పండ్ల రైతుల కడగండ్లు దిగుబడి పుష్కలం..
అమ్మకాలకు కరోనా కష్టకాలం
– హెూల్ సేల్, రిటైల్ పండ్ల వ్యాపారుల గగ్గోలు -పండ్ల ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు -బయటకు వచ్చి కొనలేకపోతున్న వినియోగదారులు -చెట్లకే ఎండిపోతున్న పండ్లు -బత్తాయి, జామ, పుచ్చకాయ, కర్బూజలకు డిమాండ్ -ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు దాటించలేని రైతులు -ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
హైదరాబాద్: రాష్ట్రంలోని పండ్ల తోటల రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో పండ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో స్థానికంగా ధరలు పతనమై వారికి నష్టం వాటిల్లుతోంది. పండ్లు, కూరగాయల వాహనాల రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని కేంద్ర హోంశాఖ ఆదేశించిన విషయం విదితమే. కానీ చిల్లర అమ్మకాలు పడిపోయాయంటూ ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణ నుంచి పండ్లను కొనడం బాగా తగ్గించారు. ఈ ప్రభావం మార్కెట్లలో పంట ధరల పై పడి రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్దదైన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కు గతేడాది(2019) మార్చితో పోలిస్తే ఈ నెలలో 87,243 క్వింటాళ్ల మేర ఫలాలు తక్కువగా రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నిరుడు మార్చిలో 3.29 లక్షల క్వింటాళ్లు రాగా ఈ దఫా 2.41 లక్షల క్వింటాళ్లే వచ్చాయి. తెలంగాణలో సాగయ్యే బత్తాయి, జామ, పుచ్చకాయ, కర్బూజ తదితర పండ్లకు ఉత్తరభారత్ లోని పలు రాష్ట్రాల్లో డిమాండు అధికంగా ఉంటుంది. జనతా కర్ఫ్యూ అనంతరం అక్కడి నుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి. మరోవైపు పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి కమలా(సంత్రా) పండ్లు ఎక్కువగా వస్తున్నాయి. గతేడాది 43,492 క్వింటాళ్లు రాగా ఈ ఏడాది మరో 45 శాతం అధికంగా వచ్చాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో సంత్రాల ధర పడిపోయింది. రాష్ట్రంలో బొప్పాయి అధికంగా సాగవుతున్నా బయటినుంచి వచ్చే హైబ్రిడ్ కాయలకే డిమాండు అధికంగా ఉ ంటోందని స్థానిక టోకు వ్యాపారులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.176 కోట్ల విలువైన ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ కేంద్రంగా విక్రయాలు సాగుతాయి. తాజాగా పంట చేతికి రాగా.. రవాణా సౌకర్యం లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు సీ-విటమిన్ అధికంగా ఉండే బత్తాయి, నిమ్మ వాడకం ఎంతో అవసరమని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. మద్దతు ధరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ప్రభుత్వం బత్తాయి, నిమ్మ విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందనిబీ మార్కెట్లతో పాటు రైతు బజార్లలో విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో కత్తెర కాయ వచ్చింది. సీజన్ కాయ కంటే కత్తెర కాయకు అధికంగా లాభాలు రావాల్సి ఉండగాబీ ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో పెద్దగా బత్తాయి, నిమ్మ వాడకం ఉండదు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వాడకం అధికంగా ఉంటుంది. వాస్తవానికి కత్తెరలో వచ్చిన బత్తాయి కాయ టన్నుకు రూ.35-40 వేల వరకు ధర పలుకుతుంది. ఇప్పుడు రూ.12వేలకు మించి రాని పరిస్థితులున్నాయి. మరోవైపు 10 టన్నుల బత్తాయి కాయ తెంపాలంటే దాదాపు 30-40మంది కూలీలు అవసరమవుతారు. కరోనా వల్ల కూలీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదు. స్థానికంగా కూలీలు దొరకని పరిస్థితి. దీంతో కాయలు రాలిపోతున్నాయి. జిల్లాలో 46,800 ఎకరాల్లో బత్తాయి సాగు చేయగా, కత్తెర కాయ 44వేల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిమ్మ 16వేల ఎకరాల్లో సాగవుతుండగా 52వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. కాయ రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోనా మహమ్మారితో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో బత్తాయి, ద్రాక్ష ఇతర పండ్లు వస్తుండటంతో హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్లో వర్తకులు, కమీషన్ ఏజెంట్లు, రైతులు, హమాలీలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర నుంచి వ్యక్తులు మార్కెట్ కు రావడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ యార్డుకు కూడా లాక్ డౌన్ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్ తీవ్రత మహారాష్ట్రలో అధికంగా ఉంది. ఇప్పటి వరకు 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 12కు చేరినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 కరోనా కేసులు నమోదు కాగా.. ఆరు మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్లో మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆపద కాలంలో నేనున్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన రైతుల్లో ధైర్యాన్ని నింపింది. కరోనా వైరస్ ను పారదోలేందుకు దేశమంతటా లాక్ డౌన్ నెలకొన్న నేపథ్యంలో పంటల కోత, విక్రయం పై ఆందోళన నెలకొనగా.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడు ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ పరిష్కారాన్ని సైతం ఆదేశిస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ నెలకొల్పిన ధైర్యం పై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణా.. మరోవైపు గోదావరి జలాలకు తోడు మూసీ నీటితోను ఈసారి ఉ మ్మడి జిల్లా అంతటా యాసంగి వరి పంట విరివిగా పండగా.. పలు ప్రాంతాల్లో వరి చేలు కోతకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రైతుకు భరోసానిస్తూ.. ‘పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్మి మోసపోవద్దు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైతులందరికీ సూచించిన సంగతి తెలిసిందే. బత్తాయి, నిమ్మ కొనుగోలుకు పట్టణాల్లో మొబైల్ రైతు బజార్లు నేటి నుంచే ఏర్పాటు కానున్నాయి. కృష్ణా నది పొంగి పొర్లడంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు ఏఎమ్మార్పీ ఎగువ, దిగువ కాల్వల పరిధిలోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి యాసంగి వరి సాగు విస్తృతంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సూర్యాపేట జిల్లాలోని చివరి చెరువును సైతం నింపిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కృషి ఫలితంగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని నాన్ ఆయకట్టులోనూ యాసంగి వరి సాగు రికార్డు స్థాయిలో జరిగింది. కృష్ణా, గోదావరితో పాటు మూసీ నది కుడి, ఎడమ కాల్వల ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని సుమారు 30వేల ఎకరాల ఆయకట్టులోనూ వరి పంట పండింది. ఇప్పటికే మంత్రి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోళ్లకు ఆదేశించడం విదితమే.