ఎరుపెక్కిన పసుపు

  • -నిజామాబాద్‌లో ఊపందుకున్న పసుపు ఉద్యమం
  • -మూడు రోజులపాటు పాదయాత్ర
  • -ఎంపీ ధర్మపురి అరవింద్‌ దిష్టిబొమ్మ దగ్ధం
  • -రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు
  • -ఉద్యమంతో లబ్ధిపొందాలని చూస్తున్న టీీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు
  • -గతేడాది కుదిపేసిన ఎర్రజొన్న రైతుల ఆందోళనలు
  • -కేంద్రంపై నెట్టేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు
  • -రెండు పార్టీల రాజకీయానికి బలవుతున్న పసుపు రైతులు
  • -గత ఎన్నికలలో కవిత ఓటమికి కారణమైన పసుపు రైతులు
  • -అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ కవిత
  • -భారీగా తగ్గిపోయిన పసుపు దిగుబడులు

(బొబ్బిలి నర్సయ్య, నిజామాబాద్‌ బ్యూరో)
నిజామాబాద్‌:
నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్కటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు మూడు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు.
జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మర్‌ పల్లి వేల్పురు మండల కేంద్రంలో ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
అనంతరం మెండోరా మండలం సావేల్‌, కోడిచర్ల, మెండోరా గ్రామాల్లో పసుపు రైతుల పాదయాత్రతో పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తామని పసుపు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్‌ ఆ మాట నిలబెట్టుకోవాలని పసుపు రైతులు డిమాండ్‌ చేశారు.
పసుపు ఉద్యమం మొదలు కాగానే కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు కదిలాయి. గత ఎన్నికల్లో రైతులు చేపట్టిన ఉద్యమం ఫలితాలను తారుమారు చేయడంతో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఎవరికి వారే తమ ప్రయత్నాల్లో ఉన్నారు. రైతు ఐక్యకార్యచరణ కమిటీలో ప్రతిపక్షాలక చెందిన నేతలతోపాటు రైతులు ఉండటం గతంలో భారీగా ఉద్యమం చేయడం వల్ల రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని ఈ రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. రైతులు మాత్రం తమకు రాజకీలయకు అతీతంగా మద్దతు కల్పించాలని పట్టుపడుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే న్యాయం జరుగుతందని భావిస్తున్నారు. పోలీసులు మాత్రం గత సంవత్సరం ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఉద్యమం ఉదతంగా మారడంతో మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావతం కాకుండా ఉండేందుకు చర్య లు చేపట్టారు. ముందే అనుమతి నిరాకరించారు. మెండోరా ప్రాంతంలో మందస్తు బందోబస్తును ఏర్పాటును చేస్తున్నారు. అవసరమైతే రైతు నేతలను ముందే అదుపులోకి తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. పసుపు రైతులు మార్కెట్‌కు పసుపు తీసుకువచ్చే సమయంలో మొదలవుతున్న ఈ ఉద్యమం ఏ మలుపులు తిరుగుతుందో రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో రైతుల ఉద్యమం టీఆర్‌ఎస్‌కు నష్టం చేయగా ప్రస్తుతం మొదలవుతున్న ఈ ఉద్యమం ఏ పార్టీకి ఇబ్బందులు తీసుకువస్తుందో వేచి చూడాలి.
రాష్ట్ర సమస్యల్ని కేంద్రంపై నెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్య ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదనీ, ఇచ్చుకుంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిలిచిపోయాయంటే కారణం రాష్ట్ర వాటా పన్నుల్ని కేంద్రం చెల్లించకపోవడం అంటున్నారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది అంటున్నారు. నెపాన్ని కేంద్రంపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే%ౌౌ% భాజపా కూడా అదే తరహాలో రాష్ట్రంపై విమర్శలు ప్రారంభించింది. వారి బాధ్యత, వారిచ్చిన మాటల్ని తప్పుతూ%ౌౌ% తప్పంతా రాష్ట్రానిదే అనే వాదన వినిపించడం వాళ్లూ మొదలుపెట్టారు. పసుపు బోర్డు తెస్తామని ఎంపీ అరవింద్‌ మాట తప్పారంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఓట్లేయించుకున్నారనీ, ఇప్పుడు బోర్డుకు మించింది ఇంకేదో తెస్తామని, అదేదో స్పష్టంగా చెప్పకపోతే ఎలా నమ్మాలనేది రైతులు ప్రశ్న. నిజానికి, ఈ అంశాన్ని తెరాస వాడుకుంటే.. రాజకీయంగా నిజామాబాద్‌ జిల్లాలో రైతుల్ని తమవైపు తిప్పుకునే అవకాశం ఉంది. అయితే, ఆ ఛాన్స్‌ తెరాసకు ఇవ్వకుండా పసుపు రైతుల సమస్యలకు కేసీఆర్‌ సర్కారే కారణమంటూ విమర్శలు చేస్తున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్‌. పసుపు రైతులకు మద్దతు ధర రాకపోవడానికి కేసీఆర్‌ కారణమన్నారు. మద్దతు ధరను నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి ఎందుకు ప్రపోజల్‌ పంపించలేదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ పంటల మద్దతు ధరలను నిర్ణయించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిన బాధ్యతల రాష్ట్రాలకు ఉంటుందన్నారు. రాష్ట్రం ప్రతిపాదన పంపితే, వెంటనే అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మద్దతు ధర నిర్ణయించి, ప్రపోజల్స్‌ తయారు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాస్తానని అరవింద్‌ చెప్పారు. వాస్తవానికి, పసుపు రైతులకు బోర్డు తెప్పించి, ఆదుకుంటామని చెప్పి గెలిచారు అరవింద్‌. అయితే, దాన్ని కేంద్రం నుంచి ఆయన సాధించుకోలేకపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్నదీ ఇదే కదా! రాష్ట్రంలో పాలనా వైఫల్యాలకు తమ హయాం కారణం కాదనీ, కేంద్రానిదే తప్పు అని వేలెత్తి చూపే పనిలో ఉన్నారు. సీఎం వెర్సెస్‌ భాజపా నేతలు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలకే పరిమితం అవుతున్నారు. కేంద్రం, రాష్ట్రం.. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలకు వారి వైఫల్యాలను వాడుకుంటే, సమస్యలపై వాస్తవ రూపంలో పరిష్కార మార్గం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితి!
పసుపు దిగుబడులు ఈసారి భారీగానే పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన అక్టోబర్‌లో వారం రోజులుగా ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల్లో విస్తతంగా పర్యటిస్తూ పసుపు పంటను పరిశీలించారు. సెప్టెంబర్‌ చివరి వారం నుండి అక్టోబర్‌ మాసాంతం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో దాని ప్రభావం పసుపు పంటపై పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో పసుపు పంటను సాగుచేసే ఆర్మూర్‌ డివిజన్‌లో ఈసారి వర్షపాతం 20శాతం అధికంగానే నమోదైంది. వాస్తవానికి ఈ సంవత్సరం పసుపు సాగు విస్తీర్ణం కొంతమేర తగ్గిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు కురియకపోవడంతో చాలా మంది రైతులు బోరుబావుల కిందనే ఈ పంటను సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం కంటే 15శాతం మేర పసుపు సాగు విస్తీర్ణం తగ్గింది.
రమారమి 25వేల ఎకరాలలో పసుపుపంట సాగైనట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురియడంతో పసుపు పంట చేలలో రోజుల తరబడి నీళ్లు నిలిచిపోయాయి. వాస్తవానికి పసుపు పంటకు సరిపడా తడులను రైతులు సమయానుసారంగా అందిస్తారు. ఈసారి క్రమంగా వర్షాలు కురియడంతో పసుపు క్షేత్రాలన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో మర్రి ఆకు తెగుళ్లు, దుంపకుళ్లు తదితర తెగుళ్లు పసుపు పంటను ఎక్కువగా ఆశించాయి. వాస్తవానికి జనవరి మొదటి వారం నుండి పసుపు తవ్వకాలు ప్రారంభమవుతాయి. ముందస్తుగా ఈ పంటను సాగు చేసిన రైతులు డిసెంబర్‌ మూడవ వారంలోనే తవ్వకాలు ప్రారంభిస్తారు. పసుపు పంటకు తెగుళ్లు సోకడంతో పది రోజులుగా ఉద్యానవన శాఖ అధికారులు డివిజన్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటంచి పసుపు పంటను పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో మర్రాకు తెగుళ్లు ఎక్కువగా కనిపించినట్లు నిర్ధారించుకున్న అధికారులు, ఆ మేరకు నివారణ చర్యలను రైతులకు సూచించారు. దీనికి తోడుగా చాలా ప్రాంతాల్లో దుంపకుళ్లు తెగుళ్లు కూడా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. పసుపు పంట చాలా ప్రాంతాల్లో ఎండిపోయినట్లుగా తయారైంది. దానికి మర్రాకు తెగుళ్లే కారణమని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గిపోయాయని రైతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
ప్రస్తుతం దుంప ఊరే సమయమని, ఇలాంటి పరిస్థితుల్లో తెగుళ్లు సోకడంతో ఆ ప్రభావం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందేమోనని భయపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పసుపు దిగుబడులు గణనీయంగా తగ్గిపోవచ్చునని నిపుణుల అంచనా. కనీసం 25నుండి 30శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నట్లుగా అధికారులతో పాటు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎకరాన 18 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తే ఫరవాలేదని, ప్రస్తుత పరిస్థితిని బట్టి 15క్వింటాళ్లకు మించకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా పసుపు అధికంగా పండించే తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ఈసారి పసుపు దిగుబడులు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని, భారీ వర్షాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పసుపు సాగు విస్తీర్ణం తగ్గిందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నివారణ చర్యలు సరిగ్గా చేపట్టి దిగుబడులను పెంచగలిగితే మంచి లాభాలను సంపాదించుకోవచ్చునని, మార్కెట్లో పసుపునకు డిమాండ్‌ ఉంటుందని, పంట పండించిన రైతుకు పూర్తి న్యాయం జరుగుతుందని వారంటున్నారు. మర్రాకు తెగుళ్లు, దుంపకుళ్లు సోకటంతో చాలా మంది రైతులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఉద్యానవన శాఖ అధికారులు సూచించినట్లుగా బెడ్డు సాగు విధానంలో పంటను పండించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండకపోయేదని వారి ఆలోచన. ఏదేమైనప్పటికీ భారీ అంచనాలతో పసుపు పంట పండించిన రైతులు, దిగుబడులు తగ్గే అవకాశాలు కనిపిస్తుండటంతో కనీసం మార్కెట్లో గిట్టుబాటు ధరైనా సరిగ్గా లభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.