‘పాపి’ పరిహారం
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ఆదివారం చోటు చేసుకున్న పడవ ప్రమాదం విషాదకరం. దిగ్భ్రాంతి కలిగిస్తున్న ఈ ఘోర ఉదంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో పర్యాటకులు గల్లంతయ్యారు. సంఘటన జరిగి రోజున్నర గడిచాక కూడా ఎంత మంది బోటులో ప్రయాణిస్తున్నారో కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. అన్నీ ఉజ్జాయింపు లెక్కలే. వాటి ప్రకారం 72 మందికి గాను 27 మంది సురక్షితంగా బయట పడ్డారు. గాలింపు చర్యల్లో 12 మ తదేహాలు బయల్పడ్డాయి. ఇంకా 33 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. నది నీటిపై కట్టిన చమురు తెట్టు ఆధారంగా బోటును గుర్తించామంటున్నారు. సుమారు 300 అడుగుల లోతులో ఉన్న పడవను బయటికి వెలికి తీయడం అసాధ్యమన్నది ప్రాథమిక అంచనా. ప్రమాదం సంభవించాక సర్కారు స్పందించింది. నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఫిషరీస్, ఇరిగేషన్, ఇత్యాది విభాగాలన్నీ సహాయక చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను, వారి కుటుంబాలను ఓదార్చారు. మ తుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా, సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశం, రాష్ట్రం లోని పడవలు, లాంచీలపై నిషేధం విధింపు, అధికారులతో సిఎం, మంత్రుల సమీక్షలు సరేసరి. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని సి.ఎంల వరకు ప్రముఖులెందరో పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతి చెందారు.
పడవ బోల్తా ఉదంతంపై రాజమహేంద్రవరంలో సి.ఎం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ వ్యవస్థల్లో తిష్ట వేసిన అనేక లోపాలు వెలుగు చూశాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఈ లోపాలను ప్రభుత్వాలు గుర్తిస్తూనే ఉంటాయి. తూతూ మంత్రపు ఉపశమన చర్యలు, నామ్‌కేవాస్తే విచారణలు జరుగుతూనే ఉంటాయి. మరొక ప్రమాదం జరిగే వరకు వాటి అమలును పట్టించుకునే నాథుడే ఉండడు. ఎవరు అధికారంలో ఉన్నా ఈ ఆనవాయితీలో మార్పు లేదు. అందుక్కారణం స్పష్టం. ప్రభుత్వాలే అస్మదీయులను వెనకేసుకురావడం, ప్రైవేటు లాభార్జనకు అండదండలు కల్పించడం, వివిధ స్థాయిల్లో మితిమీరిన అవినీతి. అలాంటి ఉద్దేశపూర్వక సర్కారీ నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. నదిలో వరద ఉధ తి అధికంగా ఉన్నప్పుడు పడవల సంచారానికి అనుమతించరాదు. ప్రస్తుతం గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. అలాంటప్పుడు పడవను ఎలా అనుమతించారు? పాపికొండల విహార యాత్ర ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మేంతగా ట్రావెల్ ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. పర్యాటక శాఖ ప్రైవేటు బోటు నిర్వాహకులకు అనుమతులిస్తోంది. బోటు ఫిట్‌నెస్, నదిలో రాకపోకలకు అనుమతులు, సరంగులకు లైసెన్స్‌లు, శిక్షణ, సమాచారం అందించే కంట్రోల్ రూంలు, పడవ బయలుదేరేటప్పుడు సామర్ధ్యం, లైఫ్ జాకెట్లు, ఫైర్ సేఫ్టీ వంటి తనిఖీలు, రేవుల్లో సహాయక బ ందాల ఏర్పాటు వీటన్నింటికీ కాగితాలపై పక్కాగా నిబంధనలున్నాయి. అమలు చేయాల్సిన రెవెన్యూ, పోలీస్, ఫిషరీస్, పోర్టు, ఇరిగేషన్, టూరిజం శాఖలకు, ఆ మొత్తాన్నీ పర్యవేక్షించాల్సిన సర్కారుకు పక్షవాతం వచ్చింది. దాని పర్యవసానమే కచ్చులూరు వంటి దురంతాలు.
ప్రమాద బాధితుల, వారి కుటుంబాల రోదనలకు చలించని వారుండరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి విషాదాలను సైతం రాజకీయాలకు వాడుకోవడం తెలుగు వారికే పట్టిన దుర్గతి. గత టిడిపి సర్కారు అవలంబించిన విధానాలు, ఉత్తర్వుల వల్లనే కచ్చులూరు ఘోరానికి కారణంగా చెబుతున్నారు ఎ.పి. సి.ఎం జగన్, ఈ రాష్ట్ర మంత్రులు. 2017లో కష్ణా జిల్లా పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా ఘటనలో 26 మంది చనిపోయారు. అనంతరం గోదావరిలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. దాంతో అప్పటి సర్కారు త్రిసభ్య కమిటీని వేయగా, బోటింగ్‌పై పలు సిఫారసులు చేస్తూ నివేదిక ఇచ్చింది. నివేదిను టిడిపి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఇచ్చిన జీవో లోప భూయిష్టమంటోంది వైసిపి సర్కారు. అధికారంలోకి వచ్చీ రాగానే పరిపాలనా సంస్కరణలంటూ ఆగమేఘాల మీద అసెంబ్లీలో చట్టాలు చేసిన వైసిపి ప్రభుత్వానికి ఈ జీవోను మార్చడం పెద్ద కష్టమేం కాదు. పట్టించుకోలేదంతే. ఇక తమ రాష్ట్రం వారు బాధితులు కావడంతో వారి సహాయార్ధం ఇక్కడికి వచ్చిన తెలంగాణ మంత్రి యర్రబెల్లి దయాకర్‌రావు సైతం గత సర్కారు జీవోను తప్పుబట్టడం మరీ విడ్డూరం. టిడిపి వారైతే షరామామూలే అన్నట్లు ప్రమాదాన్ని వైసిపి సర్కారు వైఫల్యంగా పేర్కొంటున్నారు. ఆప్తులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు చేయడం కుసంస్కారం అనిపించుకుంటుంది. అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలను కట్టిబెట్టి సహాయ చర్యలపై దష్టి సారించాలి. ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టాలి. ఇలాంటివి పునరావ తం కాకుండా చిత్తశుద్ధితో పటిష్ట చర్యలు తీసుకోవాలి.