అక్షరాలు రాకున్నా అద్భుతాలు సృష్టించారు

ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. బిందువు బిందువు కలిస్తేనే సింధువు (సముద్రం) అవుతుంది! ఈ సత్యాన్ని గుర్తించిన కొందరు మహిళలు.. రూపాయి రూపాయి పోగేసి అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించారు. పేదపిల్లలకు సైతం కార్పొరేట్‌ విద్య అందుబాటులోకి తెచ్చేందుకు.. రూ.6 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాల నిర్మించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మహిళా పొదుపు లక్ష్మి మండల సమాఖ్య సాధించిన విజయమిది.

అక్షరాలు రాని ఎందరో మహిళలు ఆర్థిక పాఠాలు నేర్చుకొన్నారు. అమలు చేశారు. విజయం సాధించారు. పేదరికాన్ని తమ ఇంటి నుంచి తరిమేశారు. హిందీ నేర్చుకొని… వివిధ రాష్ట్రాల్లో తమ జీవితాలనే పాఠాలుగా బోధిస్తున్నారు. మరెందరో ఆడపడచుల ఇళ్లలో పొదుపుపై చైతన్య జ్యోతులు వెలిగిస్తున్నారు. అందుకు తగిన పారితోషికమూ అందుకుంటున్నారు వరంగల్‌ జిల్లా వేలేరు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామాలకు చెందిన మహిళా’మనీ’లు. ఓమ్‌ప్లిస్‌ (ఓర్వకల్లు పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం) నుంచి 350 మంది, వేలేరు నుంచి 150 మంది ఇలా విజయబాట సాగుతున్నారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 325 మంది స్వయం సహాయక సంఘ మహిళలు వివిధ రాష్ట్రాల్లో శిక్షకులు(సీఆర్పీలు)గా పనిచేస్తున్నారు. ‘ఓర్వకల్లు పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం’ దేశంలో నేషనల్‌ రీసోర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఆర్వో)గా గుర్తింపు పొందింది. గుజరాత్‌, హరియాణ, జమ్మూకశ్మీర్‌, పశ్చిమబంగా, మేఘాలయ, మిజోరమ్‌, నాగాలాండ్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాలు ఓమ్‌ప్లిస్‌తో ఎంవోయూ పై సంతకం చేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోని మహిళలకు ఓమ్‌ప్లిస్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఓర్వకల్లు మహిళలు ఇలా దేశవ్యాప్తంగా లక్షలాది స్వయం సహాయక సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఓర్వకల్లు గ్రామానికి చెందిన తాజున్సీసా పేద కుటుంబంలో పుట్టింది. నిరక్షరాస్యురాలు. అయితేనేం పట్టుపట్టి అక్షరాలు దిద్దింది. జమ్ముకాశ్మీర్‌లో ఐదు సంవత్సరాలు సీఆర్‌పీగా పనిచేసింది. అతిక్లిష్టమైన పరిస్థితుల్లో ధైర్యంగా పనిచేసింది. -10డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో గడ్డకట్టించే చలిగాలుల నడుమ లద్దాఖ్‌ ప్రాంతంలో సుమారు 200 మహిళా సంఘాల నిర్మాణంలో తాజున్సీసా కీలకపాత్ర పోషించింది. తీవ్రవాద పరిస్థితులు అధికంగా ఉన్న గాందర్‌బల్‌, ఉదంపూర్‌, కుప్వారా వంటి చోట్ల అనేక బెదిరింపులకు ఎదురొడ్డి మహిళా పొదుపు సంఘాలను తయారుచేసిన దిట్టగా పేరుగాంచింది. తాజున్నీసా భర్త మౌల్వీగా పనిచేస్తుంటారు. ఇలా సీఆర్‌పీగా పనిచేస్తూ వచ్చిన గౌరవవేతనంతో ఆర్థికంగా పరిపుష్ఠి సాధించింది.

ఇదీ నేపథ్యం..

