విషాధయాత్రలు

అనూహ్యమైన పరిస్థితుల్లో లేదా అనుకోని మానవ తప్పిదం పర్యవసానంగా సంభవించే దురదష్టకరమైన ఉదంతాలను ప్రమాదా లంటారు. కానీ దేవీపట్నం వద్ద గోదావరి ఒడిలో ఆదివారం దాదాపు 48 నిండు ప్రాణాలు జలసమాధి అయిన దుర్ఘటన ఈ కోవలోనిది కాదు. వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, పలుకుబడి గల కొందరు రాజకీయ నేతల దురాశ ఇంతమంది ప్రాణాలనూ చిదిమేశాయి. ఆ కోణంలో చూస్తే ఇవి దారుణ హత్యలు. పడవ ప్రయాణం ప్రాణాం తకంగా మారుతున్నా, రేవుల్లో అరాచకం రాజ్యమేలు తున్నా పట్టని పాలక నిర్లక్ష్యానికి తరచూ ఎందరో అభాగ్యులు బలైపోతున్నారు. 1957 జూన్‌లో భద్రాచలం వద్ద బోటు ప్రమాదం జరిగి 300మందికి పైగా మతి చెందిన ఘటన నుంచి నేటి వరకూ అనేక దుర్ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దేవీపట్నం వద్దే 1964లో 60మంది, ఆతర్వాత 8మంది, 2009 సెప్టెంబరులో దేవీపట్నం వద్దే ఏడుగురు 2018 మే 15న దేవీపట్నం వద్దే 19మంది జలసమాధి అయ్యారు. అంతేకాదు, 2003 అక్టోబరులో క ష్ణాజిల్లా గొల్లమంద వద్ద క ష్ణలో పడవ బోల్తా పడి 29మంది, 2017లో క ష్ణా-గోదావరి సంగమ ప్రాంతంలో బోటు బోల్తాకొట్టి 21మంది ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఉప్పుటేరులో పడవ మునిగి 20మంది, 2016లో కాళేశ్వరం సమీపంలో గోదావరిలో బోటు మునిగి ఐదుగురు చనిపోయారు. ఈ ప్రమాదాలకూ, ఈ మరణాలకు అంతూపొంతూ లేదా? బోటు బోల్తానే కాదు, కొన్ని సందర్భాలలో బోటుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతి సందర్భంలోనూ ఇకపై ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా చేస్తామని పాలకులు హామీ ఇవ్వడం, రోజులు గడిచేసరికల్లా అవన్నీ గాలికి కొట్టుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ ప్రమాదాలను నివారించే ఉపాయాలు, ప్రణాళికలు లేవా? లేకేం? చాలానే ఉన్నాయి. కానీ వాటిని ఆచరించే, అమలుచేసే నాథుడే కరవు. ప్రమాద నివారణ ఏమన్నా రాకెట్‌ సైన్సా? మనం కొత్తగా పరిశోధించి కనుగొనేదా? కామన్‌సెన్స్‌ ఉన్నవాడికెవడికైనా వేల ఉపాయాలు ఉచితంగా కనిపిస్తాయి.
పడవ ప్రయాణం సురక్షితంగా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసు కోవాలో, ఏ తరహా ప్రమాణాలు పాటించాలో, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, వేర్వేరు ప్రభుత్వ విభాగాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటో తెలియజెప్పే పుస్తకాన్ని జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) ప్రచురించింది. దానికి సంబంధించిన పీడీఎఫ్‌ ఫైలును తన వెబ్‌సైట్‌లో ఉంచింది. కానీ మన పాలకులు, అధికారులెవరూ వాటిపై ద ష్టి పెట్టిన దాఖలా గానీ, వాటిని అమలు చేసే ఆలోచనగానీ చేయడం లేదు. వాటిని అమల్లోకి తెచ్చి ఉంటే ఈ తరహా దుర్ఘటనలకు ఆస్కారమే ఉండేది కాదు. సముద్ర జలాల్లో సంచరించే పడవలతో పోలిస్తే నదుల్లోనూ, సరస్సుల్లోనూ పడవ ప్రయాణం సురక్షితమైనదంటారు. సముద్ర జలాల్లో నిరంతరం కెరటాల ఉధ తి ఉంటుంది. తరచు మారే వాతావరణ పరిస్థితుల ప్రభావం సరేసరి. అందువల్లే మత్స్యకార కుటుంబాలు తమవారు తిరిగొచ్చేవరకూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉంటారు. కానీ నదీనదాల్లో ప్రయాణం అలా కాదు. అక్కడ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పడవ ప్రయాణం ఎంతో సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది. అయితే పడవల నిర్వాహకులు, ప్రయాణికులు, ప్రభుత్వ విభాగాలు తగిన నియమనిబంధనలు పాటిస్తేనే అంతా సవ్యంగా ముగుస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా వందలమంది ప్రయాణికుల ప్రాణాలు నీటిపాలవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నదదే!
