అవకాశవాద రాజకీయాలు
కాంగ్రెస్‌పై కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ
న్యూఢిల్లీ: నల్లమల అడవుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే యురేనియం అన్వేషణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో యురేనియం తవ్వకాలపై దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్ సంస్థలు, యురేనియం నిక్షేపాలపై కాంగ్రెస్ ఆవకాశవాద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అణు విద్యుత్ కేంద్రాలకు అనుమతి వచ్చిందన్నారు. యురేనియంపై అన్వేషణ, మైనింగ్ అనుమతి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తుందని.. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. 2016 డిసెంబరు 6వ తేదీన జరిగిన వన్యప్రాణి బోర్డు సమావేశంలో యురేనియం అన్వేషణకు అనిమతిచ్చింది తెరాస ప్రభుత్వమే అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.