చంద్రబాబు 1995లో సీఎంగా ఉన్నప్పుడు పొదుపు ఉద్యమానికి బీజం వేశారు. కర్నూలుజిల్లా మహిళలు ఆ పిలుపును అందిపుచ్చుకున్నారు. పురుషులు సహాయనిరాకరణ చేసినా.. పేదరికం, నిరక్షరాస్యత అడ్డుగోడలుగా ఉన్నా ముందుకే కదిలారు. అదే సమయంలో సెర్ప్‌ కన్సల్టెన్సీ విజయభారతి పల్లె పల్లెకూ తిరిగి వేలాదిగా మహిళలను సంఘటితం చేశారు. ఈ క్రమంలోనే.. ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో ప్రగతి వెలుగు, అల్లామాలిక్‌ పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. అదే స్ఫూర్తితో మండలంలోని 22 గ్రామాలలో ప్రస్తుతం 982 మహిళా పొదుపు సంఘాలు ఏర్పడి.. 10వేల మంది మహిళలు సభ్యులుగా చేరారు. రోజుకో రూపాయి చొప్పున వీరు ఆరంభించిన పొదుపు సొమ్ము రూ.8 కోట్లకు చేరింది. ఆ డబ్బును బ్యాంకు ఖాతాల్లో ఉంచకుండా తిరిగి మహిళలకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చారు. అలా వడ్డీ రూపేణా రూ.5.5 కోట్ల ఆదాయం వచ్చింది. వీరి పొదుపు స్ఫూర్తిని చూసిన బ్యాంకర్లు స్వయం ఉపాధి కోసం రూ.70 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. దీంతో, ప్రస్తుతం ఓర్వకల్లు పొదుపు మహిళల మండల సమాఖ్య టర్నోవర్‌ రూ.83.5 కోట్లకు చేరుకుని వారు ఓ చిన్నపాటి బ్యాంకునే నిర్వహిస్తున్నారు. ఈ విజయంతో ఆగక.. సామాజిక సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేశారు.

పేద పిల్లల కోసం..

ఓర్వకల్లును బాల కార్మిక రహిత మండలంగా తీర్చిదిద్దిన పొదుపు మహిళలు.. పేద పిల్లలకు కార్పొరేట్‌ విద్యను అందించాలని సంకల్పించారు. మండల సమాఖ్యలో తీర్మానం చేసి 8 ఏళ్ల క్రితం బాలభారతి ఇంగ్లిష్‌ మీడియం స్కూలును ప్రారంభించారు. పక్కా భవనం నిర్మించాలని తపించారు. అప్పటికి మండల సమాఖ్య ఖాతాలో రూ.కోటి మాత్రమే ఉంది. ఆ పాఠశాల నిర్మాణానికి 6 ఎకరాల స్థలం కావాలి. సెర్ప్‌ కన్సల్టెన్సీ, మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి 3 ఎకరాలు కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చారు. మరో 3 ఎకరాలు మండల సమాఖ్య కొనుగోలు చేసింది. ప్రతి పల్లె నుంచి పొదుపు మహిళలు ఈ బడి తమ పిల్లల ఉజ్వల భవితను తీర్చిదిద్దే ఆధునిక దేవాలయంగా భావించి శ్రమదానం చేశారు. కానీ.. ఇటుకలు, సిమెంట్‌, ఐరన్‌, ఇసుక, కంకర.. ఇలా నిర్మాణ సామగ్రి కొనుగోలుకు రూ.కోట్లు కావాలి. ఈమేరకు మండలంలోని 982 పొదుపు సంఘాలు ఒక్కోసంఘం రూ.5వేల చొప్పున విరాళంగా అందించాయి. ఓర్వకల్లు మహిళలు పొదుపు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తతం చేసేందుకు 16 రాష్ట్రాల్లో సీఆర్‌పీలుగా వెళ్లి.. ఆ రాష్ట్రాల్లో పొదుపు ఉద్యమాన్ని ప్రచారం చేశారు. ఇతర దేశాలకు సైతం వెళ్లారు. అలా దాదాపు 600 మంది మహిళలు సీఆర్పీలుగా పనిచేసి తమకు వచ్చే గౌరవ వేతనంలో కొంత మొత్తాన్ని ఆ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఇలా రూపాయి రూపాయి పోగు చేసి రూ.6 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అందమైన బాలబారతి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఇతర సదుపాయాల కోసం మరో రూ.కోటి ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బ్రహ్మాండమైన బడి..

నర్సరీ నుంచి 10వ తరగతి వరకూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఆంగ్లబోధన అందించేందుకు మూడు అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో మొత్తం 60 గదులున్నాయి. ల్యాబ్‌, గ్రంథాలయం, కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం, 3 ఎకరాల్లో విశాలవంతమైన ఆటస్థలం.. సమకూర్చారు. తమకు చదువు రాదని, తమ పిల్లలైనా ఆంగ్ల విద్యను అభ్యసించాలనే సంకల్పంతో ఈ యజ్ఞానికి నాంది పలికారని మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి, మండల సమాఖ్య ఎడ్యుకేషనల్‌ కమిటీ సభ్యులు లక్ష్మీదేవి, తాజున్నిసా, విజయలక్ష్మి, మహేశ్వరి, అనుసూయ వివరించారు.