లాక్ డౌన్-2 షురూ!
వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి సూచించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- రెండు గంటలపాటు కొనసాగిన కాన్ఫరెన్స్
- లాక్ డౌన్ కొనసాగింపుపైనే ప్రధాన చర్చ
- నెలాఖరుదాకా పొడిగించాలని కోరిన కేసీఆర్
- రెడ్ జోన్ పరిధి వరకే కొనసాగించాలన్న వైఎస్ జగన్
- దేశవ్యాప్తంగా కఠినంగా అమలుచేయాలని సూచనలు
- నిధులిచ్చి ఆదుకోవాలన్న పంజాబ్ సీఎం
- వారానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానన్న మోదీ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ కొనసాగింపుపై ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సూచనలు స్వీకరించారు. రాష్ట్రాల వారీగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. దేశవ్యాప్తంగా సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ ఈ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ బాగా ఉపయోగపడుతోందన్నారు. అందువల్ల దీన్ని కనీసం మరో రెండు వారాలు కొనసాగించడం మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంతకుమించిన మార్గం లేదన్నారు. కరోనాపై యుద్ధంలో భారత్ తప్పక గెలిచి తీరుతుందని సీఎం ఆకాంక్షించారు. లాక్ డౌన్ రెజోన్ల వరకే పరిమితం చేయండి: ప్రధానితో సీఎం జగన్ రెడ్ జోన్ల వరకే లాక్ డౌన్ ను పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జగన్.. రాష్ట్రంలో 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని తెలిపారు. ఈ మండలాల్లోనే లాక్ డౌన్ కొనసాగించాలని కోరారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలు యథావిథిగా మూసివేయవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్త లాక్ డౌన్ కే మొగ్గు.. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రథమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ప్రధానితో అన్నారు. ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని పలు రాష్ట్రాల సీఎంలు సూచించారు. రాష్ట్రాల వారిగా కంటే.. దేశవ్యాప్తంగా లా డౌన్ ఉండాలని, అప్పుడే కరోనాను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు.. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, కిట్లు, మందులపై ప్రధాని సీఎంలకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా దాన్ని కట్టడి చేసేందుకు లాక్ డౌనను మరో రెండు వారాల పాటు పొడిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ తమ రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు లాక్ డౌనన్ను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌనను పొడిగించాలని కోరాయి . వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రధాని లాక్ డౌనను పొడిగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రాష్ట్రాలకు త్వరగా పంపించాలని అన్నారు. కాగా, రాష్ట్రాలకు 24 గంటలపాటు అందుబాటులో ఉంటానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘మీకు ఏ కష్టమొచ్చినా నాకు చెప్పండి’అని ప్రధాని వ్యాఖ్యానించారు. సమస్య నుంచి బయటపడేందుకు వ్యూహం ఉందని ఆయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 239 మరణాలు సంభవించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంట్లో తయారు చేసుకున్న మాస్కును ధరించి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం విశేషం. తెలుపు రంగులో ఉన్న ఈ మాస్క్ ను ధరించి మోదీ ముఖ్యమంత్రులతో చర్చ జరిపారు. కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మాలు లేకుండా బయటకు రావొద్దంటూ కఠిన నిబంధనలు పెట్టాయి. ఈ క్రమంలో మాస్కుల కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటి వద్దే మాస్కులు ఎలా తయారు చేసుకోవాలో సూచనలు చేశాయి. ఇప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఇంట్లో తయారు చేసిన మాస్క్ ధరించి.. మరోసారి కోవిడ్-19 నుంచి కాపాడుకొనేందుకు తప్పకుండా మాస్కులు ధరించాలంటూ ప్రజలకు పరోక్షంగా సందేశం ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. మోదీతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, యోగీ ఆదిత్యనాథ్ లు కూడా మాస్కులు ధరించారు. మహమ్మారిపై మనుగడ పోరాటం ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం ఎంత ముఖ్యమో, ప్రస్తుత పరిస్థితుల్లో పేదవాడికి సాయం చేయడమూ అంతే కీలకం. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రాణాంతక మహమ్మారిపై పోరాటం సుదీర్ఘంగా సాగే పరిస్థితే కనిపిస్తోంది. ముగింపు దరిదాపుల్లో గోచరించడంలేదు. తల్లిగీ జమాత్ ఉదంతం బయటపడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య, పోలీసు సేవలు మరింత అవసరమయ్యాయి. త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశిద్దాం. ఇప్పటికైతే, మన జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భావించవచ్చు. అభివృద్ధి చెందిన, సమున్నతమైన ఆరోగ్య వ్యవస్థల్ని కలిగి ఉన్న దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యాధి తలసరి సంక్రమణ రేటు తక్కువగానే ఉంది. మహమ్మారిపై పోరాటం ముగిస్తే, ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాల్ని ప్రారంభించే విషయంలో అధికారులు త్వరలోనే పునరాలోచన చేయాల్సి ఉంది. మూసివేత కారణంగా ఇప్పటికే భారీ ఆర్థిక నష్టం సంభవించింది. కొన్ని అంచనాల ప్రకారం ఇది జీడీపీలో నాలుగు శాతం దాకా నష్టానికి దారితీసి ఉంటుంది. ఈ విషయంలో నిర్దిష్టమైన అంకెలు అందుబాటులోకి రాకున్నా, ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రస్థాయి మాంద్యాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా వృద్ధి నాలుగు శాతం, అంతకన్నా తక్కువగానే ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి అంత సానుకూలంగా ఏమీలేదు. ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకునేందుకు కనీసం రెండు త్రైమాసికాలైనా పట్టొచ్చు. పునరుత్తేజానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలనే విషయంలో భిన్నరకాల చర్చలు సాగుతున్నాయి. ఆంగ్లంలో ‘వి’ అక్షరంలా ఉండాలా (అంటే… ఒక్కసారిగా పతనం, అంతేవేగంగా ఊర్ధ్వముఖంగా లేవడం), ‘డబ్ల్యూ’లా ఉండాలా (అకస్మాత్తుగా పతనం, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ముందు ఒక మోస్తరుగా కోలుకోవడం), ‘ఎల్’ ఆకృతిలోనా (వేగంగా పతనమై, కనిష్ఠ స్థాయుల్లో అక్కడే స్థిరపడిపోవడం) అనేది తాజా చర్చ. ఈ పద్ధతుల్లో దేన్ని అనుసరించాలనే విషయం తేలాల్సి ఉంది. వీటిలో ఏది జరుగుతుందనేది కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఆర్థిక శాస్త్రం అసంపూర్ణమైనది, విభిన్నరకాల పరిస్థితులపై ఆధారపడుతుంది. వాస్తవానికి మాంద్యం తర్వాత కోలుకునే ప్రక్రియ- చాలాకాలంపాటు బలహీనంగా ఉండిపోతుందని కొంతమంది ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు. వాస్తవ సంఖ్యలు ఏవైనాగానీ, చైనా, అమెరికా సహా అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా వేగంగా వృద్ధి చెందుతుందని అధికారిక అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితులన్నీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక కరోనా వైరస్ ప్యాకేజీని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లక్షల కొద్దీ ఉన్న రోజువారీ కూలీలు, చిన్న, మధ్యతరహా వ్యాపారుల ఇక్కట్లు