మోదీ మదిలో ‘మందిరం’
ఆర్టికల్ 370 రద్దు తర్వాత అయోధ్య అంశంపై దృష్టి
- రామమందిరం నిర్మాణంపై నోరువిప్పిన ప్రధాని మోదీ..
- -సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దామని పిలుపు
- -పరోక్షంగా అనుకూలంగా వస్తుందని సూచన
- -నవంబర్‌లో తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు
- -బీజేపీ మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణం
- -500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం
- -సొంత పార్టీలో మందిరంపై పెరుగుతున్న ఒత్తిడి
- -ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే మరెప్పటికీ కాదు
- -అదే భావనలో ఉన్న బీజేపీ, శివసేన, ఆర్ఎస్ఎస్
- -అవసరమైతే చట్టం చేసైనా సరే రామ మందిర నిర్మాణం
ప్రధాని నరేంద్రమోదీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కఠోరదీక్ష – దక్షతతో పని చేస్తాడనే పేరుంది. అయితే తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారనే పేరుకూడా ఉంది. తాను నమ్మిన సిద్దాంతం – తాను చేయదలుచుకున్న పనులు ఎన్ని అడ్డంకులు వచ్చినా – ఎవ్వరు అడ్డం చెప్పినా వినకుండా ముందుకు పోవడమే ప్రధాని నరేంద్రమోదీ నైజమట. తన లక్ష్యాలను పూర్తి చేసే సైన్యాన్ని తయారు చేసుకుని కొన్నింటిని చాపకింద నీరులా అమలు చేయడం – మరికొన్నింటిని బహిరంగంగానే తన అనుచరులతో చేత చేయించడంలో మోదీ దిట్ట.
అందుకే నరేంద్రమోదీ ఎప్పుడు ఏమీ చేయాలో.. ఎక్కడ ఏమీ మాట్టాడాలో.. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తర్కించి నిర్ణయాలు తీసుకుంటాడనే ప్రతీతి.
హైదరాబాద్:
ప్రధానిగా దాదాపు ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో టర్మ్ అధికారంలోకి రాగానే తన లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. అందులో కరసేవకులు – ఆర్ ఎస్ ఎస్ చిరకాల స్వప్నం రామమందిరం. ఈ వివాదస్పద రామమందిరం గురించి ఇంతకాలం మౌనంగా ఉన్న ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు నోరు విప్పి సంచలన కామెంట్లు చేశారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దాం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు – మూడు వారాలుగా కొంతమంది.. రామమంది రం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారని అయితే.. మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి అని అన్నారు. దేశ రాజ్యాంగంపైన – న్యాయవ్యవస్థపైనా మనకు విశ్వాసం ఉండాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాసిక్‌లో నిర్వహించిన మహా జనాదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు మోదీ.
రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం.. కశ్మీరీలను ప్రేమతో హత్తుకుందాం.. కశ్మీర్ లోయలో సరికొత్త స్వర్గాన్ని సష్టిద్దాం అంటూ మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో అటు కశ్మీర్ ప్రజలను మెప్పించడం – మరోవైపు మహారాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకోని అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ ఏజెండాను పక్కా అమలు చేస్తామని భరోసా ఇవ్వడం అనే ఎత్తుగడలను ఎన్నుకున్నాడు మోదీ. రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణంపై శివసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన్పటి నుంచే అంటే ఐదేండ్లుగా పదేపదే డిమాండ్ చేస్తోంది.
రామ మందిరం అంశం 1992 నుంచి కొనసాగుతూనే ఉందని.. ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల వ్యాఖ్యానించారు.. కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా.. ఆర్టికల్ 370పై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్టే కేంద్రం రామమందిరంపైనా కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.. అయితే శివసేన పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ.. రెండు మూడు వారాలుగా కొంతమంది.. రామమందిరం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారు.
కానీ మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి. ఎందుకంటే ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ కేసుకు సంబంధించి అన్ని పక్షాలూ కోర్టులో తమతమ వాదనలు వినిపిస్తున్నాయని తెలిపారు. అంటే ప్రధాని నరేంద్రమోదీ రామమందిరం నిర్మాస్తామని అన్యాపదేశంగా చెపుతూనే చట్టాన్ని గౌరవిద్దామని ముక్తా ఇస్తున్నారు. అంటే మోదీ మదిలో రామమందిర నిర్మాణంపై పక్కా క్లారిటీతో ఉన్నారనే అర్థం.
బీజేపీ అన్నది 1980లో పుట్టింది. దానికి పూర్వరూపమైన జనసంఘ్ 1950లలో ఏర్పాటు అయింది. దాని కంటే ముందు 1925 ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సంఘ్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ కి రాజకీయ అంగమే జనసంఘ్. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన నెహ్రూ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆయనకు నెహ్రూ కాశ్మీర్ మీద అవలంబించిన తీరు నచ్చక రాజీనామా చేశారు. ఆ తరువాత కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి వద్దని డిమాండ్ చేస్తూ కాశ్మీర్ వెళ్ళి పోరాటం చేశారు. నాటి పాలకులు ఆయన్ని అక్కడ జైలులో పెట్టి అక్రమంగా నిర్భందించారు. చివరికి ఆయన అనుమానాస్పద స్థితిలో 1853 జూన్ 23న మరణించారు. ఆయన కల కాశ్మీర్ ఇండియాలో కలపడం. అది ఆయన రాజకీయ వారసుడు మోడీ నేరవేర్చారు. ఇక ఆర్ఎస్ఎస్ కల ఒకటి ఉంది. అదేంటి అంటే బీజేపీ దేశాన్ని ఏలాలని, ఆ కల ఇప్పటికి రెండు సార్లు నెరవేరింది. ఇపుడు ఇంకో కల ఉంది. అదేంటి అంటే కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ కనీసంగా యాభై ఏళ్ళ పాటు ఈ దేశాన్ని ఏలాలని. దాని వల్ల కాంగ్రెస్ చేసిన తప్పులన్నీ కడగడంతో పాటు, దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన శక్తి వస్తుందన్నది బీజేపీ ఆలోచన.
