సీఎం చేస్తానని మాటిచ్చా

శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపా, శివసేన సీట్ల కేటాయింపులకు సంబంధించి తుది నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బాంద్రాలో శివసేన తరఫున టికెట్‌ ఆశించే వారితో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో అధికారంలోకి వస్తామని, శివసైనికుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని నా తండ్రి శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రేకు మాటిచ్చాను. ఆ మాటను సాకారం చేసే దిశగా క షి చేస్తాను. 288 స్థానాలనుంచి ఆశావహులను పిలిచింది ఎందుకంటే మహారాష్ట్రలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ భాజపాతో పొత్తు ఏర్పడితే.. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అన్ని స్థానాల్లో విజయానికి శివసేన క షి చేస్తుంది. అదేవిధంగా సేన అభ్యర్థులకు కూడా భాజపా మద్దతు ఉంటుందని చెప్పారు. శివసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు పూర్తి సంసిద్ధంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు అక్టోబర్‌ 21న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నెల రోజులు గడువు కూడా లేదు. అయినప్పటికీ శివసేన, భాజపా పొత్తులో భాగంగా ఇంకా సీట్ల కేటాయింపులపై నిర్ణయం ప్రకటించకపోవడం గమనార్హం.