తొలగించడానికి ఇలాంటి చర్యలు ఎంతైనా అవసరం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అనవసరమైన భారం పడకుండా పేదలు, బాధితులకు మరింత సహాయం ఎలా చేయాలనే విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్యాకేజీలో భాగంగా కేంద్రం ఇప్పటికే ప్రకటించిన రూ.1.76 లక్షల కోట్లకన్నా కనీసం మూడురెట్లు ఎక్కువగా సహాయం ప్రకటించాలని, కొన్ని నిబంధనలను సడలించాలని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ ప్యాకేజీని అనేక రెట్లు పెంచితే- అది భరించలేని ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని, ఇటీవలి రోజుల్లో ఇప్పటికే చాలా విలువను కోల్పోయిన కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి మార్చిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సుమారు రూ.1.20లక్షల కోట్లు ఉపసంహరించారు. దీనివల్ల సెన్సెక్స్ 53 శాతానికిపైగా పడిపోయింది. ఇది భారీ నష్టాలను మిగిల్చింది. మార్చిలో దేశీయ సంస్థలు రూ.55వేల కోట్లకుపైగా షేర్లను కొనుగోలు చేసినా, సూచీల పతనాన్ని అడ్డుకోవంలో విఫలమయ్యాయి. అందుకని, రెండు విభిన్న ధోరణుల నడుమ మధ్యే మార్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మిగతా విషయాలన్నింటికంటే ప్రజల జీవ నోపాధికి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యం కల్పించాలి. అదేసమయంలో, కేంద్ర, రాష్ట్రాల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే పేదలతో పాటు, సంపన్నులూ తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బలమైన వృద్ధి నుంచి పేదలు విభిన్న మార్గాల్లో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక సరళీకరణ చర్యల అనంతరం కాలంలో అనేకమంది పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడిన సంగతి మరవకూడదు. ప్రస్తుతానికి వస్తే- 21 రోజుల జాతీయ లాక్ డౌన్ ముగిసేనాటికి ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు సాధ్యమైనంతవరకు కార్యకలాపాలు ప్రారంభించేలా కృషి చేయాలి. ప్రస్తుతం కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ఎలాంటి పరిస్థితుల్లోనూ బలహీనపడకుండా చూసుకోవాలి. సుదీర్ఘకాలంపాటు ఆర్థిక వ్యవస్థను మూసి ఉంచడాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఎంతమాత్రం భరించలేదన్న సంగతి అందరూ గుర్తించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తిరుగులేని స్థాయికి చేరుకున్నామని, ఎల్లెడలా సృజన పతాక ఎగురవేయగలిగామనిబీ ఆర్థిక పురోగతి, మౌలిక సౌకర్యాల విస్తరణలో కళ్లు చెదిరే విజయాలు సొంతం చేసుకున్నామని భావించిన ప్రభుత్వాలకు ఇది అనూహ్య శరాఘాతం. ఎన్ని అడుగులు ముందుకు వేసినా కంటికి కనిపించని ఓ వైరస్ ముందు మాత్రం మనిషి తాత్కాలికంగానైనా తలవంచక తప్పడం లేదు. వైరస్లు విరుచుకుపడి మానవాళి ఆరోగ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని సన్నద్ధత లేమిని ఈ పరిణామం బట్టబయలు చేసింది. దాంతో వ్యాధులు ప్రబలితే ఎదుర్కోలేని పాశ్చాత్య దేశాల డొల్లతనమూ వెల్లడైంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ ఇంచుమించుగా మూడు రకాల వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 1) భౌగోళికంగా కొన్ని ప్రాంతాలను పూర్తిగా స్తంభింపజేసి మనిషి సంచారాన్ని కట్టడి చేయడం. 2) కరోనా పాజిటివ్ వ్యక్తులను లేదా అనుమానిత లక్షణాలున్నవారిని సంపూర్ణంగా ‘క్వారంటైన్’ చేయడం. 3) కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వైద్యశాలల్లో చేర్చ అత్యవసర చికిత్స అందించడం. ఇప్పటివరకూ కొవిడ్-19ని ఎదుర్కొనే మందు లేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పట్టవచ్చు. అప్పటివరకూ సామాజిక దూరాన్ని అనుసరిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ క్రమశిక్షణతో మెలగడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఔషధాలు దరిదాపుల్లో లేని తరుణంలో సామాజిక చైతన్యంతోనే వైరస్ విస్తృతిని కట్టడి చేయాలి. కరోనా బాధితుల సంఖ్య పదుల లక్షలకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వైద్యశాలలన్నీ కిటకిటలాడుతున్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని ఆరోగ్య సంక్షోభం చుట్టుముట్టింది. ఈ సమస్య కనుమరుగు కావాలంటే ఇంకొంతకాలం ఓపిక పట్టక తప్పకపోవచ్చు. ‘లాక్ డౌన్’ను భారత్ లో పకడ్బందీగా అమలు చేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం. సభలూ, సమావేశాలకు చాపచుట్టేశారు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఐటీ సహా వివిధ రంగాలకు సంబంధించిన ఉ ద్యోగులు పూర్తిగా ఇళ్లనుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజారవాణా సంపూర్ణంగా స్తంభించిపోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా వైరస్ గొలుసును తెగొట్టడం కోసం తీసుకున్న చర్యలివి. క్రితం నెల 22న విధించిన జనతా కర్ఫ్యూ, అనంతరం మూడు వారాలపాటు నిర్దేశించిన ‘లా డౌన్’ ఆశావహ ఫలితాలను సాకారం చేస్తాయనడంలో సందేహం లేదు. కొవిడ్ లక్షణాలు ఎంతమందికి ఉన్నాయి, అనుమానితులు ఎందరు అన్న విషయాలకు సంబంధించిన నిర్దిష్ట శాస్త్రీయ గణాంకాలు అందుబాటులో లేవు. కాబట్టి, ఎంతో మందిని ఇంకా వైద్యశాలల్లో చేర్పించాల్సి ఉంది, అందుకు తగిన వసతులు అందుబాటులో ఉన్నాయా వంటి అంచనాలకూ ఇప్పుడు వీలు చిక్కడం లేదు. కొవిడ్ బారినపడినవారిలో కేవలం అయిదుశాతానికే వెంటిలేటర్ అవసరం ఉండవచ్చునని దాదాపుగా అధ్యయనాలన్నీ వెల్లడించాయి. ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగి వెంటిలేటర్లు పెద్దయెత్తున కావలసివస్తే- మనం అందుకు సంసిద్ధంగా ఉన్నామా అన్నదే ప్రశ్న. ముప్పు ఉరిమితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరోగ్య వ్యవస్థలు ఏ మూలకూ అక్కరకు రావన్నది నిజం. ప్రభుత్వ భవనాలను, రైల్వే బోగీలను తాత్కాలిక క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడం ఆహ్వానించదగిన చర్యే. కానీ, రేప్పొద్దున అవసరాలు పెరిగితే ఆ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు సరిపడా డాక్టర్లు, సహాయక సిబ్బంది మనవద్ద ఉన్నారా అంటే లేదన్నదే సమాధానం. మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ అంచనాల ప్రకారం అమెరికాలో ప్రజలు ఎవరి పనుల్లోకి వారు తిరిగి వెళ్ళి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సెప్టెంబరు లేదా అక్టోబరు వరకూ పట్టవచ్చు. ఈ ఏడాది నవంబరు మధ్యనుంచి వచ్చే మార్చి మధ్యకాలంలో మరోసారి కొవిడ్ ముప్పు ఉరిమే అవకాశం ఉందని ఆ సంస్థ వినిపించిన అంచనా అత్యంత ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ‘లాక్ డౌన్’ను కొనసాగించాల్సి ఉంది. దేశవ్యాప్త ‘లాక్ డౌన్’ భిన్న రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అసంఘటిత రంగ కార్మికులను, వలస కూలీలను, ఇళ్లలో పనులు చేసుకునేవారిని, ఏ రోజుకు ఆ రోజు కాయకష్టం చేస్తే తప్ప డొక్కాడని వర్గాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్’ కాలపరిమితి ముగిశాక ఆయా రంగాలకు కొత్త ఊపిరి పోసేందుకు బీ ఇప్పటికే చితికిపోయిన వివిధ వర్గాలను ఆదుకునేందుకు ఏం చేయాలన్నది ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు. ఈ వర్గాలను కాచుకొనేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. తద్వారా అన్ని వర్గాల సంపూర్ణ మద్దతుతో ‘లాక్ డౌన్’ను కొనసాగించి… కరోనా అంతు చూసేందుకు వీలు చిక్కుతుంది.