హ్యూమన్‌ ట్రాఫికింగ్‌

నగరంలో మూడు కమిషనరేట్ల పరిధుల్లో మానవ అక్రమ రవాణా
  • అక్రమ మానవ రవాణా రాకెట్‌పై ఉక్కుపాదం
  • 18 మందిని అరెస్టు చేసిన నగర పోలీసులు
  • కళాశాలకు వెళ్లిన అమ్మాయిలు మిస్సింగ్‌
  • నిర్మానుష్య ప్రదేశాలే అక్రమార్కులకు టార్గెట్‌
  • ప్రేమ పేరుతో వలవిసిరి వ్యభిచార గృహాలకు సరఫరా
  • కొరవడిన తల్లిదండ్రుల పర్యవేక్షణ
  • నామమాత్రపు శిక్షలతో తప్పించుకుంటున్న నిందితులు
  • తెలంగాణ వ్యాప్తంగా2018లో 300 కేసులు
  • కేవలం హైదరాబాద్‌ నగరంలో 192 కేసులు నమోదు

హైదరాబాద్‌:
మానవ అక్రమ రవాణా.. ఇదో పెద్ద సామాజిక సమస్యలా నేడు మారింది. అత్యంత పకడ్బందీగా ఈ వ్యవహారం నడుస్తోంది. చట్టాలు కఠినంగానే ఉన్నా.. అమలులో అలసత్వం, సమస్య మూలాల్లోకి వెళ్లకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. అయితే మానవ అక్రమ రవాణా సంబంధిత కేసుల్లో నగరం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని కమిషనరేట్ల వారీగా వివరాలు సేకరిస్తే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 2016 నుంచి సేకరించిన గణాంకాల్లో ఈ మూడు కమిషనరేట్ల పరిధుల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండటం గమనార్హం.
ముంబయి, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ మందిని నగరానికి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఇటీవల ఉదంతాల్లో వెలుగులోకి వచ్చాయి. నగర పోలీసులు ఇటీవలే అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి నగరానికి మైనర్‌ను అక్రమ రవాణా చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్‌ చేశారు. వీరిపై ఐపీసీ, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ యాక్ట్‌ (పిటా), పోక్సో చట్టాలలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫారినర్స్‌ చట్టంలోని సెక్షన్‌-14 కింద కూడా కేసును నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో సైబరాబాద్‌ పోలీసులు సైతం అంతర్జాతీయ అక్రమ మానవ రవాణా రాకెట్‌పై ఉక్కుపాదం మోపారు. ఘటనలో సుమారు 18 మందిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులు 2016లో 210 నమోదవ్వగా ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్ల పరిధిలో 178 కేసులు నమోదయ్యాయి. 2017లో రాష్ట్రవ్యాప్తంగా 229 కేసులు నమోదవ్వగా నగరంలో 192 కేసులు నమోదయ్యాయి. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు నమోదవ్వగా నగరంలో 192 కేసులు నమోదయ్యాయి. గత మూడేళ్లలో మూడింట రెండో వంతు కేసులు నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లోనే నమోదయ్యాయి. ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండేందుకు డీజీపీ దిశానిర్దేశం మేరకు సమస్య మూలాలపై పోరాడేందుకు నగర పోలీసులు సమాయత్తమవుతున్నారు.
కళాశాలకు వెళ్లిన అమ్మాయి ఇంటికి రాలేదు… పాఠశాలకు చేరిన అబ్బాయి ఏమయ్యాడో తెలియదు… షాపింగ్‌కు వెళ్లిన ఆమె జాడ కానరాలేదు.. బజారుకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరలేదు.. ఇలా మిస్సయిన వారిలో అత్యధికులు మానవ అక్రమ రవాణా బాధితులుగా మారుతున్నారు. కొందరు ఉద్యోగం, వ్యాపారం, డబ్బు ఆశగా చూపించి అమాయకులైన వారిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా వెళ్తున్న వారిలో మహిళలు, పిల్లలే అ?ధికం. దేశంలో సుమారు 90వేల మంది మహిళలు, బాలలు మానవ అక్రమ రవాణా బాధితులుగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. బాధితులు 25శాతం పెరిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసు కోవచ్చు. జిల్లా నుంచి కూడా ఎంతో మంది ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రధానంగా ఉద్యోగాల పేరుతో గ్రామీణ యువత మోసపోతున్నారు. ఇక మిస్సింగ్‌ అవుతున్న వారి ఆచూకీ కూడా లభ్యం కావడం లేదు. ఇటువంటి బాధితులంతా అక్రమ రవాణా బారిన పడి తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు.
