి పైనే ఉంది. ఇక వంట నూనెల ధరలు సైతం 15 నుంచి 20% పెరిగాయని వినియోగదారుల మంత్రిత్వశాఖే చెబుతోంది. సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. లీటర్ పామాయిల్ ధర రూ.90 ఉండగా, అది ఇప్పుడు రూ.110-120కి చేరింది. ఈ దృష్ట్యా పప్పులు, నూనెల ధరలను నియంత్రించాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ఘోంశాఖ రాష్ట్రాలకు ఆదేశించింది. ముఖ్యంగా నిల్వలపై పరిమితులు విధించడం, ధరలు తగ్గించడం, డీలర్ల ఖాతాల తనిఖీలు చేపడుతూనే నిత్యావసర సరుకుల చట్టం కింద బ్లాక్ మార్కెట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు, ఏడేళ్ల జైలు శిక్షలు విధించాలని సూచించింది. దీనికై రాష్ట్ర యంత్రాంగాలు విస్తృత తనిఖీలు చేపట్టి అరెస్టు చేయాలని కోరింది. ఇప్పటికే ఆహార ధాన్యాల రవాణాను పెంచే క్రమంలో 109 ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ 21,247 వ్యాగన్ల ద్వారా ఉప్పు, చక్కెర, వంటనూనెలు, కంది, బియ్యం వంటి సరుకుల రవాణా చేసిందని, సరుకుల కొరత రాకుండా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని ప్రకటించింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. లాక్ డౌన్ పరిస్థితులను ఆసరాగా చేసుకొని సరుకుల ధరలను వ్యాపారులు ఇష్టమొచ్చినట్లు పెంచేసి అమ్ముతున్నారు. వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో అక్రమంగా సరుకులను నిల్వచేసినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా కేసులు నమోదుచేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే హెచ్చరికలు జారీ చేశాయి. అయినా వాటిని వ్యాపారులు బేఖాతర్ చేస్తున్నారు. ఎమ్మార్పీని మించి ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముతున్నారు. లాక్ డౌన్లో ప్రజలకు నిత్యావసర సరుకుల పరంగా కొరత లేకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నప్పటికీ ప్రజల అవసరాలను గుర్తెరిగి నిత్యావసర సరుకులను తరలించే వాహనాలకు అనుమతిచ్చేలా చర్యలు తీసుకున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వాలు ఇంత చేస్తుంటే.. వ్యాపారులేమో వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. నిత్యావసర సరుకులను రహస్య ప్రదేశాల్లో, గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల విక్రయాలకు ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్ లోని బేగంబజార్, సుల్తాన్ బజార్, మలక్ పేటల్లో కూడా వ్యాపారులు క త్రిమ కొరత సృష్టించి ధరలు విపరీతంగా పెంచేశారు. రిటైల్ వ్యాపారులతోపాటు హెల్ సేల్ వ్యాపారులు కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్ లో అక్కడక్కడా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్న అధికారులు కేసులు నమోదుచేస్తున్నారు. ధరల పెరుగుదలకు కారణమైన బడా వ్యాపారులను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ దాల్ మిల్స్ అండ్ , మర్చంట్స్ అసోసియేషన్ తాజాగా ఓ ధరల సూచీని విడుదలచేసింది. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కు కూడా ఆ ధరల వివరాలను పంపించారు. కానీ వాటికి, మార్కెట్లో ధరలకు పొంతనే ఉండడం లేదు. ఆకాశంలో పప్పులు.. పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. క్వాలిటీ నంబర్-1, 2 అని 2 రకాల ధరలు గతంలో ఉండేవి. ఇప్పుడవేం లేవు. రెండో రకం పప్పును కూడా నంబర్ వన్ క్వాలిటీ ధరకే అమ్ముతున్నారు. కంది పప్పు ధర రూ.30 వరకు అదనంగా పెంచారు. శనగ పప్పు రూ.34-36 అదనంగా అమ్ముతున్నారు. చక్కెర రూ.6 పెరిగింది. ఉల్లిగడ్డ బయట కిలో రూ.25కు దొరుకుతుంటే కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో రూ.45 చొప్పున అమ్ముతున్నారు. నూనె కిలోకు రూ.13-15 పెరిగింది. ఇక కిలో చికెన్( స్కిమ్స) ధర రూ.190 పలుకుతోంది. మటన్ ధర కూడా తగ్గించలేదు. కిలోకు రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కిలో రూ.550, పట్టణాల్లో రూ. 600 చొప్పున మటన్ అమ్మాలని అధికారులు నిర్దేశించిన ధరలను ఏ వ్యాపారీ పట్టించుకోవడం లేదు. స్టాక్ నింపడంలో జాప్యం ! హైదరాబాద్ లోని చాలా సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో సరుకులు నిండుకుంటున్నాయి. స్టాక్ నింపడంలో జాప్యం వల్లనే దుకాణాలు ఖాళీ అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల లారీలకు తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు వెంటనే అనుమతులు ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయని కిరాణా స్టోర్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ తెలిపారు. కారణం బడా వ్యాపారులే నగరంలోని కాలనీల్లో కనిపించే దుకాణాల్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరిగిపోవడానికి బడా వ్యాపారులే కారణం! లాక్ డౌన్ వల్ల రవాణా సౌకర్యం లేదని చెబుతూ ధరలు పెంచేస్తున్నారు. పప్పు ధాన్యాల మొదలు నిత్యావసర వస్తువులన్నీ మూడు నాలుగు దశల తర్వాతనే చిన్న వ్యాపారి చేతికి చేరతాయి. నిజంగా రవాణా సౌకర్యం లేకపోతే గడిచిన రెండు వారాల్లో సరుకును నిర్విరామంగా ఎలా అమ్మగలుగుతున్నారన్నది ప్రశ్న. హెూల్ సేల్ వ్యాపారులు పలువురు తమ వద్దనున్న సరుకు అయిపోవచ్చిందని చెబుతూ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. వీరంతా కలిసి క్రమపద్ధతిలో ధరలు పెంచేస్తారు. రెండు మూడు రోజులకోసారి కేజీకి రూ.2-3 చొప్పున పెంచుతుంటారు. దీంతో రెండు వారాలు గడిచేసరికి ధరలు భారీగా పెరిగిపోతాయి. చిన్న వ్యాపారులు మారు మాట్లాడకుండా కొని తమకు వచ్చిన ధరకు మరికొంత లాభాన్ని జోడించి అమ్మేస్తున్నారు. చివరకు నష్టపోతున్నది సామాన్యుడే.