సంక్రాంతి అంటే… పిండివంటలు

సంక్రాంతి అంటే… పొయ్యి వెలిగించడం, తీపిని తగిలించడం. అరిసెలు, గోరు మీఠీలు, బెల్లం కొమ్ములు, ఫేణీలు ఇవన్నీ నిల్వ ఉండే పిండి వంటలు. ఎన్నాళ్ల్కెనా పాడవకుండా తినడానికి వీలుగా ఉంటాయి. మరి రెడీ చేసుకోండి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సంక్రాంతి ని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పిత  దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

అరిసెలు

కావలసినవి:

బియ్యం-600 గ్రా. బెల్లం – 300 గ్రా. నీళ్లు- 50 మి.లీ.(సుమారు గా) ఏలకుల పొడి – అరటీ స్పూను నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు నెయ్యి – అర కప్పు నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పూర్తిగా కారిపోయేవరకు ఉంచాలి. బియ్యాన్ని కొద్దికొద్దిగా చిన్న మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి, జల్లెడ పట్టి, మెత్తటి పిండిని చేతితో గట్టిగా నొక్కి పక్కన ఉంచాలి (తడి ఆరిపోకూడదు)

పాకం తయారీ: ఒక గిన్నెలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగే వరకు ఉంచాలి. పాకం అడుగు అంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి, అందులో పాకం వేస్తే అది కరిగిపోకుండా, ఉండలా అయితే, పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క. మంట సిమ్‌లోకి ఉంచి, నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ కట్టేసి గిన్నె కిందకు దింపాలి. బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ పిండి గట్టిగా అయ్యేవరకు కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలో ఉంచాలి. పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, నూనె పూసిన ప్లాస్టిక్‌ పేపర్‌ మీద ఉంచి, చేతితో ఒత్తి, కాగిన నూనెలో వేసి పైకి తేలేవరకు కదపకుండా ఉంచాలి. పైకి తేలాక ఒక నిమిషం పాటు ఆగి, రెండో వైపుకి తిప్పాలి. బంగారు రంగులోకి మారేవరకు వేయించి, బయటకు తీసి, రెండు గరిటెల మధ్యన కాని, అరిసెల చట్రంతో కాని నూనె పోయేవరకు గట్టిగా ఒత్తాలి (నువ్వుల అరిసెలు కావాలంటే, పిండిని కలుపుతున్నప్పుడే నువ్వులు కూడా వేసి కలిపేయాలి) బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

గోరు మీఠీలు

కావలసినవి: నూనె డీప్‌ ఫ్రైకి సరిపడా. మైదా పిండి పావు కేజీ. బొంబాయి రవ్వ 3 టేబుల్‌ స్పూన్లు. బటర్‌ 2 టేబుల్‌ స్పూన్లు. ఏలకుల పొడి అర టీ స్పూను. నెయ్యి ఒక టేబుల్‌ స్పూను. ఉప్పు అర టీ స్పూను. నీళ్లు తగినన్ని. బెల్లం పొడి/పంచదార పావు కేజీ.

తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బటర్‌, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలపాలి. నూనె జత చేసి బాగా కలిపి, పిండి మ దువుగా అయిన తరవాత, బొంబాయి రవ్వ జత చేసి పిండిని మరోమారు కలిపి, గిన్నె మీద పల్చటి వస్త్రం వేసి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి. నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకుని, చేతి గోటితో గోరు మీఠీలాగ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచిన గోరు మీఠీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. వేరొక పాత్రలో బెల్లం పొడి/పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చే వరకు కలపాలి ఏలకుల పొడి, కొద్దిగా నెయ్యి జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను ఇందులో వేసి, పై నుంచి కిందకు కదపాలి. చల్లారాక, గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

రిబ్బన్లు

కావలసినవి: సెనగ పిండి అర కేజీబీ బియ్యప్పిండి. 3 టేబుల్‌ స్పూన్లు. ఉప్పు తగినంత. కారం రెండు టీ స్పూన్లు. పచ్చి మిర్చి6. ఉల్లి తరుగు. ఒక కప్పు. అల్లం తురుము ఒక టేబుల్‌ స్పూను. నెయ్యి ఒక టేబుల్‌ స్పూను. నూనె డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: మిక్సీలో పచ్చి మిర్చి, ఉల్లి తరుగు, అల్లం తురుము వేసి మెత్తగా ముద్దలా చేయాలి. ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. కరిగించిన నేతిని వేసి మరోమారు కలపాలి. ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, అందులో పచ్చి మిర్చి మిశ్రమం వేసి బాగా కలియబెట్టి, నీటిని వడకట్టి, సెనగ పిండి మిశ్రమంలో ఆ నీటిని పోస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. జంతికల గొట్టంలో రిబ్బన్ల ప్లేటు ఉంచాలి. సెనగ పిండి మిశ్రమం ఉంచి, కాగుతున్న నూనెలో రిబ్బన్లు పడేలా జంతికల గొట్టం తిప్పాలి.బాగా వేగిన తరవాత పేపర్‌ నాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

సర్వ పిండి

కావలసినవి: బియ్యప్పిండి అర కేజీ. ఉప్పు తగినంత. కారం ఒక టీ స్పూను. పల్లీలు 4 టేబుల్‌ స్పూన్లు. పచ్చి సెనగ పప్పు మూడు టేబుల్‌ స్పూన్లు (మూడు గంటలసేపు నానబెట్టాలి). నూనె . తగినంత. సన్నగా తరిగిన కొత్తిమీర. అర కప్పు. సన్నగా తరిగిన పచ్చి మిర్చి 2. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూను. సన్నగా తరిగిన కరివేపాకు రెండు రెమ్మలు. నువ్వులు రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ: ఒక పాత్రలో బియ్యప్పిండి, నానబెట్టిన సెనగ పప్పు, పల్లీలు, పచ్చి మిర్చి తరుగు, నువ్వులు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం వేసి కలపాలి. తగినన్ని వేడి నీళ్లు జత చేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒక బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి మొత్తం బాణలి అంతా పట్టేలా చేతితో సరిచేయాలి. కలిపి ఉంచుకున్న పిండిని జామకాయ పరిమాణంలో తీసుకుని, బాణలిలో ఉంచి, మధ్యమధ్యలో చేతికి నూనె పూసుకుంటూ, పిండిని పల్చగా అయ్యేలా ఒత్తిన తరవాత నాలుగైదు చోట్ల రంధ్రాలు చేసి, అక్కడక్కడ నూనె పోసి, స్టౌ మీద ఆ బాణలి ఉంచి, పైన మూత పెట్టి, బాగా కాలేవరకు ఉంచాలి.

సకినాలు

కావలసినవి: య్యం ఒక కప్పుబీ నువ్వులు అర కప్పుబీ వాము అర టీ స్పూనుబీ ఉప్పు తగినంతబీ నూనె డీప్‌ ఫ్రైకి సరిపడా.బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి.

తయారీ: బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంట సేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు). ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి. ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి. కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి). మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి. ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి. చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

బెల్లం కొమ్ములు

కావలసినవి: సెనగ పిండి అర కేజీబీ బియ్యప్పిండి 3 టేబుల్‌ స్పూన్లుబీ బెల్లం అర కేజీబీ ఏలకుల పొడి ఒక టీ స్పూనుబీ నెయ్యి 2 టేబుల్‌ స్పూన్లుబీ నూనె డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేసి జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి. జంతికల గొట్టంలో లావుగా ఉండే జంతికల ప్లేటు ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని జంతికల గొట్టంలో ఉంచి, నూనెలో జంతికల మాదిరిగా చుట్టాలి. బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి, ప్లేటులోకి తీసుకుని, పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి. ఒక పెద్ద గిన్నెలో (మందంగా ఉండే గిన్నె) బెల్లం పొడి, తగినన్ని నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలియబెట్టాలి. ఏలకుల పొడి, నెయ్యి జత చేసి బాగా కలిపి దింపేయాలి ‘ జంతిక కొమ్ముల మీద ఈ పాకాన్ని పోసి బాగా కలపాలి. బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి.

ఫేణీలు

కావలసినవి: మైదా పిండి అర కేజీబీ పంచదార అర కేజీబీ నెయ్యి పావు కేజీబీ నూనె డీప్‌ ఫ్రైకి సరిపడాబీ ఏలకుల పొడి ఒక టీ స్పూనుబీ డ్రైఫ్రూట్స్‌ తరుగు పావు కప్పు

తయారీ: ఒక పెద్ద పాత్రలో మైదా పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నెయ్యి జత చేసి పిండిని ఎక్కువ సేపు మర్దన చేస్తూ మెత్తగా అయ్యేవరకు కలపాలి. నీరు గట్టిగా పిండేసిన తడి వస్త్రాన్ని పిండి గిన్నె మీద మూతలా వేసి అర గంట సేపు పక్కన ఉంచాక, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని పూరీలా ఒత్తాక పైన కొద్దిగా నెయ్యి వేసి మరో పూరీ దాని మీద ఉంచాలి. ఈ విధంగా నాలుగు పూరీలకు ఒక దాని మీద ఒకటి ఉంచి గట్టిగా ఒత్తాలి. మందంగా ఒత్తాక, ఒక కొస నుంచి లోపలికి రోల్‌ చేసుకుంటూ రావాలి. రోల్‌ చేసుకున్న తరవాత ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక్కో ముక్కను మళ్లీ పూరీలా ఒత్తుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలిపాక, ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. వేయించిన పూరీలను పంచదార పాకంలో వేసి బాగా ముంచి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ?పాకం గట్టిపడకుండానే, పూరీల మీద డ్రైఫ్రూట్స్‌ చల్లి, ప్లేటులో ఉంచాలి.