పెట్రోల్‌, డీజిల్‌ పైపైకి

రికార్డు స్థాయిలో ఎగసిపడ్డ ముడిచమురు ధరలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం.. దేశీయ పెట్రోలియం ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరుసగా రెండోరోజు దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 25 పైసలు, డీజిల్‌ ధర 24 పైసలు పెరిగింది. బడ్జెట్‌ తర్వాత ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 72.42, డీజిల్‌ ధర రూ. 65.82కు చేరింది. ఇక పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 78.10, చెన్నైలో రూ. 75.26, కోల్‌కతాలో రూ. 75.14గా ఉండగా.. డీజిల్‌ ధర ముంబయిలో రూ. 69.04, చెన్నైలో రూ. 69.57, కోల్‌కతాలో రూ. 68.23గా ఉంది.
సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో ఎగసిపడ్డాయి. సోమవారం ఒక్కరోజే ధర దాదాపు 20శాతం పెరిగింది. ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. దీంతో దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. తాజాగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు భగ్గుమన్నాయి.