మాతృభాషపై మమకారమేది?

విదేశీయ భాషలు మన మాతభాషలను దిగమింగి వేయకుండా నిరోధించడానికి వీలుగా ఒక ‘జాతీయ అనుసంధాన భాష’ను రూపొందించుకోవాలని దేశ వ్యవహారాల మంత్రి అమిత్‌ షా హితవు చెప్పడం విచిత్రమైన పరిణామం. ఆంగ్లం మొత్తం భారతీయ భాషల స్వరూపాన్ని ఇదివరకే దిగమింగి ఉంది, జాతీయ స్వభావాన్ని దశాబ్ధాల క్రితమే చెరిచివేసింది. ఇది మొదటి వైపరీత్యం. మొత్తం దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వానికి అధికార భాషగా హిందీని నిర్ధారించి ఏడు దశాబ్దులయింది. రాజ్యాంగంలోని మూడువందల నలబయి మూడవ అధికరణం మేరకు హిందీ అధికార భాష. దేశంలోని ఉన్నత విద్యావంతులందరికీ ఈపాటికి హిందీ భాష వచ్చి ఉండాలి. కానీ రాలేదు. ఇది రెండవ వైపరీత్యం. మొదటి వైపరీత్యానికి విరుగుడుగా ‘ఆంగ్ల భాష దిగమింగిన భారతీయ భాషలను పునరుజ్జీవింపచేసుకోవాలన్నది’ అమిత్‌ షా వంటి వారు ఇవ్వదగిన పిలుపు. విదేశీయ ఆంగ్ల భాషా గ్రహణగ్రస్తమై ఉన్న భారతీయ భాషలను గ్రహణముక్తం చేయడం వౌలిక అనివార్యం. క్రియా పదాలు తప్ప మిగిలిన పదజాలం ఆంగ్లమైపోయి ఉండడం తెలుగు భాషకు దాపురించిన గ్రహణం. ‘మమీ కిచెన్‌లో బిజీగా ఉంది..’ ‘కాల్‌ చేస్తాను..’ ‘షేర్‌ చేస్తాను..’ ‘పంక్చుయాలిటీ మెయిన్‌టైన్‌ చేయండి..’- ఇదీ తెలుగు! అన్ని భారతీయ భాషలూ దాదాపు ఇదే దుస్థితికి గురి అయి ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నిర్వాహక ప్రముఖులలో ఒకరైన అమిత్‌ షా వంటివారు చేయవలసింది తక్షణం రాజ్యాంగాన్ని సవరించడం. పూర్వ శిశు-ఎల్‌కెజి- శిశు- యుకెజి- స్థాయి నుంచి ఏడవ తరగతి వరకు దేశవ్యాప్తంగా అన్నిరకాల పాఠశాలలలోను విద్యాబోధన తప్పనిసరిగా ప్రాంతీయ మాత భాషలలో జరగాలని నిర్దేశిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలి! దాదాపు అన్ని ప్రాంతాల అన్ని రాజకీయ పక్షాలవారు మాతభాషలను పరిరక్షించాలన్న నిష్ఠను ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగ సవరణ ‘బిల్లు’ను రూపొందించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినట్టయితే ఎవ్వరూ బహుశా దాన్ని వ్యతిరేకించరు. హిందీని, ఇతర భారతీయ భాషలను దిగమింగుతున్న ఆంగ్లభాషా ఆధిపత్యాన్ని తొలగించుకోవడం ‘జాతీయ అధికార భాషా వికాసక్రమం’లో మొదటి మెట్టు. ఏడవ తరగతి వరకు మాత భాషా మాధ్యమ బోధనను పొందిన వారు మాతభాషలను మరచిపోలేరు. స్వదేశీయ విదేశీయ భాషలన్నీ సరస్వతీ రూపాలే. ఆంగ్లభాషను ఒక భాషగా ఆరవ తరగతి నుంచి అభ్యసించడానికి వీలుకల్పించవచ్చు. కానీ ఆంగ్ల మాధ్యమ బోధన నుంచి భారతీయ విద్యావిధానం విముక్తం కావాలి! విద్యాభ్యాసం పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి స్థిరపడదలచినవారు ‘అమెరికా యాస’తో ‘బరగొంతుల’తో ఆంగ్ల భాషను ప్రత్యేకంగా అభ్యసించవచ్చు! శిశువులకు ”బాబా బ్లాక్‌షీప్‌” అన్న ”రెయిమ్‌”లనుకాక ”చందమామ రావె” ”చందన్‌ హై ఇస్‌ దేస్‌కీ మాటీ”వంటి భారతీయ పదాలను నేర్పించాలని కేవలం ప్రబోధించకండి. రాజ్యాంగాన్ని సవరించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాలయాలలో భారతీయ మాతభాషలలో బోధించడాన్ని నియమంగా మార్చండి! ఎవరూ వ్యతిరేకించడానికి సాహసించని ఈ స్వదేశ భాషా పరిరక్షణకు అమిత్‌షా ఎందుకు వెంటనే నడుం బిగించరాదు? ఏడవ తరగతి వరకు బోధనామాధ్యమం తెలుగు కావాలి, ఆయా ప్రాంతాలలో తమిళం కావాలి, కన్నడం కావాలి, మరాఠీ కావాలి, హిందీ కావాలి, కశ్మీరీ భాష కావాలి!! 
రాజ్యాంగంలోని మూడువందల యాబయ్యవ అధికరణంలోని ‘బి’ ఉప అధికరణం ప్రకారం ప్రతి ప్రాంతంలోను ఆ ప్రాంతంలోని ‘అల్పసంఖ్య’ భాషా జన సముదాయం వారి భాషను ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించాలన్నది నియమం. కానీ ప్రతిప్రాంతంలోని ‘అధిక సంఖ్య’ ప్రజలు మాట్లాడే భాషను ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించి తీరాలన్న రాజ్యాంగ నియమం ఇంతవరకు లేదు, అందువల్లనే ప్రాథమిక స్థాయినుంచి ప్రాంతీయ మాత భాషలో బోధన జరగాలన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు న్యాయస్థానాలలో అవరోధాలు ఎదురయ్యాయి. ఇప్పుడైనా కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే సమస్య ‘గోటి’తో తీరిపోతుంది. హిందీని అధికార భాషగాను, అనుసంధాన భాషగాను రాజ్యాంగంలో గుర్తించారు. కానీ అలా గుర్తించిన అధికరణాలలోనే ‘ఆంగ్లభాష అవసరమైనన్ని రోజులు’ అదనపు అధికార భాషగాను, అనుసంధాన భాషగాను కొనసాగవచ్చునని నిర్దేశించారు. ‘అదనపు భాష’ ప్రధాన ‘అధికార భాష’గా నెత్తికెక్కి తొక్కుతోంది. అధికార భాషను పాఠశాలలలో విధిగా చదివించినంతకాలం హిందీ జాతీయ భాషా కాజాలదు. పాఠశాలలలో కళాశాలలలో ”రెండవ”లేదా ‘అదనపు’అధికార భాష అయిన ఆంగ్లాన్ని విధిగా చదివిస్తున్నారు. హిందీకి ఆ ప్రతిపత్తి లేదు. ‘ఇంగ్లీషు’ను కళాశాలలో ఎనిమిది గంటలపాటు బోధిస్తున్నారు. హిందీకి కేవలం నాలుగు గంటలు మాత్రం కేటాయిస్తున్నారు. పైగా హిందీని కాని ఇతర భారతీయ భాషలను కాని ‘ఐచ్ఛికం’గా మాత్రమే కళాశాలలలో చదివిస్తున్నారు, ఇంగ్లీషును విధిగా చదివించినట్టు హిందీని కాని ఇతర భారతీయ భాషలను కాని కళాశాలలలో చదివించడం లేదు.