ఇంట్లోనే మాస్క్ లు చేసుకోండి

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్క్ లు ధరించాలంటూ డబ్ల్యు హెచ్ఓ, అమెరికా చేసిన సూచనల పై భారత ప్రభుత్వం స్పందించింది. ఇంట్లోనే మాస్కుల తయారీ, వాడకం పై శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంతవరకు సామాజిక దూరానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మాస్క్ లు వాడకం పై కూడా సూచనలు చేసింది. ఎలాంటి అనారోగ్యం, శ్వాస సంబంధ ఇబ్బందులు లేని వ్యక్తులు ముఖ్యంగా బయటకు వెళ్లేప్పుడు ఇంట్లోనే చేత్తో తయారు చేసిన, పునర్వినియోగించే మాస్కులను వాడాలని సూచిస్తున్నాం. దీని వల్ల వైరస్ సమూహ వ్యాప్తిని అడ్డుకోడానికి అవకాశం ఉంది’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే వీటిని వైద్య సిబ్బంది, కొవిడ్ 19 బాధితులు వాడకూడదని సూచించింది. అలాగే ఒక్కొక్కరు రెండు మాస్కులు తయారు చేసుకోవాలని, వాడిన వాటిని వెంటనే శుభ్రం చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా ఎవరి మాస్కు వారే వాడాలని వెల్లడించింది. ఆ మాస్కు మూతి, ముక్కు కప్పేసేలా ఉండాలని కూడా తెలిపింది. అయితే ఇన్ని రోజులు శ్వాస ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సామాజిక దూరం పాటించడం, చేతులతో చెవులు, కళ్లు ముక్కు, నోరు తాకకుండా చూడాలని సూచించారు. తాజాగా మాట్లాడటం, శ్వాసించడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించిన నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేసింది.