కంటితుడుపు చర్యలు
పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ (ఎంజిఎన్‌రేగా) పనులకు అవసరమైన నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయబూనుకోవడం దుర్మార్గం. 2019-20 బడ్జెట్‌లో ఉపాధిహామీ పథకానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 96 శాతం ఖర్చైపోయాయని జనవరి 26న విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ పేర్కొంది. రానున్న రెండు నెలల పాటు ఈ పథకాన్ని దేశమంతటా నడిపించేందుకు రూ.2,500 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో తేటతెల్లమవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది అంతకు ముందు ఏడాది చేసిన ఖర్చు కంటే తక్కువ. ఈ పథకం అమలుపై మోడీ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమౌతుంది. కేటాయించిన నిధులు ఇప్పటికే అయిపోయి 15 రాష్ట్రాలు ‘రెడ్ జోన్’లోకి వెళ్లిపోయాయని ఆ నివేదిక పేర్కొంది. నిజానికి అనేక రాష్ట్రాల్లో ఉపాధి కూలీలకు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి వుంది. వాటిని కూడా లెక్కిస్తే అన్ని రాష్ట్రాలూ పూర్తిగా మైనస్‌లోనే వుంటాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు వెంటనే కేటాయించకపోతే పథకాన్ని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేతన బకాయిలు రూ.200 కోట్ల పైగా వున్నాయి. కరువు మండలాల్లో 150 రోజులు పని కల్పిస్తామని ప్రభుత్వాధినేతలు చెప్పారే తప్ప ఒక్కటంటే ఒక్క మండలంలో కూడా అలా ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తాన్ని చూసుకుంటే కేవలం 14 శాతం కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దొరికింది. కాగా రాజస్థాన్‌లో నిధుల కొరత కారణంగా గతేడాది అక్టోబర్ చివరి నుంచి కార్మికులకు వేతన చెల్లింపులను నిలిపివేసింది. రూ.1950 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, బీహార్, గుజరాత్, తమిళనాడు, ఒడిషాలతోపాటు చిన్న రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ వంటివి కూడా నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదీ మోడీ ప్రభుత్వ సహకార ఫెడరలిజం!
ఉపాధి హామీ పట్ల మోడీ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. వామపక్షాల ఒత్తిడితో యుపిఎ హయాంలో వచ్చిన ఉపాధి హామీ చట్టం మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించింది. ప్రతీ ఏడూ నిధుల కేటాయింపు లోనూ ఎంతో కొంత మెరుగుదల కూడా వుండేది. కాని మోడీ సర్కారు గద్దెనెక్కాక కేటాయింపులు స్తంభించిపోవడమో లేక కొన్ని సంవత్సరాల్లో కోత పడడమో జరిగింది. పేదలపాలిట పెన్నిధిగా వుండడమేగాక వ్యవసాయ కార్మికుల వేతనాలు పెరగడానికి దోహదకారిగావున్న ఎంజిఎన్‌రేగా చట్టంపై కత్తి కట్టిన బిజెపి క్రమంగా దాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఆ సమయంలోనే వచ్చిన అటవీ హక్కుల చట్టానికి సైతం తూట్లు పొడుస్తూ ఇటీవల సుప్రీం కోర్టును అడ్డం పెట్టుకొని కుట్రలు పన్నిన విషయం అందరికీ తెలిసిందే! గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన విద్యా హక్కు చట్ట ప్రయోజనాలను, స్ఫూర్తినీ గంగ పాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నూతన విద్యా విధానాన్ని తెచ్చిన తీరు చూశాం. అలాగే సమాచార హక్కు చట్టాన్ని కూడా కరి మింగిన వెలగ పండు చందంగా చేస్తున్నారు. అటువంటి ప్రజాహిత చట్టాలన్నిటినీ ధ్వంసం చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఈ చర్యలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.
దేశం నేడెదుర్కొంటున్న ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అతి దారుణంగా ఉంది. గ్రామీణులకు ఉపాధి, ఆదాయం కల్పించే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుండి గట్టెక్కాలంటే ప్రజలకు పని కల్పించాలి. అందుకు ఉపాధి హామీ పథకం చక్కటి మార్గం. తద్వారా ప్రజలకు ఆదాయం దక్కడమేగాక ఊరుమ్మడి ఆస్తులు కూడా సమకూరుతాయి. ప్రజల ఆదాయం పెరగడంతో పారిశ్రామిక వస్తువుల వినియోగం అధికమై ఆర్థిక సంక్షోభం నెమ్మదిస్తుంది. కాని బిజెపి సర్కారు ఈ మార్గాన్ని కాకుండా సంపన్నులకు రాయితీలిచ్చి సంక్షోభాన్ని ఎదుర్కొంటామని చెప్పడం మోసపూరితం. సామాన్య ప్రజల పట్ల కక్ష పూనడమే! ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలి. అయితే ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఆ ప్రకారం నడుచుకునేటట్టు లేదు. అందుకే ఐక్య ఉద్యమాలతో ఒత్తిడి పెంచి ఉపాధి హామీ చట్టాన్ని ప్రజలు కాపాడుకోవాలి.