తూర్పు బంధం బలపడుతోంది

తూర్పు ఆసియా దేశాలతో భారత్‌ సాన్నిహిత్యం బలపడుతోంది. ‘ఆసియాన్‌’తో తిరుగులేని బంధం నెలకొల్పుకొన్న భారత్‌- జపాన్‌, దక్షిణ కొరియాలతో దశాబ్దాల స్నేహ బంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాతో జోరుగా దౌత్య సంబంధాలు నెరపుతోంది. భద్రతాపరమైన అంశాల్లో ఇరు దేశాల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. రెండు దేశాలకూ దాయాదులే ప్రధాన ముప్పు. ఇటు భారత్‌తో వైరి సంబంధాలున్న పాకిస్థాన్‌కు, అటు దక్షిణ కొరియా శత్రుదేశమైన ఉత్తర కొరియాకూ చైనా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కీలకమైన భారత్‌- దక్షిణ కొరియాలు చైనా ప్రాభవాన్ని సాధ్యమైనంత మేర నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల బంధం వేగంగా బలపడుతోంది. ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ద.కొరియాలో రెండురోజులపాటు జరిపిన పర్యటన ఇరుపక్షాల అనుబంధాన్ని మరో మెట్టుపైకి ఎక్కించింది. సెప్టెంబరులో భారత్‌-ద.కొరియా మధ్య రవాణా ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం భారత నావికాదళానికి చెందిన నౌకలు ఆ దేశపు రేవులో ఇంధనం నింపుకోవడం, మరమ్మతులు, ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు. అదే విధంగా ద.కొరియా నౌకలకు సైతం ఇక్కడి రేవులను వాడుకొనే అవకాశం లభిస్తుంది.
భారత్‌ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ (తూర్పువైపు అడుగు)కి, దక్షిణ కొరియా ‘న్యూ సదరన్‌ పాలసీ'(కొత్త దక్షిణ విధానం)కి ఇది బలాన్ని చేకూరుస్తోంది. భారత్‌కు సంబంధించిన వ్యూహాత్మక ప్రయోజనాలు ఈ ఒప్పందంతో కొంత మేరకు సిద్ధించాయి. దీంతో చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపెక్‌)లో దక్షిణ కొరియా కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకొనే అవకాశాలు మెరుగుపడ్డాయి. ‘సీపెక్‌’లో పెట్టుబడి పెట్టే కంపెనీలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సహకరించబోదనే హామీని భారత్‌ పొందింది. ఒకప్పుడు పాక్‌-అమెరికా మధ్య బలమైన సంబంధాలు ఉన్న సమయంలో అక్కడ అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశాల్లో ద.కొరియా రెండో స్థానంలో ఉంది. కానీ, 1999లో పాక్‌లో అధికార మార్పిడి అనంతర పరిణామాలతో పెట్టుబడులు చాలా వరకు తగ్గాయి. ఇటీవల పాక్‌ ప్రధానికి సలహాదారుగా ఉన్న రజాక్‌ దావూద్‌- సియోల్‌ను సందర్శించి ‘సీపెక్‌’లో పెట్టుబడి అవకాశాలను అక్కడి కంపెనీలకు వివరించారు. ఈ నేపథ్యంలో ‘సియోల్‌’ నాయకత్వం నుంచి భారత్‌కు ఈ హామీ రావడం గమనార్హం. ఇప్పటికే నావికా స్థావరాల పరస్పర వినియోగానికి అమెరికా, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. జపాన్‌తో ఇటువంటి ఒప్పందం చేసుకొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల జరిపిన పర్యటన సానుకూల ఫలితాలు ఇచ్చింది.
భారత్‌-ద.కొరియా సంబంధాలు వ్యాపారరంగంలో వేగంగా విస్తరిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం చైనా. ఇప్పటివరకు ద.కొరియాకు చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. హాంకాంగ్‌తో సహా చైనాకే 34శాతానికి పైగా ద.కొరియా ఎగుమతులు వెళతాయి. 2017నాటికి ఇరు దేశాల వాణిజ్య విలువ 281 బిలియన్‌ డాలర్ల వరకు ఉంది. ఆ తరవాత 16శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. కానీ, 2000 తరవాత చైనాలో విస్తరణ కాంక్ష పెరిగిపోవడం, ఆ దేశం ఉత్తర కొరియాకు ఉద్దేశపూర్వకంగా సహకరించడం ద.కొరియాను ఆలోచనలో పడేశాయి. ఉత్తర కొరియా నుంచి 2017లో క్షిపణి దాడి ప్రమాదం పొంచి ఉండటంతో అమెరికా ‘థాడ్‌’ క్షిపణి రక్షణ వ్యవస్థను ద.కొరియాలో ఏర్పాటు చేసింది. అందుకు ప్రతిగా చైనా తీసుకున్న చర్యల ఫలితంగా ఆ దేశంలో హ్యూందాయ్‌ మోటార్స్‌ విక్రయాలు 60శాతం పడిపోయాయి. ద.కొరియాకు చెందిన మరో దిగ్గజం ది లాట్‌ గ్రూప్‌నకు చెందిన వ్యాపారాలను చైనాలో బహిష్కరించాలనే ప్రచారం జరిగింది. ఫలితంగా 2016-’18 మధ్యలో ఆ సంస్థకు భారీ నష్టాలు సంభవించాయి. దాంతో ప్రత్యామ్నాయాలు చూసుకోకపోతే కష్టమన్న విషయం ద.కొరియాకు అర్థమైపోయింది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రక్షణాత్మక ధోరణుల కారణంగా బలమైన మార్కెట్‌ ఉన్న భారత్‌తో చెలిమి అవసరం ద.కొరియాకు తెలిసొచ్చింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుత వాణిజ్యం 21 బిలియన్‌ డాలర్లు. నిరుడు మూన్‌ జె ఎన్‌ భారత పర్యటన సందర్భంగా వచ్చే పదేళ్లలో ఇరు దేశాల వాణిజ్యాన్ని 50 బిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రకటించారు. సాఫ్ట్‌వేర్‌ సహా సేవల రంగంలో భారత్‌ ముందంజలో ఉన్నా ప్రధానంగా తయారీ రంగానికి సంబంధించిన సాంకేతికతలో మన దేశం వెనకబడి ఉంది. మరోపక్క ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. ఫలితంగా ప్రపంచ దేశాలు తమ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో మనదేశాన్ని ముంచెత్తుతున్నాయి. దీంతో భారత్‌ను హార్డ్‌వేర్‌ రంగంలో బలోపేతం చేసేందుకు ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ పాలసీ-2019’కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2025నాటికి భారత్‌ నుంచి 400 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎగుమతి చేయాలనేది దీని లక్ష్యం. దీనికోసం 190 బిలియన్‌ డాలర్ల విలువైన వంద కోట్ల మొబైల్‌ ఫోన్లను భారత్‌లో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే శామ్‌సంగ్‌, ఎల్‌జీ, కియా, హ్యూందాయ్‌ వంటి దిగ్గజాలు తమ తయారీ కేంద్రాలను మనదేశంలో నెలకొల్పాయి. సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాలనూ భారత్‌కు తీసుకురాగలిగితే భారీగా విదేశీ మారకద్రవ్యం మిగిలే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి ద.కొరియా దిగ్గజాలతో పెనవేసుకునే అనుబంధం భారత కార్పొరేట్‌ రంగంలో పరిశోధనల ప్రాధాన్యాన్ని తెలియజెప్పి, ఆ దిశగా చురుకుపుట్టించగలిగితే అంతకు మించి కావలసింది లేదు.