సామాజిక దూరం ముహూర్తాలు భారం

మరో ఏడాది తర్వాతే పెళ్లిళ్లు, పేరంటాలు..కరోనా దెబ్బకు అన్నీ వాయిదాలు 

  • గతేడాది సరైన ముహూర్తాలు లేక ఆగిపోయిన పెళ్లిళ్లు
  • ఈ సారి అన్నీ బాగున్నాయనుకునేలోగా కరోనా దెబ్బకు విలవిల
  • గతంలో కమిట్ అయిన కట్నం ఇప్పుడు ఇచ్చుకునే స్థితిలో లేరు 
  • అడ్వాన్సులు చెల్లించలేమంటున్న మండపాల నిర్వాహకులు
  • ముహూర్తాలు దాటిపోవడంతో మళ్లీ ఎప్పటికో అనే సందేహం
  • అసలు జరుగుతుందా లేదా అని వధూవరుల మనస్తాపం
  • ఇప్పటికే లేటెస్ట్ గా పెళ్లయిన జంటలకు సామాజిక దూరం శాపం
  • ఆగష్టులో వచ్చే ముహూర్తాలపైనే ఆశలన్నీ.. 

సరిగ్గా పీటల మీద పెళ్లికూతురు మెడలో పెళ్లి కొడుకు తాళికట్టే సన్నివేశంలో…సరిగ్గా సమయం చూసుకుని ఆపండి ఈ పెళ్లి అంటూ ఏదో ఒక పాత్ర వస్తుంది..ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూసే సినిమాలలో కనిపించే రొటీన్ సీన్స్….ఇప్పుడు నిజ జీవితంలోనూ ఈ పెళ్లిళ్ల సీజన్లో చక్కగా బంధుమిత్ర సమేతంగా, వేద మంత్రాల సాక్షిగా ముహూర్తాలు పెట్టించుకుని రెడీ అయ్యారు వధూవరులు. అంతలోనే మహమ్మారి కరోనా విజృంభణ, లాక్ డౌన్ వంటి ఊహాతీత వాస్తవాలు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలపై పెద్ద దెబ్బే వేసింది. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చుకుని..మళ్లీ పెళ్లి ఎప్పుడవుతుందో లేదో తెలియని సంకట స్థితిలో సగటు పెళ్లి కూతుళ్ల తండ్రులు తలలు పట్టుకుని కూర్చుకుంటున్నారు. శ్రావణమాసంలో మౌడ్యం రావడంతో గత సంవత్సరం మంచి ముహూర్తాలు లేక అంతంతమాత్రంగానే శుభకార్యాలు జరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్ళిళ్లు ఇతర శుభకార్యాలు నిర్వహించడానికి పెద్దలు సిద్ధమయ్యారు. కరోనా రూపంలో సమస్య రావడంతో మరోసారి శుభకార్యాలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలోకి పెళ్లి పెద్దలు ఉండటంతో, వీటిపైన ఆధారపడిన వ్యాపారులు, కార్మికులు పరిస్థితి అగోమ్యగోచరంగా మారింది. మే 23 వరకే మంచి ముహూర్తాలు శ్రీరామ కల్యాణం తరువాత మంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయని ఇవి మే 23 వతేదీ వరకు మాత్రమే కొనసాగుతాయని పురోహితులు అంటున్నారు. మే23వ తేదీన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుందని, సాధారణంగా ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో మంచి ముహూర్తాలు ఉ ంటాయని, కానీ ఈసారి ఇదేమాసంలో మౌఢ్యం రావడంతో జూన్ 10 వరకు ఎటువంటి శు భకార్యాలు జరిపేందుకు వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ తరువాత కూడా ఒకటి రెండు తప్ప పెద్దగా ముహూర్తాలు లేవు. ఆ వెంటనే ఆషాఢం వస్తుంది… కాబట్టి జూలై చివరి వరకు శుభకార్యాలు జరపడానికి వీల్లేదు. తర్వాత వినాయకచవితి పండుగ, ఆశ్వయుజమాసం అధికమాసం కావడం వంటి కారణాలతో మే 23 తరువాత పెద్దగా మంచి ముహూర్తాలు లేవు. ఉపాధిపై త్రీవ ప్రభావం శుభకార్యాలు వాయిదా పడటంతో వీటినే నమ్ముకున్న మండపాలు, పురోహితులు, క్యాటరింగ్ లో పాటు ఇతర రంగాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఓ వివాహంపై దాదాపు 24 రకాల సేవలు ఆధారపడి ఉపాధి పొందుతూ ఉంటాయి. ఇప్పుడు వీటిన్నిటిపై త్రీవ ప్రభావం పడనుంది. రాష్ట్రంలో వివాహాలకు, ఇతర శుభకార్యాలకు అధికంగా ఖర్చు పెట్టే జిల్లాలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల తరువాత స్థానంలో మన జిల్లా ఉంది. ఇక్కడ ఒక శుభకార్యానికి సరాసరి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తారని ఒక అంచనా. పరిస్థితి మే 23 వరకు ఇలానే కొనసాగితే దాదాపుగా జిల్లాలో 5 వేల శుభకార్యాలు వాయిదా పడతాయనేది మరో అంచనా. దీంతో వ్యాపారులు, కార్మికులు సుమారు రూ.200 కోట్ల మేర నష్ట పోతున్నాయి. అడ్వాన్లు తిరిగి చెల్లించలేం… చాలామంది తమ ఇంట జరిగే వివాహాలకు ఇప్పటికే మండపాలకు, సన్నాయి, క్యాటరింగ్ వంటి వాటితో పాటు ఇతరత్రా వాటికి అడ్వాన్లు ఇచ్చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో అడ్వాన్లు తిరిగి ఇవ్వాలని చాలామంది అడుగుతుండటంతో తిరిగి చెల్లించలేమని, మరోసారి మీరు ముహూర్తం పెట్టుకున్నప్పుడు మీకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని అడ్వాన్స్ తీసుకున్నవారు స్పష్టం చేస్తున్నారు. ఆర్బాటాలు లేకుండా సాధారణంగా తతంగం కానిద్దామనుకున్నా రాకపోకలు లేకపోవడం, దేవాలయాలు కూడా మూసివేశారు. ఏదేమైనా మళ్లీ మహూర్తం అంటే మరోసారి లగ్నపత్రిక రాయించుకోవాలని పురోహితులు స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమమైపోయేంత సామాజిక భద్రతతోపాటు దూరం అనివార్యమైన పరిస్థితుల్లో ముందుగా కుదుర్చుకున్న వివాహాల్లో అయోమయం ఏర్పడింది. గత నెల 26,28,29 తేదీల్లో జరగాల్సిన పెళ్లిళ్లకు జిల్లాలోని పలు కుటుంబాలు శుభ లేఖలు కూడా పంచిపెట్టేశారు. అన్నింటికీ ఆర్డర్లు ఇచ్చేసి…అడ్వాన్సులు కూడా చెల్లించేసి పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉ న్నారు. అయితే రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎక్కువ కావడంతో పునరాలోచనల్లో పడ్డారు. జనం అధిక సంఖ్యలో ఒకే చోట సమూహంగా ఉండకూడదన్న ఆంక్షలతో కల్యాణ మండపాల్లో వేడుకలను కూడా రద్దు చేయిస్తున్నారు. ముమ్మిడివరంలో నాలుగు రోజుల కిందట ఓ కల్యాణ మండపంలో భారీ ఏర్పాట్లతో జరుగుతున్న పెళ్లి వేడుకలను అధికారులు జరగకుండా అడ్డుకున్నారు. అమలాపురంలో ఈ నెల 28, 29 తేదీల్లో కూడా రెండు కుటుంబాలు నిరాడంబరంగా ఇరు కుటుంబాల నుంచి పది, పదిహేను మంది మధ్య జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా తగ్గిన తర్వాత వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానిస్తామని బంధువులు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ మెసేజ్ లు ద్వారా పెళ్లి నిర్వాహకులు పంపించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క అమలాపురంలోనే కాదు జిల్లా అంతటా ఉ ంది. ఇప్పటికే ఖాయమైన పెళ్లిళ్లు నాలుగు నెలలపాటు వాయిదా.. నిశ్చితార్థాలు ముగించుకుని ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తాలు పెట్టించుకుందామనుకుంటున్న వారు కరోనా తీవ్రత, ఆంక్షలతో ఆగస్టు నెలకు అంటే దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేసుకుంటున్నారు. అమలాపురం, అంబాజీపేట, రాజోలు, రావులపాలెం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఇలాగే నిశ్చితార్ధం చేసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు. అడ్వాన్సుల రూపంలో రూ.1.50 కోట్ల నష్టం పలు జిల్లాలలో కరోనా వైరస్ అలజడి వచ్చిన తర్వాత జరగాల్సిన పెళ్లిళ్లు జిల్లాలో దాదాపు 230 వరకూ ఉన్నట్లు తెలిసింది. ఈ పెళ్లిళ్ల కుటుంబాల వారు తమ తమ ఆర్థిక తాహతును బట్టి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చులు చేసేవారున్నారు. ఇందులో 65 శాతం కల్యాణ మండపాలను రూ.లక్షలు వెచ్చించి బుక్ చేసుకున్నారు. ఇప్పటికే కల్యాణ మండపాలకే కాకుండా బ్యాండ్ మేళాలు, భోజనాలు, వంట పాత్రలు, షామియానాలు, విద్యుద్దీపాలు, వేదికల అలంకరణ, శుభ లేఖల ముద్రణ తదితర ఈవెంట్సకు అడ్వాన్సుల పేరుతో జిల్లా వ్యాప్తంగా రూ.1.50 కోట్ల వరకూ వెచ్చించినట్టు సమాచారం. ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలు ఇంట్లో పెళ్లికంటే ఇంటిల్లిపాదీ ఆరోగ్యం ముఖ్యం. కరోనాతో ఇప్పుడు పెళ్లిళ్లు బాగా చేసుకోలేకపోతున్నామని…వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఎవరూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే ఎలాగూ మే నెల తర్వాత మూడు నెలలు ముహూర్తాలు లేవు. ఆగస్టు నెల నుంచి మంచి మంచి ముహూర్తాలున్నాయి. ఆ ముహూర్తాల్లో ఇప్పటికే నిశ్చితార్థాలతో కుదుర్చుకున్న పెళ్లిను బాగా చేసుకోవచ్చు. కరోనా వైరస్ ను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు విధిస్తున్న ఆంక్షలకు మన ఆరోగ్యాం కోసం విలువ ఇద్దాం. ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాలను కాపాడుకుందాం.