సమాచార హక్కు చట్టం నిర్వీర్యం కారాదు

స్వాతంత్య్రానంతరం పౌరుల ప్రాథమిక హక్కులపై దేశంలో ఎప్పుడూ ఏదో ఒక స్థాయిలో దాడి జరుగుతూనే ఉంది. రాజ్యాంగంలోని 19(1) (ఎ) అధికరణం భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులకు ప్రాథమిక హక్కుగా దఖలుపరచింది. ఓటు వేయడం, రచనల ద్వారా అభిప్రాయాలు వెల్లడించడం, ప్రభుత్వ శాఖలనుంచి సమాచారం సేకరించడం వంటివి క్రమంగా భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగంగా మారాయి. సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులే ఇందుకు ప్రాతిపదికలయ్యాయి. ‘ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసం’ ప్రాదుర్భవించిన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ రికార్డుల్లోని సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ప్రజావళికి ఉండాలి. గడచిన ఆరు దశాబ్దాలుగా ఈ హక్కులకు పరిమితులు విధించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కోర్టులు జోక్యం చేసుకొని ఈ హక్కులకు రక్షరేకు తొడుగుతుండటం కొంతలో కొంత ఊరట కలిగించే పరిణామం. సమాచార హక్కు అన్నది ప్రభుత్వాల చొరవ, సహకారంతో ముడివడిన విషయం. తాము తీసుకొనే నిర్ణయాల వెనక కారణాలు, అవసరాలను ప్రజలకు వెల్లడించేందుకు సర్కార్లేవీ అంతగా ఇష్టపడవు. అందువల్లే ప్రభుత్వ సమాచారం ఈ దేశంలో ప్రజలకు దశాబ్దాలపాటు అంతుచిక్కని బ్రహ్మపదార్థంగా మిగిలిపోయింది.
సమాచార హక్కుకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దయెత్తున డిమాండ్‌ చేయడంతో పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం దిగివచ్చింది. 2005 అక్టోబరు 12న సమాచార హక్కుకు సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తూ యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతి సమాచారాన్నీ ప్రజలకు వెల్లడించవచ్చునని, 8(1) నిబంధన ప్రకారం పది విభాగాలుగా వర్గీకరించిన వివరాలను మాత్రం నిరాకరించవచ్చునని ఆ చట్టంలో స్పష్టం చేశారు. అధికార రహస్యాల చట్టం లేదా మరే చట్టాలు, ఇతర నిబంధనల ప్రకారం కూడా పౌరులకు సమాచారం ఇవ్వకుండా నిరాకరించరాదు. ప్రజాందోళనల నేపథ్యంలో సమాచార హక్కు చట్టం తీసుకువచ్చిన నాటి యూపీఏ ప్రభుత్వం కొన్ని నెలలైనా గడవకముందే ఇబ్బంది పడటం ప్రారంభించింది. సమాచార హక్కు చట్టం ప్రజలకు సాధికారత కల్పించింది. ప్రభుత్వ విభాగాలన్నీ జవాబుదారీతనంతో మెలగాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. ప్రజా చైతన్యం వికసించడం ఏలినవారికి ఇబ్బంది కలిగించింది. దాంతో చట్టం తెచ్చిన ఏడాది కాలంలోనే సవరణలు చేసి దాన్ని నీరుగార్చేందుకు 2006లో ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు మిన్నంటడంతో సర్కారు వెనక్కితగ్గింది. ఆ తరవాత మరో రెండు సందర్భాల్లోనూ చట్టాన్ని బలహీనపరచేందుకు ఎక్కడైనా సందు దొరుకుతుందేమో అని చూసిన ప్రభుత్వం- జనాగ్రహం కారణంగా ఆ ప్రయత్నాలను విరమించుకుంది.
సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు సమాచారాన్ని వెల్లడించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలి. ఏవైనా వివరాలను అభ్యర్థిస్తూ ప్రజలనుంచి దరఖాస్తు వచ్చిన 30రోజుల్లోగా సంబంధిత సమాచారాన్ని వారికి అందించాల్సిన బాధ్యత ఆ అధికారిపై ఉంటుంది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఆ అధికారి అడిగిన వివరాలు వెల్లడించకపోతే- అదే విభాగంలోని సీనియర్‌ అధికారికి పౌరులు ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికీ పౌరులకు సంత ప్తికర సమాధానం రానిపక్షంలో సమస్యను వివరిస్తూ సమాచార కమిషన్‌కు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆ దశలో ప్రభుత్వ విభాగాలను ఆదేశించి, అవసరమైన సమాచారం ఇప్పించి వారి హక్కులను కాచుకోవాల్సిన పూర్తి బాధ్యత సమాచార కమిషన్‌పైనే ఉంటుంది. కేంద్ర సమాచార కమిషనర్ల హోదా, వేతనాలు కేంద్ర ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉండాలని చట్టం చెబుతోంది. దాని ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రధాన కార్యదర్శితో సమానమైన హోదా కలిగి ఉండాలి. ఆర్‌టీఐ ముసాయిదా తొలి ప్రతిని 2014 డిసెంబరులో పార్లమెంటు ముందుకు తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే సమాచార కమిషన్లు పౌరుల సమాచార హక్కుకు బాధ్యత వహించాలని ఆ ముసాయిదా ప్రతిలో ప్రతిపాదించారు. సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌ ప్రభుత్వ కార్యదర్శి హోదాలోబీ ఇతర కమిషనర్లు సంయుక్త కార్యదర్శులతో సమాన స్థాయిలో ఉంటారని ముసాయిదాలో వెల్లడించారు. ఆ తరవాత ముసాయిదా ప్రతిని పార్లమెంటరీ స్థాయీసంఘం అధ్యయనానికి పంపించారు. ఆరు దశల్లో స్థాయీసంఘం ముసాయిదాపై చర్చలు జరిపింది. సమాచార కమిషనర్లు, కార్యాలయాల విషయంలో స్థాయీసంఘం చెప్పిన మాటలివి. ‘పౌరులకు సమాచారం అందుబాటులోకి రావడమన్నది కమిషన్ల ప్రభావశీలతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కమిషన్లుకుగాని, వాటిలో బాధ్యతలు నిర్వహించే అధికారులకుగాని సంపూర్ణ స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తి అవసరం. అందుకోసం సమాచార కమిషనర్ల స్థాయిని పెంచాలి. భారత ఎన్నికల కమిషన్‌ బాధ్యులతో సమానంగా వారి హోదాలు మార్చాలి’ అని పార్లమెంటరీ స్థాయీసంఘం అభిప్రాయపడింది. ఆ సంఘంలో భాజపాకు చెందిన ఆరుగురు సభ్యులు ప్రతినిధులుగా ఉన్నారు. ప్రస్తుత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైతం ఆ సంఘంలో సభ్యులే! సమాచార కమిషన్ల అధికారాలకు కోతపెట్టడంతోపాటు, కమిషనర్ల పరిధిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని స్థాయీసంఘం ఆనాడు పసిగట్టింది. అందుకే రాజీలేని వైఖరిని అనుసరించి కమిషనర్ల హోదా, అధికారాలను అత్యున్నత స్థాయిలో తీర్మానించింది. కమిషనర్ల ఆదేశాలకు సమున్నత విలువ ఉండేలా, సమాచార కమిషన్‌ సర్వ స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహించేలా స్థాయీసంఘం గట్టి చొరవ చూపింది. ఆ దష్టితోనే కమిషనర్ల కాలావధిని అయిదేళ్లుగా నిర్ణయించారు.
సహ చట్టంలో సవరణలకు సమకట్టడం ద్వారా సమాచార కమిషనర్ల పదవీకాలం, హోదాలకు కోత పెట్టేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాబట్టి- చట్టబద్ధంగా ఏర్పాటైన సమాచార కమిషన్‌ను దానితో సరిపోల్చలేమని ప్రభుత్వం కారణాలు వినిపిస్తోంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థల హోదా, అధికారాల వివరాలు రాజ్యాంగ పత్రంలో వెల్లడించారు. అందుకు భిన్నంగా చట్టబద్ధ వ్యవస్థలన్నీ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటవుతాయి. చట్టబద్ధ వ్యవస్థలకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థలతో సమాన స్థాయి ఉండదంటూ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలో పసలేదు. ఎందుకంటే జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ వంటివి చట్టబద్ధ సంస్థలైనప్పటికీ- వాటి సారథులకు కేంద్ర ఎన్నికల కమిషనర్లతో సమాన హోదా కల్పించడం గమనార్హం. కమిషన్‌ నిర్ణయాలను హైకోర్టుల్లో సవాలు చేయవచ్చు కాబట్టి సమాచార కమిషనర్ల హోదా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల జడ్జీలకంటే తక్కువే అన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఈ వాదనలోనూ సహేతుకత లేదు. ఎందుకంటే ఆర్‌టీఐ వ్యవహారాల్లో తుది అప్పీలు అధికారం సమాచార కమిషన్‌దే. ఆ నిర్ణయాలపై వెలువడే సవాళ్లు, వాటిపై విచారణ అన్నది న్యాయస్థానాల పరిధిలోని వ్యవహారం. ఇదేమీ కొత్త విషయం కాదు. రాష్ట్రపతి, గవర్నర్ల నిర్ణయాలనూ న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశాలు మన దేశంలో ఉన్నాయి. అటువంటప్పుడు సమాచార కమిషన్‌ను మాత్రమే మినహాయింపుగా ప్రస్తావించడం సమంజసం కాదు.
ఉభయ సభలూ ఆర్‌టీఐ చట్ట సవరణలకు ఆమోదం తెలిపాయి. ఆ మేరకు సవరణలు ప్రతిపాదించే ముందు ఏ దశలోనూ సమగ్ర చర్చ జరగలేదు. ప్రజాబాహుళ్యంతో ముడివడిన ఈ వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టిన తరవాత నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుండేది. అలాకాకుండా ఆదరాబాదరగా, ఎలాంటి హేతుబద్ధత లేకుండా సవరణలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమాచార కమిషనర్ల పదవీకాలం, హోదాలపై నియంత్రణ సాధించి దేశవ్యాప్తంగా సమాచార కమిషన్లను గుప్పిట పట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అన్నఅనుమానాలున్నాయి. దీనివల్ల సహ చట్టం బలహీనపడుతుంది. పటుతర వ్యవస్థ నీరుగారిపోతుంది. సమాచార కమిషనర్లకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని 2005లో భాజపా ఎంపీలు డిమాండ్‌ చేశారు. గతంలో తాము అనుసరించిన విధానాలకు భిన్నంగా ఇప్పుడు వారి వ్యవహార సరళి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సమాచార కమిషన్లు పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయి. ప్రజాస్వామ్య విలువలకు జవాబుదారీగా ఉండే ఇలాంటి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిందిపోయి- వాటిని బలహీనపరచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు!