తెలుగులో గూగుల్ అసిస్టెంట్
9 భారతీయ ప్రాంతీయ భాషలను ఉపయోగించే వెసులుబాటు..
న్యూఢిల్లీ: ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. అందులోనూ ఆండ్రాయిడ్ ఫోన్లే అధికం. అందులో చాలా మంది గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఇదివరకే ఉపయోగించి ఉంటారు. మరికొందరికి తెలిసినా మాతభాషలో అందుబాటులో లేకపోవడంతో వినియోగానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారి కోసమే గూగుల్… ప్రత్యేకంగా బిగ్ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. గూగుల్ అసిస్టెంట్‌ను ఇకపై తెలుగులోనూ వినియోగించే సదుపాయాన్ని కల్పించింది. తెలుగుతో పాటు మొత్తం 9 భారతీయ ప్రాంతీయ భాషలనూ ఉపయోగించే వెసులుబాటును తీసుకొచ్చింది. గురువారం జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఈ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఈ కొత్త సదుపాయంతో గూగుల్ అసిస్టెంట్‌తో పనిచేసే స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు ఇకపై ఆయా భాషల్లో ఇచ్చే ఆదేశాల అనుసారం పనిచేస్తాయి. తెలుగు, హిందీ, గుజారాతీ, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, తమిళ భాషలకు ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ కొత్త సదుపాయం వినియోగించాలంటే గూగుల్ యాప్‌ను ముందు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హిందీతో పాటు ఇతర భాషల్లో గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఓఎస్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. ఇకపై అలా మార్చకుండానే ఈ సదుపాయాన్ని పొందొచ్చు.