మార్చి నుంచే వేతనాల కోతలు

తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని వెల్లడి

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న నేథ్యంలో వ్యయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలోనూ కోత విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మార్చి నెల నుంచే కోత వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వేతనంపైఁ గ్రాస్ సాలరీ) కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోతలుపోను మిగిలిన వేతనాలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. – ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (కార్పొరేషన్)ల ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత -ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం.. – మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం (నాలుగో తరగతి మినహా) – నాలుగో తరగతి, ఒప్పంద(కాంట్రాక్టు), పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం – అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం – నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛనులో 10 శాతం కోత విధిస్తారు. – అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుంది. తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. తాజా కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము సహకరిస్తామని పీఆర్టీయూ టీఎస్ తెలిపింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు అశనిపాతమని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల, ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఐక్య వేదిక ఖండించింది. పునరాలోచించాలని డిమాండ్ చేసింది.