సామాజిక బంధం బలపడేది ఇప్పుడే
సంక్షోభ సమయం వచ్చినప్పుడు ప్రతివాడూ సోషలిస్టు అయిపోతాడు. ‘స్వేచ్ఛా మార్కెట్లు’ వెనక్కిపోతాయి. దీనివలన కష్ట జీవులకు (తాత్కాలికంగానైనా) కొంత ప్రయోజనం కలుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్లో ఉచిత రేషనింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దాని ఫలితంగా సగటు కార్మికుడు అంతకు ముందు కన్నా మరింత మెరుగైన పోషకాహారం పొందగలిగాడు. ఇదొక ఉదాహరణ. అలాగే, ప్రైవేటు కంపెనీలన్నీ యుద్ధ ప్రయత్నాలకు తోడ్పడే విధంగా ఉత్పత్తులను చేపట్టవలసి వచ్చింది. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీల మీద ప్రభుత్వ నియంత్రణ పెరిగింది. ఒక విధమైన ప్రణాళికా విధానం, ఆ పేరు చెప్పకపోయినా, అమలులోకి రాక తప్పలేదు.
ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో కొంచెం ఇంచుమించుగా పైన ప్రస్తావించిన తరహాలోనే పరిణామాలు జరుగుతున్నాయి. వరసగా ఒక దాని తర్వాత మరొక దేశంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను సామాజికీకరణ (సమాజపరం) చేస్తున్నారు. దానితోబాటు నిత్యావసర సరుకుల ఉత్పత్తి, పంపిణీని కూడా జాతీయం చేస్తున్నారు. ఇది పెట్టుబడిదారీ నియమాలకు పూర్తి విరుద్ధం. సంక్షోభం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే సామాజికీకరణ అంత ఎక్కువ మోతాదులో జరుగుతోంది. యూరప్ షా కోవిడ్-19 తాకిడి అతి ఎక్కువగా ఇటలీని తాకింది. ఆ తర్వాత స్పెయిన్ ఎక్కువగా ప్రభావితమైంది. ఆ స్పెయిన్లో ఈ ప్రభావాన్ని తట్టుకోడానికి మొత్తం ప్రైవేటు ఆస్పత్రులనన్నింటినీ జాతీయం చేసేశారు. ఇప్పుడు అవన్నీ ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఆఖరుకు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మహమ్మారిని తట్టుకోవడానికి అవసరమైన ఉత్పత్తులన్నీ చేపట్టాలని ప్రైవేటు కంపెనీలను ఆదేశిస్తున్నాడు! అంటే ప్రైవేటు కంపెనీల మీద ప్రభుత్వం అదుపు ఉ ండడం అనేది ఇప్పుడు ఒక్క చైనాకే పరిమితమైన ధోరణి కాదు. అది అమెరికా – ..విధానం కూడా! యూరపు దేశాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఈ కోవిడ్-19 ప్రభావం పడిన దేశాలు ‘సోషలిస్టు’ విధానంగా కనిపించే పద్ధతుల వైపు మొగ్గు చూపడానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రీయ ద క్పథం అనుసరించడం ఎంతైనా అవసరం, అనివార్యం. శాస్త్రీయ దృక్పథం అనుసరించడం అంటేనే అది సోషలిజం వైపు వేసే ఒక పెద్ద అడుగు. ఇంతవరకూ ఆవు పేడ విశిష్టత గురించి, గోమూత్రం అమోఘ లక్షణాల గురించి, దానితో కరోనా వైరస్ ను నియంత్రించవచ్చన్న ప్రకటనల గురించి ప్రస్తావిస్తూ వచ్చిన హిందూత్వ శక్తులు ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదొర్కుంటున్నారు. ఇటువంటి సమయాల్లో పనికిమాలిన ‘చెత్త’ మాట్లాడొద్దని ఆగ్రహిస్తున్నారు. ఇటువంటి ‘గొప్ప’ విషయాలను ఇంతవరకూ ప్రచారం చేసిన వాళ్లు సైతం దగీ, తుమ్ములో రాగానే ఆరోగ్య రక్షణకి ఆస్పత్రులకే పరుగెత్తుకొస్తున్నారు. వారిలో ఎవరైనా ‘శిఖామణులు’ మొండికేస్తే ఆ కుటుంబ సభ్యులే ఈడ్చుకొచ్చి ఆస్పత్రులలో చేర్పిస్తున్నారు. ఇటువంటి సమయాల్లో మూఢ విశ్వాసాలను ఆచరించడం ప్రాణం మీదకి తెస్తుంది. అందుచేత ప్రస్తుత పరిస్థితే వారి ఆలోచనలో మూఢ నమ్మకాల పట్ల విముఖతను కలిగిస్తుంది. ఆ మే రకు వారు సోషలిజం అనే శాస్త్రీయ భావనకు చేరువవుతారు. అయితే ఈ విషయంలో కూడా భారతదేశం ఇతర దేశాలతో పోల్చితే వెనకబడే వుంది. అటు తప్పనిసరై శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించడంలో గాని, ఇటు వైద్య సేవలను, కీలక ఉత్పత్తులను సమాజపరం చేయడంలో గాని మన దేశం వెనకే వుంది. ఒక పక్క మహమ్మారి విజృంభిస్తున్నా మూఢ నమ్మకాల చౌకబారు ప్రచారం, వెకిలి ప్రకటనలు ఆగడం లేదు. మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా వైద్య ఆరోగ్య కార్యకర్తలను అభినందిస్తూ అయిదు నిమిషాలపాటు చప్పట్లు కొట్టమని మోడీ ప్రకటించారు. అయితే మోడీ భక్తులు ఈ కార్యక్రమాన్ని అరగంట సేపు సాగదీశారు. ఊరేగింపులు తీశారు. గంటలు మోగించారు. శంఖాలూదారు. ఆరోజు ఉ దయం నుండీ చేసిన కర్ఫ్యూ ప్రభావం కాస్తా ఈ విధంగా గుంపులుగా చేరి చేసిన గోల వల్ల ఎగిరిపోయింది. భౌతిక దూరం పాటించాలన్న సూత్రాన్ని గాలికొదిలేశారు.