అల..అమరావతిలో!

కొనసాగుతున్న రైతుల ఆందోళన..పోలీస్‌ హఠావోకి పిలుపు
  • -మందడంలో మహిళలపై దౌర్జన్యానికి నిరసన
  • -అమరావతి బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు
  • -పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని తీర్మానం
  • -వాళ్లకు గ్రామంలో కనీసం మంచినీళ్లు ఇవ్వొద్దు
  • -గ్రామస్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం
  • -రైతుల కాళ్లు పట్టుకున్న కొందరు పోలీసులు
  • -అర్థరాత్రుళ్లు ఇళ్లకు వచ్చి తనిఖీలు చేస్తున్నారని ఆరోపణ
  • -పోలీసు సోదాలపై మండిపడ్డ లోకేష్‌

విజయవాడ:
అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు రాజధాని బంద్‌కు రైతులు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారని మహిళలు మండిపడ్డారు. తమ పోరును మరింత ఉద్ధతం చేస్తామని రాజధాని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అయితే రైతులు పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు నిర్ణయించుకున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా కల్గించకూడదనుకున్నారు. తమ దుకాణాల ముందు కూర్చోవడానికి కూడా పోలీసులకు అనుమతి ఇవ్వడం లేదు.
దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుక్నున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు. కాళ్లు పట్టుకొని తమను క్షమించాలని కోరారు. శుక్రవారం సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు విచక్షణ మరిచి విరుచుకుపడ్డారు. మహిళలను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. కాగా ప్రజలు పోలీసు వ్యాన్‌ను అడ్డుకొని తీవ్ర నిరసన తెలిపారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మహిళలు వదిలిపెట్టిన విషయం తెలిసిందే.
అమరావతిలో రైతుల ఆందోళనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. 18వరోజు ఈ నిరసనల్ని మరింత ఉధతం చేశారు. రాజధానిలోని అన్ని గ్రామాల్లో దీక్షలతో పాటూ ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. మందడంలో బంద్‌ నడుస్తోంది. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా బంద్‌ పాటిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఘటనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. రైతులు, గ్రామస్థులు పోలీసులకు సహాయ నిరాకరణ చేపట్టారు. ఇదిలా ఉంటే అమరావతి రైతుల పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. తనిఖీల పేరుతో అర్ధరాత్రి పోలీసులు రైతుల ఇళ్లకు వెళుతున్నారని.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు సీసీ ఫుటేజ్‌ కూడా విడుదల చేశారు. 4 జీపుల్లో వచ్చి మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేశారని.. అర్ధరాత్రి తలుపులు కొట్టి మహిళల్ని భయపెట్టారని ఆరోపిస్తున్నారు.
ఈ వీడియోలను మాజీ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. రైతులపై జగన్‌ గారికి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదు. అర్దరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయబ్రాంతులకు గురిచేసి ఏమి సాధించాలి అనుకుంటున్నారు. అర్దరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా?. రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్‌ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్‌ అన్నారు.
రాజధాని అమరావతి రణరంగంగా మారింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతంగా మారాయి. రాజధాని రైతుల ఐకాస పిలుపు మేరకు శుక్రవారం సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మందడంలోని బొడ్డురాయి సెంటర్‌లో మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి వాహనాలను, షాపులను మూసివేయాలని కోరారు. అక్కడే ఉన్న మహిళా పోలీసుల్లో కొంతమంది పనీపాట లేకుండా ధర్నా చేయటానికి వస్తున్నారని అని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. దీంతో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసుల చేత మహిళను అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేసి పోలీసులు వారిని వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేశారు. బలవంతంగా వ్యానులోకి ఎక్కించి తమను ఇష్టం వచ్చినట్లు కొట్టారని, చేతులు కొరికారని, గొంతు పట్టుకొని నులిమారని మహిళలు కన్నీళ్లు పెట్టుకొని వాపోయారు. వ్యానును కదిలించకుండా ఒక మహిళ వ్యాను వెనక టైరు కింద పడుకుంది. పోలీసులు ఆమెను ఈడ్చుకుంటూ బయటకు లాగారు. రోడ్డుకు అడ్డంగా పడుకున్న రైతుపైకి వ్యాను పోనిచ్చారు. దీంతో రైతు చేతికి గాయమై చొక్కా చినిగి పోయింది. వ్యాను కదలకుండా మహిళలు, రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు మహిళలను వ్యాను నుంచి పంపించి వేశారు. ఈ దశలో దీక్షా శిబిరంలో కూర్చొన బెజవాడ శివకుమారి అనే మహిళ ఆందోళనకు గురై స్పహ కోల్పొయి పడిపోయింది. వైద్యుడిని పిలిపించి అక్కడే చికిత్స చేశారు. పెనుగులాటలో ఓ మహిళకు చెందిన నల్లపూసల గొలుసు పోయిందని తెలిపారు. ఒక బంగారు గొలుసు, గాజులు కూడా పోయినట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అరాచకాలు సష్టిస్తుందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రైతులు, మహిళలు నినాదాలు చేశారు. పోలీసులు తమను తిట్టి, కొట్టారని, అనుచితంగా ప్రవర్తించారని వారు తుళ్ళూరు పోలీసస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులపై తుళ్ళూరు స్టేషన్‌లో కేసు నమోదైంది.