కలసివస్తున్న రాజకీయం
దేశంలో ఇపుడు రాజకీయం చూస్తే ఆ దిశగానే బీజేపీకి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ కునారిల్లిపోయింది. ఆ పార్టీకి గాలికి వదిలేశారు. రాహుల్ గాంధీ ఎపుడో రాజీనామా చేశారు. సోనియాగాంధి అనారోగ్యం, వధ్ధాప్యంతో ఉన్నారు. ప్రియాంకాగాంధికి పెద్దగా అవకాశాలు లేవు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పని అయినట్లేనని అంటున్నారు. కాశ్మీర్ విభజన అన్న అంశం చర్చకు వచ్చినపుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పరువు పోగొట్టుకుంది. కాశ్మీరీల పేరుతో ముస్లిం ఓటు బ్యాంక్ కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ చేసిన దివాళాకోరు పాలిటిక్స్ దేశంలోని ఎనభై శాతం పైగా ఉన్న హిందువులకు ఆగ్రహం కలిగిస్తోంది. అది కాంగ్రెస్ గ్రహించలేకపోతోంది. ఇక కాంగ్రెస్ లోని నాయకులే కాశ్మీర్ విభజనకు మద్దతు ఇస్తున్నారంటే ఆ పార్టీ దీనస్థితి అర్ధమ వుతోంది.
కకావికలమేనా
ఇక మిత్రులు సైతం కాంగ్రెస్‌ని వదిలేశారు.అందుకు రాజ్యసభ సాక్ష్యం. అక్కడ మెజారిటీ లేకపోయినా బీజేపీ బిల్లులు చాలా సులువుగా పాస్ అవుతున్నాయి. దశా దిశా లేని కాంగ్రెస్ విధానాలను దేశమంతా ఇపుడు చూస్తోంది. కశ్మీర్ అంశంలొ బీజేపీ ఉచ్చులో చిక్కుకుంది కాంగ్రెస్. కాశ్మీర్ మనదై ఈ దేశంలోని సగటు పౌరుడు అంటున్నారు. అలాంటిది అది అంతార్జాతీయ సమస్య అంటూ కాంగ్రెస్ నిండు పార్లమెంట్ లో అంటున్నపుడే ఇక్కడ జనంతోనూ, వారు వేసే ఓట్లతోనూ బంధం తెంపేసుకుంది. బీజేపీ కాశ్మీర్ మనది, ఇది దేశ అంతర్గత సమస్య అని గట్టిగా చెబుతూ దేశ ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఇక ఈసారి కాంగ్రెస్ ఎన్నికల్లో వచ్చే ఆ సీట్లు కూడా రావన్న విశ్లేషణ కూడా మొదలైంది. అదే సమయంలో బీజేపీ మరిన్ని టెర్మ్‌లు గెలిచేందుకు పావులు వేగంగా కదుపుతోంది. బీజేపీ చేతిలోనే దేశానికి భద్రత అన్న అంశం మీద జరిగిన తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఇపుడు కాశ్మీర్ అంశం సెటిల్ చేసిన బీజేపీ అమ్ముల పొదిల ఉమ్మడి పౌర స్మ్రుతి, రామ మందిరం ఉన్నాయి.ఈ అయిదేళ్ళలో వాటిని కూడా నెరవేర్చేసి బీజేపీ 2024లో మళ్ళీ గెలిచేందుకు రెడీగా ఉంది. కాంగ్రెస్ ఇపుడు జనాల్లో దోషిగా మారుతోంది. ఇదంతా తాను చేసుకున్నదే మరి.
1992లో బాబ్రీ మసీదును ధ్వంసం చేశాక ఆ భూమిని మూడు భాగాలుగా విభజించి పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ, మూడు పక్షాలు… నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్ లీలా విరాజమాన్లు ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. కేసు కోర్టులో ఉన్నప్పటికీ రాజకీయంగా ఈ వివాదం రాజుకుంటూనే ఉంటుంది. దాని వేడి అయోధ్య వాసులతో పోలిస్తే బయటివారికే ఎక్కువగా తగులుతోంది.
చాలామంది రాజకీయ నాయకులకు ఈ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశం ఉండదని, ఒకవేళ దీన్ని పరిష్కరిస్తే వాళ్లు మరో సమస్యను వెతుక్కోవాల్సి వస్తుందని సీనియర్ పాత్రికేయులు మహేంద్ర త్రిపాఠీ చెప్పారు. అయోధ్య ఓ ధార్మిక నగరం కాబట్టి అక్కడ తరచూ వాతావరణం వేడెక్కడం సహజమని విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి శరద్ శర్మ చెప్పారు. కానీ, ‘ఎన్నికల సమయంలోనే అలా ఎందుకు జరుగుతుంది?’ అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.
మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, సుప్రీం కోర్టు తీర్పు లేదా ప్రభుత్వం ‘నిర్ణయాత్మక ముందడుగు’ వేసేదాకా ఎదురుచూస్తామని ఆయన చెప్పారు.