సీఏఏతో ముప్పులేదు

నటుడు రజనీకాంత్‌

చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి తన మద్దతు ప్రకటించారు ప్రముఖ నటుడు రజనీకాంత్‌. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవతానని రజనీ హామీ ఇచ్చారు. ‘పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశ పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఈ చట్టంతో ముస్లింలకు ఏదైనా ముప్పు జరిగితే వారి తరఫున నిలబడే మొదటి వ్యక్తిని నేనవుతా. విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది’ అని రజనీ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)పైనా రజనీ స్పందించారు. బయటి వ్యక్తులను గుర్తించేందుకు ఎన్‌పీఆర్‌ చాలా ముఖ్యమైనదని అన్నారు. ఎన్సార్సీ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదని ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ నేరుగా స్పందించడం ఇదే తొలిసారి. గత డిసెంబరులో సీఏఏపై పరోక్షంగా స్పందించిన రజనీ.. దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనలపై విచారం వ్యక్తం చేశారు. ‘ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనేందుకు హింస, అల్లర్లు మార్గం కాకూడదు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలి.. దేశ భద్రత, సంక్షేమాన్ని ద ష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నా’ అని రజనీ ఆ మధ్య ట్వీట్‌ చేశారు.