కర్ణాటక ఉపపోరు వాయిదా
సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈసీ తన నిర్ణయాన్ని ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉప ఎన్నికలు వాయిదా వేసేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది. అనర్హత వేటు ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనానికి తన నిర్ణయాన్ని ఈసీ తెలిపింది. అక్టోబర్ 22న తదుపరి విచారణను సుప్రీం కోర్టు చేపట్టనుంది. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. దీనిపై సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇటీవల మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీలకు జరగాల్సిన ఎన్నికలతో పాటు కర్ణాటకలోని 15 స్థానాలకు కూడా ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి.. 24న ఫలితాలు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉప పోరు వాయిదా పడింది. దీంతో కర్ణాటక రాజకీయం మరోసారి ఉత్కంఠగా మారింది.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 2018లో అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జైట్లీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, ఈ నెల 8వ తేదీన కన్నుమూశారు. ఈ క్రమంలో ఈ రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.