పవర్‌బోటుకు బిల్జ్‌(బోటమ్‌ ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌)లోకి నీళొస్తే వార్న్‌ చేయటానికి అలార్మ్‌ ఉంటుంది. నావిగేషన్‌ రాడర్‌ ఉంటుంది. బోటు కదిలే ముందరే అన్నీ పనిచేస్తున్నాయా లేదా అని చెక్‌ చేసిన తర్వాత చివరి చెక్‌ అందరూ లైఫ్‌ జాకెట్లు వేసుకున్నారా లేదా అన్నది చూడాలి. ఇది అన్నింటి కన్నా ముఖ్యం. లైఫ్‌ జాకెట్లు లేకుండా, వేసుకోకుండా ఏ ప్రయాణికుల బోటు కదలకూడదు. ప్రమాదం చెప్పిరాదు. ఏ క్షణంలోనైనా మన తప్పుల వల్లగానీ, ఇతరుల తప్పిదం వల్లగానీ, ప్రకతిరీత్యాగానీ రావచ్చు. ముందు జాగ్రత్తే ప్రమాద నివారణకు పరమౌషధం. ప్రాణాలను కాపాడే దివ్యౌషధం. ఆదివారం జరిగిన ప్రమాదంలో కొందరు బతికి బయటపడ్డారంటే అందుకు ప్రధాన కారణం లైఫ్‌ జాకెట్లేనన్నది గమనించాలి. ఎంత గజ ఈతగాళ్లయినా లైఫ్‌ జాకెట్‌ లేకుండా సహాయమొచ్చేదాకా ఈదలేరనేది నిర్వివాదాంశం. ప్రమాదంలో లైఫ్‌ జాకెట్‌ లేకుండా నీటమునిగే ప్రయాణికుడికి తక్షణ సహాయం అందించినా ప్రాణాలతో దరికి చేర్చడం కల్ల. బయటనుంచి అందే సహాయాలు కేవలం శవ సమీకరణకే ఉపయోగపడతాయనేది ప్రతి పడవ ప్రయాణికుడు, బోటు యాజ మాన్యం, అధికారులూ, రాజకీయ నాయకులూ తెలుసుకోవాల్సిన నగ సత్యం. లైఫ్‌ జాకెట్లు ఎంత మంది ప్రయాణికులు ఉంటే అందరికీ ఇవ్వాలి. వారు వేసుకోవాలి. ముఖ్యంగా పడవ నడిపేవారికి ఆ ప్రాంతంపై క్షుణ్ణంగా అవగాహన ఉండాలి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో వెళ్తే ప్రమాదమో, ఏ ప్రాంతంలో నీటి ఉరవడి ఎక్కువగా ఉంటుందో తెలిసి ఉండాలి. సామర్ధ్యానికి మించి అదనంగా ఒక్కరు కూడా ఎక్కకూడదని అర్ధంకావాలి. అందరూ ఒకపక్కే కూర్చుంటే పడవ ఒరుగు తుందని ముందే ప్రయాణికులకు వివరించాలి. అంటే పడవ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఈ నిబంధనలన్నిటినీ పాటిస్తున్నారో లేదో తరచూ తనిఖీలు చేసే వ్యవస్థ ఉండాలి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న లాంచీలో లైఫ్‌ జాకెట్లన్నీ కట్టగట్టి మూలనపడేశారని బాధితులు చెబుతున్నారు. అసలు లాంచీలకు, పడవలకు ఫిట్‌నెస్‌ ఉందో లేదో.. వాటిని నడుపుతున్నవారికి లైసెన్స్‌ లున్నాయో లేదో చూసే నాథుడే లేకుండాపోయారు. ప్రమాదానికి గురైన బోటుకు అనుమతుల్లేవని చెబుతు న్నారు. అంటే డబ్బులు దండుకోవడానికి వచ్చిన ఒకరిద్దరు వ్యక్తుల ముందు ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం నిస్సహా యమైందనీ.. ప్రయాణికుల ప్రాణాలతో చలగాట మాడు తున్నా చేష్టలుడిగి ఉండి పోయిందని ఒప్పుకున్నట్టు కాదా?
పడవలు, లాంచీల నిర్వాహకులకు వాటి నిర్వహణ, భద్రత విషయంలో తగిన శిక్షణ ఇవ్వడంతోపాటు తనిఖీ సిబ్బందికి సైతం ఆ విషయాల్లో అవగాహన కలిగించాలని ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అలాగే పాత బడినవాటి స్థానంలో కొత్త పడవలు, లాంచీలు సమకూర్చు కోవడానికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కల్పించాలని, అవి నిర్దిష్టమైన డిజైన్‌లకు లోబడి ఉండాలని కూడా ఆ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. పడవల్లో, లాంచీల్లో గ్యాస్‌ సిలెండర్లు, కిరోసిన్‌ స్టౌలు, చమురు దీపాలు తీసుకెళ్లరాదన్న నిబంధన కూడా ఉంది. మర పడవలు, సాధారణ పడవలు పాటించాల్సిన నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలను అమలు చేయాల్సిన బాధ్యత, వాటి అమలు కోసం పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించే కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వాలదే. లంకల్లో, తీరప్రాంతాల్లో నివసిస్తూ రోడ్డు సౌకర్యం లేనివారూ, విహార యాత్రకొచ్చేవారూ పాలకుల అమానవీయ నిర్లక్ష్యం పర్యవసానంగా పెను ప్రమాదాల్లో చిక్కుకుం టున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకెన్నాళ్లు ఈ నిర్లక్ష్యం కొనసాగుతుందో, మరెందరు బలైతే మన ప్రభుత్వాలు మేల్కొంటాయో!