ఉద్యోగుల ఉద్యమ ‘సెగ’ !!

అగ్గిరాజేస్తున్న సీఎం వ్యాఖ్యలు: ప్రభుత్వంతో తాడో పేడో
  • -ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్‌ ఘాటు విమర్శలు
  • -ఇప్పటికే వీఆర్వోలు, తహసీల్దార్లలో నైరాశ్యం
  • -ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలచిన బీజేపీ, కాంగ్రెస్‌
  • -కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను రద్దుచేయాలని టీచర్ల ఆందోళన
  • -పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్‌
  • -దసరా సెలవల తర్వాత ఉద్యమించేందుకు సిద్ధం
  • -ఉద్యోగ సంఘాలపైనా సీఎం అనుచిత వ్యాఖ్యలు
  • -వెట్టిచాకిరీపై గుర్రుమంటున్న టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
  • -మున్సిపల్‌ ఎన్నికలకు ముందే ప్రభుత్వంపై ఒత్తిడి

హైదరాబాద్‌:
కేసీఆర్‌ ఒకరి మీద పట్టు సాధించాలన్నా, ఒకరిని టార్గెట్‌ చేయాలన్నా ముందుగా వాళ్ళ మానసిక స్థితిని దెబ్బ కొట్టాలని చూస్తారు. అలాగే గతంలో వాళ్ళ వలన తాను ఎంత లబ్ది పొందాను అనే విషయం మర్చిపోయి, వాళ్ళని నిర్దాక్షణంగా తొక్కటానికి ముందు వెనుక కూడా ఆలోచించరు కేసీఆర్‌. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు పైన చెప్పిన వాటికి సరిగ్గా సరిపోతుంది. మొన్నటి అసెంబ్లీలో ఉద్యోగుల గురించి కేసీఆర్‌ ఘాటు విమర్శలే చేశారు. ”కుక్క తోక సామెతను ఉద్యోగులకి ఆపాదించి మరి కేసీఆర్‌ మాట్లాడిన మాటలు ఇప్పడు ప్రభుత్వ ఉద్యోగులకి మంట పుట్టిస్తున్నాయి” ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్‌ చేయలేరని, శాసన సభలోనే చట్టాలు తయారవుతాయని, వాటికి అనుగుణంగానే ఉద్యోగులు పనిచేయాలని తేల్చి చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం పేరుతో వీఆర్వోల అధికారాలకు కత్తెర వేస్తున్నారు. దీన్ని ఆయా సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలు సపోర్ట్‌ ఇస్తున్నాయి. అది సహించని కేసీఆర్‌ ఇష్టం వచ్చిన రీతిలో ఉద్యోగుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇదే ఉద్యోగులు తెలంగాణ సమయంలో తమ ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా రోడ్లు మీదకి వచ్చి ధర్నాలు చేయటం వలనే కాదే, రాష్ట్రంలో పరిపాలన స్తంభించి, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. దానిని అడ్డం పెట్టుకొని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ పోరాటం చేసిన అనేక మంది ఉద్యోగులు అలాగే మిగిలిపోయారు. అలాంటి ఉద్యోగుల విషయంలో నేడు కేసీఆర్‌ దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడటం కరెక్ట్‌ కాదు.
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఉద్యోగులు శాసించలేరని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడ ఈ రకమైన పరిస్థితి లేదన్నారు. శాసనసభ, ఎమ్మెల్యేలు చట్టాలను చేస్తాయని కేసీఆర్‌ గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిన పనులను ఉద్యోగులు చేయాల్సిందేని కేసీఆర్‌ తేల్చి చెప్పారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. మొన్న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టుగా కేసీఆర్‌ కుండబద్దలు కొట్టారు. కొత్త రెవిన్యూ చట్టం చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని ప్రపంచం మొత్తం కూడ కాపీ కొట్టే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. కొత్త రెవిన్యూ చట్టం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉద్యోగులపై తమ ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. చట్టాలను ఉద్యోగులు రూపొందించరు, ఉద్యోగులు చెప్పినట్టుగా ప్రభుత్వాలు నడుచుకోవని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వాలను ఉద్యోగులు డైరెక్ట్‌ చేయలేరన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన పనులను అవినీతి రహితంగా ఉద్యోగులు చేయాల్సిందేనని కేసీఆర్‌ తేల్చి చెప్పారు. పారదర్శకంగా ఉద్యోగులు పనిచేయాలనేది తమ ప్రభుత్వ అభిమతమని కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పారు. ఉద్యోగులు చెప్పినట్టుగానే శాసనసభ నడిస్తే ఎమ్మెల్యేలు, మనం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ చట్టాలు చేస్తాయని ఆయన ఉద్యోగులకు గుర్తు చేశారు. కొత్త రెవిన్యూ చట్టం చేసే ముందు రెవిన్యూ ఉద్యోగులతో కూడ మాట్లాడుతామని ఆయన ప్రకటించారు. కానీ, అనవసరంగా రోడ్లపైకి వస్తే మీరే నష్టపోతారని ఆయన రెవిన్యూ ఉద్యోగులను హెచ్చరించారు. ఉద్యోగుల కోసమే ప్రభుత్వం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త రెవిన్యూ చట్టంలో కొందరిని అవసరమైతే మార్చాల్సి వస్తే రావొచ్చని కూడ ఆయన స్పష్టం చేశారు.
కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను వెంటనే రద్దుచేయాలని, ఐఆర్‌, పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీచర్లు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇటీవల ఆందోళన చేపట్టారు. సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్‌ 1ని విద్రోహ దినంగా పాటిస్తూ సత్యాగ్రహ దీక్షలు, ర్యాలీలు, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద టీచర్స్‌ జేఏసీ(జాక్టో) ఆధ్వర్యంలో ‘ఉపాధ్యాయ గర్జన’ నిర్వహించారు. 2018 మే 16న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని జాక్టో నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు.
తమది పసికూన ప్రభుత్వమని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్‌ తొలి ఐదేండ్లు కాలం గడిపారని,రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటే ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కష్ణయ్య అన్నారు. జూన్‌ 2న అందరికీ ఐఆర్‌ అని, ఆగస్టు 15న కడుపునిండా పీఆర్‌సీ ఇస్తామని నమ్మబలికిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగానే మిగిలాయని హైదరాబాద్‌లో జరిగిన ‘ఉపాధ్యాయ గర్జన’లో ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో సగానికి పైగా ఉద్యోగుల వేతనాలకు, పింఛన్లకే ఖర్చవుతుందంటూ, ఏ రాష్ట్రంలో లేనంత మన రాష్ట్రంలోనే ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు .అయితే.. దేశంలో వేతనాల చెల్లిం పులో తెలంగాణ 17వ స్థానంలో ఉందనే విషయం సీఎం గ్రహించాలని హితవుపలికారు. పింఛన్‌ పొందడం ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగం కల్పించి న హక్కని, నిర్ణీత కాలానికి ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు పింఛన్‌ సౌకర్యం ఉన్నప్పుడు, 30 ఏండ్లకు పైగా ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర పోషించే ఉద్యోగులకు మాత్రం వద్దా అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు.. దీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు, ఉద్యోగుల నిరసనలు హోరెత్తాయి. ఇటీవల పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట టీచర్లు సత్యాగ్రహ దీక్ష చేసిన విషయం విదితమే. కోర్టు చౌరస్తా వద్ద నల్లచొక్కాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లిలో వివిధ టీచర్స్‌? యూనియన్స్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట పీఆర్‌ టీయూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సిరిసిల్లలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యం లో నిరసన ర్యాలీ తీశారు . ఈ సందర్భంగా టీచర్స్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్‌ విధానం వల్ల రాష్ట్రంలోని 1.40 లక్షల మంది ఉద్యోగ, టీచర్లు ఇబ్బందులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని యూనియన్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కో ఆర్డి నేటర్‌ కోలా రాజేష్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు . ఆదిలాబాద్‌లో పీఆర్‌ టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆఫీసు ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నిర్మల్‌లో టీయుటీఎఫ్‌ ఆధ్వర్యం లో ఆందోళన, పీఆర్టీయూ నేతత్వంలో సత్యాగ్రహ దీక్ష చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తపస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు ఇంటి వరకు ర్యాలీ తీశారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఆసిఫాబాద్‌లో టీఎస్‌ పీఆర్‌ టీయూ ఆధ్యర్యం లో ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు . పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ లోని ధర్నాచౌక్‌ లో నిర్వహించి న సత్యాగ్రహ దీక్షలో మాజీ ఎమ్మె ల్సీ పూల రవీందర్‌ పాల్గొన్నారు . సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌ లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారిన నూతన పెన్షన్‌ విధానాన్ని(సీపీఎస్‌) రద్దు చేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్‌ డిమాండ్‌ చేశారు . ఖమ్మంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొని, సీపీఎస్‌ రద్ధు చేయకపోతే పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో ఉద్యోగ, టీచర్స్‌ యూనియన్‌ నాయకులు సీపీఎస్‌ రద్దు కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి మెయిల్స్‌ పంపారు. యూఎస్‌ పీసీ, పీఆర్టీయూ, తపస్‌, వివిధ టీచర్ల సం ఘాల ఆధ్వర్యం లో నాగర్‌ కర్నూల్‌, గద్వాల, రాయణపేట, మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు. మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద సత్యాగ్రహ దీక్షలో పీఆర్‌ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌ రావు పాల్గొన్నారు . లక్షలాది ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ముందు జరిగిన ఆందోళనలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యాక్షులు జి.తిరుపతిరెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు . సంగారెడ్డిలో ఐబీ నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టరేట్‌ ఎదుట పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.