మానవ అక్రమ రవాణా అంటే..
మోసం చేసి.. బెదిరించి బలవంతంగా ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించడం, చట్టవ్యతిరేక పనుల్లో వారిని వినియోగించడం కోసం తరలించడాన్ని మానవ అక్రమ రవాణా అంటారు. అందుకే వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మానవ అక్రమ రవాణాలో ఎక్కువ శాతం మైనర్లే బలవుతున్నారు. ప్రధానంగా ప్రేమ పేరుతో వల విసిరి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేరుగా వ్యభిచార గహాలకు తరలిస్తున్న సంఘటనలు ఉన్నాయి. మరి కొందరు లైంగిక వాంఛ తీర్చుకుని వదిలేస్తున్నారు. ఇటువంటి బాధితులు తిరిగి ఇంటికి రాలేక.. తమను తీసుకెళ్లిన వారిపై న్యాయ పోరాటం చేయలేక పలు రకాల వత్తుల్లో బలవంతంగా కొనసాగుతున్నారు.
కొరవడుతున్న తల్లిదండ్రుల పర్యవేక్షణ
ప్రస్తుత సమాజంలో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడుతోంది. పేదల్లో తగిన అవగాహన లేక పట్టించుకునే పరిస్థితి లేదు. ఉన్నత కుటుంబాలు పిల్లల కోసం తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. మధ్య తరగతిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. ఈ కారణంగానే చాలామంది అక్రమ రవాణా ఉచ్చులో పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటే పిల్లల నడతలో ఏమాత్రం తేడా ఉన్నా చక్కదిద్దేందుకు అవకాశం ఉంటుంది. మానవ అక్రమ రవాణా ప్రధానంగా శ్రమ, లైంగిక, పునరుత్పాదక దోపిడీ, మాదక ద్రవ్యాల రవాణా, యాచక వ త్తుల కోసం జరుగుతున్నట్లు ప్రపంచ స్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా మానవ అక్రమ రవాణా వ్యాపారం భారీగానే జరుగుతుంది. దాని విలువ సుమారు 150 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక తేటతెల్లం చేస్తోంది. మనదేశం, రాష్ట్రంలోనూ అక్రమ రవాణా వ్యవస్థీకతంగా బలంగా ఉన్నా పదుల సంఖ్యలోనూ కేసులు నమోదు కావడంలేదు. శిక్షలు నామమాత్రంగా ఉంటున్నాయి. కఠిన చట్టాలున్నా..అమలు సరిగా లేక సమస్య నెలకొంటోంది. 13 నుంచి 16 ఏళ్ల వయసులో శారీరకంగా వచ్చే మార్పులు ..తగిన అవగాహనలేక, సమాజ పోకడలు తెలియక..సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా బాలికలు ప్రధానంగా ఆకర్షణకు లోనవుతున్నారు. చెడు స్నేహాలు కొందరిని తప్పుదోవ పట్టిస్తున్నాయి.
మూడో వంతు పిల్లలే..
