ఎన్ఆర్సీ అమలుపై
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ), సీఏఏపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై తమ ప్రభుత్వం ఏనాడూ చర్చించలేదని ఇప్పటికే ప్రధాని మోదీ ఓ సందర్భంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓసారి పార్లమెంటులో ప్రకటించారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా దీన్ని సమర్థిస్తూ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ఆందోళన చెందనక్కర్లేదని ప్రధాని అప్పట్లో హామీ ఇచ్చారు. వివాదాస్పదమైన ఈ అంశంపై తన ప్రభుత్వం కేబినెట్లో కానీ పార్లమెంటులో కానీ చర్చించలేదని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అసోంలో మాత్రమే దీన్ని అమలు చేశామని చెప్పారు. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ లోక్సభలో అధికారికంగా లిఖితపూర్వక ప్రకటన చేశారు. దీంతో రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రం చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .