యోగి వ్యాఖ్యలపై దుమారం

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విపక్షాల విమర్శలు

లక్నో: వివాహేతర సంబంధాలపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. హిందువులతో సహా అక్రమ సంబంధాలు సాగించే పురుషులందరిపైనా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం యోగి పేర్కొన్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులను శిక్షించడానికి యూపీ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ట్రిపుల్‌ తలాక్‌ బాధితులనుద్దేశించి ప్రసంగిస్తూ సీఎం యోగి ఈ మేరకు స్పందించారు. కాగా యోగి ఆదిత్యనాధ్‌ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు సహా రాజకీయ పక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలంటూ కొందరు హితవు పలకగా… మరికొందరు సీఎం యోగి అమాయకుడంటూ కొట్టిపారేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ…
”భార్య అనుమతి లేకుండా, భార్య నుంచి విడిపోయిన ఓ హిందూ వ్యక్తి వివాహేతర సంబంధం కలిగి ఉంటే… అప్పుడు ఏ చట్టమూ ఏమీ చేయలేదు. భార్య ఫిర్యాదు చేసే వరకు అలాంటి వ్యక్తిని విచారించేందుకు చట్టం అనుమతిస్తుందని కూడా నేను అనుకోను…” అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయజాలదనీ.. కేవలం కేంద్రం మాత్రమే చట్టం చేయగలదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ వ్యాఖ్యలను బట్టి సీఎం యోగి ఎంత ”అమాయకుడో” తెలుస్తున్నదంటూ ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న సీఎం యోగి… ”చట్టాన్ని గౌరవించాలని” ఎన్సీపీ నేత మాజిద్‌ మీమన్‌ హితవు పలికారు. కాగా ట్రిపుల్‌ తలాక్‌ బాధితులకు తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం తరపున సంవత్సరానికి రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తామని సీఎం యోగి ప్రకటించారు.