మనవ అక్రమ రవాణాలో మూడో వంతు పిల్లలే ఉన్నారు. ఈ మేరకు 2016 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి డ్రగ్‌స అండ్‌ క్రైమ్‌(యూఎన్‌ఓడీసీ) గ్లోబల్‌ రిపోర్టు విడుదల చేసింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు, బాలికలు లైంగిక బానిసత్వం కోసం పురుషులు, బాలురు గనుల రంగంలో నిర్బంధ కార్మికులుగా అక్రమ రవాణా అవుతున్నారు. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల మంది నిర్బంధ కార్మికులుగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిరంతరం కషి చేసిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు వేర్వేరుగా నిర్వహించిన సర్వేలో ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి బాలికలను ఇతర రాష్ట్రాలకే కాకుండా , అక్కడి నుంచి ఇతర జిల్లాలకు అక్రమంగా ట్రాఫికింగ్‌ చేస్తూ వేశ్య వత్తిలోకి దించుతున్నారని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో వేశ్యవత్తిలో 60 శాతం బాలికలు ఉండగా వారిలో 28 శాతం మంది 14-16 సంవత్సరాల మధ్య, 20 శాతం మంది 16-18 ఏళ్ల మధ్య , 16 శాతం మంది 14 ఏళ్ల లోపు వారు ఈ వ త్తిలోకి ఉన్నారు. అక్రమరవాణాకు గురైన బాధితులు స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఇందుకు కారణమైన వారు మాత్రం చట్టానికి చిక్కకుండా కోట్లకు పడగలెత్తుతున్నారు. తక్కువ శ్రమ ఎక్కువ రాబడి ఉండడంతో కొందరు దీన్ని ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం లాగానే మానవ అక్రమ రవాణా సాగుతుంది. మార్కెట్‌లో సరఫరా, డిమాండ్‌పై ఆధారపడి జరిగే నేరపూరిత పరిశ్రమగా మారింది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా మన రాష్ట్రంలో కూడా కొంత మంది యువతులను బాలికలను అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.
చట్టాలు అమలు చేస్తేనే…
మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఐటీపీఏ(ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షన్‌ యాక్టు)కింద కేసులు నమోదు చేయాలి. కానీ పోలీసులు ఎక్కువగా ఐసీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లు కిందనే కేసులు నమోదు చేస్తున్నారు. ఐటీపీఏ కింద కేసు నమోదు చేస్తే వ్యభిచారం చేస్తూ దొరికిన వారి నుంచి సీఆర్‌పీసీ 164 సెక్షన్‌ కింద తొలుత వాగ్మూలం తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వారిని ఎవరు ఆ ఊబిలోకి దించింది తెలుస్తుంది. కేసు మూలాల్లోకి వెళ్తే వారి జీవితాలను నాశనం చేసిన వాళ్లకు బేడీలు వేసేందుకు.. ఈ తరహా వ్యవహారాలకు అడ్డుకట్ట పడేందుకు వీలవుతుంది. ఈ కేసులను ప్రత్యేకంగా పరిగణించి, విచారణను వేగంగా పూర్తి చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. జాప్యం కారణంగా నిందుతులు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
కఠినంగా నూతన చట్టం
ఐటీపీఏ చట్టం… కేసులు, శిక్షలకే పరిమితమవుతోంది. అన్యాయానికి గురైన వారికి పునరావాసం ఊసులేదు. ఈ నేపథ్యంలో ఇందులో లోటుపాట్లు సరిచేసి నూతన చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోంటోంది. ఇప్పటికే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. మానవ అక్రమ రవాణా(నివారణ, రక్షణ, పునరావాసం) బిల్లు-2018 చట్టం అమలైతే అక్రమ రవాణా బాధితులకు న్యాయం జరగనుంది. అక్రమ రవాణా దారులను, అందుకు కారుకులైనవారిని, ప్రోత్సహించేవారిని శిక్షించేందుకు అవకాశం ఉంటుంది. బాల కార్మిక చట్టం, వెట్టిచాకిరీ, బాల్య వివాహా నిర్మూలన, అసాంఘిక రవాణా నియంత్రణ వంటి ఇతర చట్టాలతో కలిసి ఉన్నందున అన్ని విధాలుగా బాధితులకు మరింత న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది.