డాలర్‌ దడేల్‌…రూపాయి ఢమాల్‌

మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. డాలర్‌ దెబ్బకి భారత్‌ రూపాయి గింగిరాలు తిరుగుతున్నది. గత ఆగస్టు నెలలోనే 3.65 శాతం కోతకు గురై అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక డాలర్‌కు మన రూపాయి విలువ 73 రూపాయిలకి చేరింది. ఆసియా దేశాల కరెన్సీలన్నింటికన్నా మన రూపాయి విలువ అధమ స్థితికి నెట్టబడింది. 2023 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందో లేదో చెప్పలేం కానీ డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం 100 రూపాయలకి చేరుతుందనేది బలంగా చెప్పొచ్చు.
అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచడంతో ఇండియాకి వచ్చిన డాలర్లు తిరిగి వెనక్కి పోతున్నాయి. ముడిచమురు ధరలు పెరగటం, ఎగుమతులు పెరగక పోవడం రెండో వైపు దిగుమతులు భారీగా పెరగడంతో విదేశీ వాణిజ్య లోటు పెరుగుతున్నది. ఇది కరెంట్‌ ఎకౌంట్‌ లోటు పెరగటానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగి పోవటానికి దారి తీస్తున్నది. ఇవి మన రూపాయి పతనానికి కారణమవుతున్నాయి.
రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై అనేక రకాలుగా ప్రభావం చూపుతున్నది. భారత విదేశీ వాణిజ్య లోటు పెరుగుతున్నది. 2016-17లో 108 బిలియన్‌ డాలర్లు, 2017-18లో 156 బిలియన్‌ డాలర్లకు, 2018-19లో ఈ లోటు 176 బిలియన్‌ డాలర్లకు చేరింది. రూపాయి బలహీన పడే కొద్ది వాణిజ్య లోటు కూడా పెరుగుతూ ఉంటుంది. వాణిజ్య లోటు పెరుగుదల దేశ కరెంట్‌ ఎకౌంట్‌ లోటు పెరుగుదలకు దారితీస్తున్నది. ఈ లోటు పెరిగేకొద్దీ విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోయి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 1991లో భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. ఆనాడు విదేశీ మారక ద్రవ్య సంక్షోభం నెలకొనడంతో మన దేశ బంగారాన్ని ఐఎంఎఫ్‌ వద్ద తాకట్టు పెట్టి భారత ప్రభుత్వం అవసరమైన డాలర్లు పొందింది. ఆ సందర్భంగా మన రూపాయి విలువను తగ్గించాలని ఐఎంఎఫ్‌ షరతు విధించింది. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం అంగీకరించి రూపాయి విలువను 20 శాతం కోత విధించటంతో పాటు ప్రపంచీకరణ విధానాలు అమలు చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశీ సార్వభౌమత్వ బాండ్ల ద్వారా విదేశాల నుండి అప్పులు తీసుకోవాలని బడ్జెట్‌లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వ విదేశీ అప్పు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న విదేశీ అప్పులు, వడ్డీలు మరింతగా పెరుగుతాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల నుండే ఈ అప్పులు చెల్లించాల్సి వుంటుంది. ఈ చర్య విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరింత తరిగిపోవడానికి దారి తీస్తుంది. రూపాయి పతనం మరి కొన్నింటిపై కూడా ప్రభావం చూపుతుంది. మన దేశస్తులు విదేశాలలో చదువుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి, విదేశాలలో పర్యటించడానికి వెళ్తారు. ఇటువంటి వారు గత కొన్నేళ్లలో బాగా పెరిగారు. వీరందరికీ డాలర్లు తప్పనిసరి. వీరందరిపై భారం పడుతుంది.
దేశ ఆర్థిక అభివ ద్ధిలో కరెన్సీ మారకం విలువ చాలా ముఖ్యమైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం రూపాయి బలహీన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు రూపాయి స్థిరీకరణపై పసలేని వాదనలు చేస్తున్నది. ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అంటున్నారు. రూపాయి పడిపోయినా దానికి అదే సమతౌల్య స్థితికి చేరుతుందని వాదిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. రూపాయి పతనాన్ని నివారించటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థలో విదేశీ మధుపరుల అంచనాలు మరింత సన్నగిల్లి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్తారు. ఇది తిరిగి రూపాయి క్షీణతకు దారి తీస్తుంది. కనుక ఎప్పటికీ ప్రభుత్వ జోక్యం లేకుండా రూపాయి తనకు తాను స్థిరీకరించుకోవడం గాని లేదా సమతౌల్య స్థితికి చేరుకోవటం గాని జరగదు.
డాలరుతో రూపాయి మారక చరిత్ర మొత్తం చూసినా మనకు ఇదే అర్థమౌతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు డాలరు రూపాయి మారకం చూస్తే ఒక రూపాయికి ఒక డాలరు మారకంగా ఉండేది. 1966 వచ్చే సరికి ప్రభుత్వమే రూపాయి విలువను కోతపెట్టి 7.10 రూపాయలకి చేర్చింది. 1980కి రూ.7.89, 1990కి రూ.17.50కి చేరింది. అప్పుడు మన దేశం విదేశీ మారకద్రవ్య నిల్వల సంక్షోభంలో పడిపోవడంతో తిరిగి రూపాయి విలువను ప్రభుత్వం తగ్గించింది. ఫలితంగా 1991కి రూపాయి విలువ రూ.20కి పడిపోయింది. ఆ తరువాత భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించడం, అంతర్జాతీయ పెట్టుబడులకు పచ్చ జెండా ఊపడం, ప్రభుత్వ నిబంధనలను ఉపసంహరించుకోవడంతో డాలర్‌తో రూపాయి విలువ పతన పరంపర కొనసాగుతున్నది. 2000లో రూ.45కి పడిపోయింది. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014కి రూ.61కి చేరింది. ఇది ఇప్పుడు రూ.73కి క్షీణించింది.
రూపాయి స్థిరీకరణకు మరికొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. దేశీయ ఎగుమతులను పెంచటం ద్వారా ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే చర్యలు చేపట్టాలి. ఇది వాణిజ్య లోటు, కరెంట్‌ ఎకౌంట్‌ లోటును తగ్గిస్తుంది. ఫలితంగా రూపాయి బలహీనపడటం తగ్గుతుంది. నేడు ప్రభుత్వ విధానాలు దేశ ఎగుమతుల పెంపుదలకు దోహదం చేసేలా లేవు. అంతర్జాతీయ వాణిజ్యంలో మన దేశ వాటా చాలా నామమాత్రం. కేవలం 2.1 శాతం మాత్రమే. ప్రపంచ ఎగుమతులలో మన దేశ ఎగుమతులు కూడా కేవలం 1.70 శాతానికే పరిమితం. అదే చైనా ఎగుమతుల వాటా 20 శాతంగా ఉంది. నేడు మన దేశ ఎగుమతులు పెరగటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎగుమతులు పెంచే చర్యలు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఎగుమతులకు ఉపయోగపడే శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించాలి. దీని ద్వారా నాణ్యతతో కూడిన చవకైన వస్తువులను ఎగుమతి చెయ్యొచ్చు. దీనివల్ల ఎగుమతులు పెరిగి విదేశీ వాణిజ్యంలో మిగులు ఏర్పడుతుంది. ఈ చర్యలు ప్రభుత్వం తీసుకుంటే రూపాయి పతనాన్ని అరికట్టటం సాధ్యమవుతుంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టాలి. నేడు దిగుమతులు మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. మోడీ అధికారం చేపట్టిన తరువాత ఇవి బాగా పెరిగాయి. గడిచిన మూడేళ్ళలో దిగుమతులు మూడు రెట్లు పెరిగాయి. వాస్తవంగా మోడీ పరిపాలనా కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బాగా తగ్గటంతో మనదేశ దిగుమతుల బిల్లులో ముడిచమురు బిల్లు బాగా తగ్గింది. కానీ ముడిచమురేతర దిగుమతులు ఎక్కువగా పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం జరుగుతున్నది. వీటిల్లో బంగారం, సంపన్నులు వాడే విలాస వస్తువులు, కార్లు, గ హోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇలా అనేకమైన అనవసర సరుకులు వున్నాయి. ఇవి విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలను హరిస్తున్నాయి. విదేశీ వాణిజ్య లోటుని పెంచుతున్నాయి. ఇంతేకాక మన దేశీయ పరిశ్రమలను నాశనం చేస్తూ పారిశ్రామికీకరణను బలహీన పరుస్తున్నాయి. ఇవన్నీ మన రూపాయి విలువని డాలర్‌తో బలహీన పరుస్తున్నాయి. నేడు అంతర్జాతీయ ప్రభావం కన్నా దేశీయంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న ఆర్థిక, ద్రవ్య, రాజకీయ విధానాలే రూపాయి పతనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనిని అరికట్టాలంటే అనవసర దిగుమతులను నియంత్రించాలి లేదా భారీగా సుంకాలు వేయాలి. అలాగే దిగుమతులపై ఆధారపడకుండా మన దేశ పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తుల అభివ ద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, సామాజికంగా దేశాన్ని బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రమే రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో బలమైనదిగా స్థిరీకరించడం సాధ్యమౌతుంది.