డ్యాషింగ్ క్యాబ్ గర్ల్స్
ఆఫీసుకు టైం అయిపోతోంది. అసలే బాస్ చాలా స్ట్రిక్ట్. బస్టాండ్‌కు వచ్చి గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షణ. ఎప్పుడు ఏ బస్సు వస్తుందో తెలియదు. వచ్చిన బస్సులో నిలబడటానికి కూడా స్థలం ఉండదు. సర్కస్ కంపెనీలో ఒంటికాలిపై డ్యాన్స్ చేస్తూ ప్రదర్శనలిచ్చినట్లుంటుంది హైదరాబాద్ నగర బస్సుల్లో ప్రయాణం. ఇక బస్సుల్లో పోకిరీలు చేతులు తాకిస్తూ అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు. అన్నీ పంటికింద బిగించుకుని కోపాన్ని దిగమింగుకుని ప్రయాణం చేయవలసి వస్తోంది గీతకు. ఇంత కష్టపడి ఆఫీసుకు లేటుగా వెళితే అక్కడ బాస్ అష్టోత్తరం. ఇక సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వెళ్లేందుకు కూడా ఇదే పరిస్థితి. ఒక్కోసారి ఆఫీసుకు ఎందుకు వెళుతున్నానురా భగవంతుడా అనే పరిస్థితి వస్తుంది. ఇక సర్వీస్ ఆటోల్లోనూ ఇదే పరిస్థితి. బైక్ టాక్సీలూ అంత సురక్షితం కాదు.. కాలేజీ చదువులు, ఉద్యోగాల కోసం బయటకు వచ్చే దాదాపు 90 శాతం యువతులు, సగటు మహిళలు నిత్యం ఎదుర్కొనే ఇబ్బందులు. ఒక మహిళ సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలంటే ఏమి చేయాలి? అదే మహిళలు డ్రైవ్ చేసే బైక్ టాక్సీలైతే… అనే ఆలోచన వచ్చింది. దాని ఫలితమే నేడు దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో వెలిసిన మహిళా మోటర్‌బైక్ టాక్సీలు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గర్ల్స్ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
శ్రీముఖి తన ఇంటి నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్లాలి. బస్సులు టైంకి రావడం లేదు. సరే ఆటో అయినా తీసుకుందామా? అంటే ఓ సగటు మహిళకు అది శక్తికి మించిన భారం. ఎంత ఆలస్యమైనా బస్సు కోసం ఎదురుచూస్తూనే ఉంది. చివరకు ఆమె ఎక్కాల్సిన బస్సు రానే వచ్చింది. బస్సు నిండా కిటకిటలాడుతూ జనం ఉన్నారు. అతి కష్టం మీద బస్సెక్కింది. కానీ నిలుచోడానికే కష్టంగా ఉంది. అదే అదనుగా చూసుకున్నారు కొందరు పోకిరీలు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ.. ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇది సగటు మహిళ ఒక్కరోజు సమస్య కాదు. దాదాపు అన్నిరోజులూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇందు ఇంటర్ చదువుతుంది. పరీక్షకు టైం అవుతోంది. బస్సు కోసం ఎదురుచూసి చూసి చివరకు బైక్ టాక్సీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంది. పది నిమిషాల్లో డ్రైవర్ ఇచ్చిన అడ్రస్ దగ్గరకు చేరుకున్నాడు. అపరిచిత వ్యక్తి అయినా తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ఎక్కక తప్పలేదు. స్పీడు బ్రేకర్ వస్తే చాలు కావాలని అతను బ్రేక్ వేయడం ఇందు గమనిస్తూనే ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత ఆమెది. అమృత ఒక గహిణి. నెలవారీ సరుకులు తెచ్చుకోవడానికి బజారుకి వెళ్లాలనుకుంది. అందుకోసం షేరింగ్ ఆటోని ఆశ్రయించింది. అందులో స్థాయికి మించి జనాలు ఎక్కారు. కొందరు యువకులు కావాలనే తన శరీరాన్ని తాకుతున్నారు. ‘దూరంగా కూర్చోండి!’ అంటే.. ‘ఇది షేరింగ్ ఆటో మీ ఒక్కరిదే కాదు!’ అంటూ వాదనకు దిగుతున్నారు.
ఇది ఏ కొందరి ఆడవారి సమస్య మాత్రమే కాదు. నేడు యువతులు, మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్య. మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత క్షేమంగా గమ్యస్థానానికి చేరడం ఒక సవాలుగా మారింది. ఇంకా ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడటం ఉద్యోగినులకు కత్తి మీద సాములాంటిదే. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న కొందరి ఆలోచనల నుంచి వచ్చిందే మహిళలు మాత్రమే నడిపే మోటార్‌బైక్ టాక్సీలు. ఇందులో డ్రైవర్లు, ప్రయాణీకులూ మహిళలే. దీంతో వేధింపులు ఉండవు.. హ్యపీగా ఉంటుంది జర్నీ అనేది వారి ఆలోచన. ఇలాంటివి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో, మన దేశంలో ప్రధాన నగరాలలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ మోటర్ బైక్ టాక్సీలు నడిపే డేరింగ్ అండ్ డ్యాషింగ్ గర్ల్స్ గురించి తెలుసుకుందాం.
లిల్లీ రైడ్
బంగ్లాదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను వాడుతున్న 90 శాతం మందికి పైగా మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లో ‘లిల్లీరైడ్’ అనేది ఒక యాప్. వాస్తవానికి మహిళలకు ప్రత్యేకంగా బైక్‌రైడ్స్ అందించే దేశాలలో ఈ యాప్ మొదటిది. సంస్థ లోగోతో ఎర్రటి టీ-షర్టులతో ఉన్న మహిళా రైడర్స్ తోటి మహిళలను అనుకున్న గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడంలో దిట్టలు. ఈ సంస్థను 2017లో సయ్యద్ సైఫ్, షా తుషార్‌లు ప్రారంభించారు. ‘మహిళలకు మాత్రమే’ అనేది వీరి నినాదం. ‘ఒకరోజు నా భార్య యూనివర్శిటీకి వెళ్లాలనుకుంది. అందుకోసం పురుష బైక్‌రైడర్‌ను ఆశ్రయించింది. మార్గమధ్యంలో అతను ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. దాంతో చాలా రోజులు ఆ మాటలు తలచుకుని బాధపడింది. నా భార్యలా మరో స్త్రీ బాధ పడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకోసం ఏమి చేయాలి? అని ఆలోచించా. స్త్రీలే మోటర్ ట్యాక్సీ బైక్ రైడర్ అయితే అనే ఆలోచన అప్పుడే నా మనస్సులో మెదిలింది. దాని కార్యరూపమే ‘లిల్లీరైడ్’ అంటున్నాడు’ సైఫ్. ‘రోజూ లిల్లీరైడ్ టాక్సీలనే వినియోగిస్తుంటాను. ఉద్యోగం చేసే నాలాంటి మహిళలు ఓ తల్లిగా, భార్యగా కుటుంబానికీ కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. బస్సులో వెళ్తే బైక్ మీద వెళ్లడానికంటే మూడురెట్లు ఎక్కువ సమయం పడుతుంది. పేపర్లలో బస్సు ప్రమాదాల గురించి వార్తలు చదువుతుంటే.. వాటిలో ప్రయాణమంటేనే భయమేస్తుంది. కానీ, లిల్లీరైడ్ ఉపయోగించడం మొదలుపెట్టాక సమయంతోపాటు, డబ్బు కూడా ఆదా అవుతోంది’ అంటోంది అరుంధతి అనే ఉద్యోగిని.
లిల్లీరైడ్‌కు ప్రస్తుతం రోజుకు 300 వరకూ ఆర్డర్లు వస్తున్నాయి. పుల్‌టైం డ్రైవర్లు 19 మందే ఉండటంతో ఆర్డర్లన్నీ తీసుకోలేకపోతున్నారు. ‘ఈ సంస్థ తొలి డ్రైవర్లలో నేనూ ఒకరిని. ప్రస్తుతం శిక్షణ ఇచ్చే స్థాయికి చేరాను. మా ప్రాంతంలో అమ్మాయిలకు బైక్ నడపడం కాదు కదా! సైకిల్ తొక్కడం కూడా చాలా అసాధారణమైన విషయం. అలాంటి పరిస్థితుల్లోనూ బైక్ నేర్చుకున్నాను. దీంతో కొందరు విమర్శించారు. మరికొందరు అభినందించారు. ఎవరో కొందరు చేసే విమర్శలు నాకిష్టమైన పనిని చేయకుండా ఆపలేవు’ అంటోంది కవిత. బంగ్లాదేశ్‌లో 2016లో 110సిసి మోటర్‌బైక్ అయిన పర్పుల్ టివిఎస్ స్కూటీ జెస్ట్‌ను 27 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ అఫ్రిదా తంజిమ్ కొన్నారు. ‘మోటారు బైక్‌ను నడిపే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారని అమ్మ అంటే, ఒక అమ్మాయి బైక్ నడపడం దారుణమైన విషయమని నాన్న అన్నారు. ఎవరు ఏమంటున్నా ఉక్కిరిబిక్కిరి చేసే ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి స్కూటీని వాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నా. లిల్లీరైడ్‌లో డ్రైవర్‌గా చేరినందువల్ల పెట్రోలు ఖర్చు మిగలడమే కాకుండా, జీతమూ వస్తుంది. ఆ డబ్బుతోనే ల్యాప్‌టాప్‌ను కొనగలిగా!’ అంటోంది తంజిమ్.
మన దేశంలోనూ..
మన దేశంలో జకార్తా, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే మహిళా మోటర్ బైక్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. గుర్గావ్‌లో మహిళల కోసం మహిళా డ్రైవర్లతో పింక్ బైక్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిని ‘బైక్సీ’ అని పిలుస్తారు. అద్దె టాక్సీలను బుక్ చేసుకున్నట్లే ఈ ‘బైక్సీ’లనూ యాప్ ద్వారా మొబైల్ నుంచి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
వీటిని దివ్యాకాలియా, ఆమె భర్త మోహిత్‌శర్మ ప్రారంభించారు. మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో మోటర్ బైక్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ‘గెట్‌మిబైక్’ టాక్సీ పేరుతో శ్రావ్యారెడ్డి, యశ్వంత్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇక్కడ మాత్రం ఏ నగరంలో లేనివిధంగా మహిళల కోసం మహిళా రైడర్లు, పురుషుల కోసం మేల్ రైడర్లను అందుబాటులో ఉంచింది సంస్థ. ‘మాది కరీంనగర్. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రిలయన్స్ కంపెనీలో పనిచేసేదాన్ని. సికింద్రాబాద్ నుంచి కారులో ఆఫీసుకు వెళ్లేందుకు ట్రాఫిక్ వల్ల రోజూ గంటన్నర పట్టేది. ఒకరోజు ఫ్రెండ్ బండిపై వెళితే 40 నిమిషాల్లోనే చేరుకున్నా. అంటే సగం సమయం ఆదా అయ్యిందన్నమాట. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది’ అంటోంది శ్రావ్యారెడ్డి. గెట్‌మి డ్రైవర్లంతా ఆరెంజ్ కలర్ డ్రెస్, ఆరంజ్ హెల్మెట్ ధరించి ఉంటారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల తుంపా బర్మన్ ఢిల్లీలో మొట్టమొదటి మోటర్ బైక్ టాక్సీ మహిళా డ్రైవర్‌గా గుర్తింపు పొందింది. ఆమె ప్రముఖ ‘అంకుర’ సంస్థలో పనిచేస్తోంది. దిగువ మధ్యతరగతికి చెందిన బర్మన్ కుటుంబం ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఆమె పన్నెండో తరగతి పూర్తి చేసిన వెంటనే కుటుంబ ఆర్థిక అవసరాలరీత్యా మహిళా డ్రైవర్‌గా మారింది. రోజుకు పదిగంటలు డ్రైవర్‌గా పనిచేసినందు వల్ల తనలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటోంది బర్మన్.
రద్దీ రోడ్ల మీద పురుషులకు ధీటుగా మోటర్‌బైక్ రైడ్ చేస్తూ ఈ మహిళలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పురుషులకన్నా మేమే మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వీరి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తెగువను దగ్గరగా చూసిన ఎందరో ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్ గర్ల్స్!’ అంటూ కితాబిస్తున్నారు.