కుక్కకోసం విమానం అద్దెకు!

ఓ యువతి కొన్నేండ్లుగా ఒక శునకాన్ని పెంచుకుంటున్నది. ఆత్మీయుడిగా భావించి దాంతో స్నేహం చేస్తున్నది. తన కష్ట సుఖాల్ని పంచుకుంటున్నది. ఉన్నట్టుండి ఓ రోజు ఆ శునకాన్ని ఎవరో ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆమె తిండీ, నిద్ర మానేసింది. దానికోసం ఓ విమానం అద్దెకు తీసుకొని మరీ తిరుగుతున్నది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ పదేండ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నది. దాని పేరు జాక్సన్‌. అది ఆస్ట్రేలియన్‌ షెపర్డ్‌ జాతికి చెందింది. నీలం రంగు కళ్లతో, నలుపు, తెలుపు వెంట్రుకలతో చూడముచ్చటగా ఉంటుంది. పదిరోజుల క్రితం షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆ శునకాన్ని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. షాపు సీసీటీవీ ఫుటేజీల్ని పరిశీలించింది. ఎత్తుకెళ్లిన వ్యక్తి ముఖానికి ముసుగు ఉండడంతో గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉందని గ్రహించింది. తన కుక్కను వెతికి ఇచ్చిన వారికి ఏడు వేల డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. భారత కరెన్సీలో రూ.5 లక్షలు. జాక్సన్‌ను వెతికేందుకు ఓ చిన్నపాటి విమానాన్ని రోజుకు 1200 డాలర్లు ఇచ్చి అద్దెకు తీసుకున్నది. రోజూ రెండు గంటలు కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద బ్యాన్లర్లను వేలాడదీస్తూ జాక్సన్‌కోసం వెతుకుతున్నది. డబ్బులు సరిపోకపోవడంతో ఎమిలీ ఫండ్‌ రేజింగ్‌ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. గోఫౌండ్‌మి అనే వెబ్‌సైట్‌ను లాంచ్‌ చేసి విరాళాలు సేకరిస్తున్నది. ఇప్పటివరకు 7 వేల డాలర్లు సేకరించింది. ఒకవేళ జాక్సన్‌ దొరికితే మిగిలిన డబ్బుల్ని రాకెట్‌ డాగ్‌ రెస్క్యూకి ఇస్తానని ప్రకటించింది.