బస్సెప్పుడు సారూ!?

మారుమూల ప్రాంతాలకు రోడ్లున్నా బస్సు సర్వీసులు సున్నా 
  • బస్సు సౌకర్యం లేని గ్రామాలు 840 
  • పెండింగ్‌లోనే 2000 దరఖాస్తులు 
  • నాలుగేళ్లుగా నిలిచిన రూట్‌ సర్వేలు 
  • డిపో అడ్వయిజరీ కమిటీలు ఏవీ? 
  • కనుమరుగవుతున్న ‘పల్లె వెలుగు’ బస్సులు 
  • 97 ఆర్టీసీ డిపోలలో 60కి పైగా వినతులు 
  • ఉన్న బస్సులు సరిపోవడం లేదంటున్న అధికారులు 
  • మరో పక్క నష్టాలతో కుదేలవుతున్న టీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్‌: 
రోడ్డున్న ప్రతి గ్రామానికీ బస్సు’ అనేది ఒకప్పటి ఆర్‌టిసి నినాదం. కానీ నేడు బస్సులు తిరిగని గ్రామాలు ప్రతి మండలంలోనూ అధిక సంఖ్యలోనే దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో తిరిగే పల్లె వెలుగు సర్సీసులను ప్రధాన రహదారులకు మళ్లించి, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు పేరిట రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగు సర్వీసులు కనుమరుగవుతున్నాయి. వాస్తవానికి గత పదేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో రోజురోజుకూ సిబ్బంది తగ్గిపోతున్నారు. సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ‘సింగిల్‌ క్రూ డ్యూటీ’లను అమల్లోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డ్యూటీలు కుదరదు కాబట్టి, బస్సులను ప్రధాన రహదారులపైకి మళ్లించి, జనం నుంచి ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రజలు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. 
పరిగి నుంచి కడుమూరు, తాళ్లపల్లి మీదుగా హైదరాబాద్‌కు బస్సు నడపాలని కడుమూరు, తాళ్లపల్లి గ్రామాల ప్రజలు ఏటా కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సిఫారసు లేఖలు ఇచ్చారు. అయినా… ఆర్టీసీ కొత్త బస్సు వేయట్లేదు. షాద్‌నగర్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపూర్‌కు, 25 కిలోమీటర్ల దూరంలోని చేవూరుకు బస్సుల కోసం స్థానికులు కోరుతూ వస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఉంటుందని, ప్రైవేటు వాహనాలు నవడకుండా చూస్తామని కూడా వారు చెబుతున్నారు. కానీ.. కొత్త బస్సులు లేవని, ఉన్న బస్సులు సరిపోవడం లేదని అధికారులు దాటవేస్తున్నారు. నిర్మల్‌ నుంచి స్వర్ణ వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడిచేది. ఇప్పుడు రోజంతా ఐదు ట్రిప్పులకు మించి నడవట్లేదు. నిజంగా నిర్మల్‌ డిపోకు ఇది పెద్దమొత్తంలో ఆదాయం తెచ్చే రూటు. కానీ ప్రైవేటు ఆపరేటర్ల కారణంగా బస్సుల సంఖ్యను దారుణంగా తగ్గించారు. ఆర్టీసీ బస్సులను నడిపితే… ప్రైవేటు వాహనాలను ఆశ్రయించబోమని చెబుతున్నా ఆర్టీసీ ట్రిప్పులను మాత్రం పెంచట్లేదు. 
..ఇదీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎసఆర్టీసీ) తీరు! ‘మా గ్రామాలకు బస్సులు వేయండి మహాప్రభో’ అని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోవట్లేదు. కొత్త బస్సులు లేవని, ఉన్న బస్సులను దారి మళ్లించలేమని చేతులెత్తేస్తోంది. తమ గ్రామాలకు బస్సులు వేయాలంటూ రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోలలో 60కి పైగా గ్రామీణ ప్రాంత డిపోలకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 2000 దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క గ్రామానికి కొత్తగా బస్సు వేయలేదు. పాత రూట్లలో బంద్‌ చేసిన బస్సులను పునరుద్ధరించలేదు. కొన్ని రూట్లలో ట్రిప్పులను తగ్గిస్తున్నారు. అదేమంటే… తమ వద్ద బస్సులు లేవని అధికారులు చెబుతున్నారు. 
అసలేం చేయాలి..? 
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. టీఎసఆర్టీసీ తెలంగాణలోని పల్లె పల్లెకూ బస్సును నడపాలని సంకల్పించింది. బస్సు సౌకర్యం లేని గ్రామాలపై సర్వే చేసింది. రాష్ట్రంలో ఎలాంటి బస్సు సౌకర్యం లేని(అన్‌-కనెక్టెడ్‌) గ్రామాలు 910 ఉన్నట్లు తేల్చింది. వీటికి బస్సులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతూనే ఉన్నారు. వీటితో పాటు ఇదివరకు బస్సులు నడిచి రద్దయిన రూట్లలోనూ బస్సులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. అయినా ఆర్టీసీ పట్టించుకోవట్లేదు. అష్టకష్టాలు పడి 2015లో మాత్రం 70 కొత్త రూట్లలో బస్సులను ప్రారంభించింది. మిగతా 840 రూట్లలో ఒక్క రూటులోనూ నాలుగేళ్లుగా బస్సు సర్వీసును ప్రారంభించలేదు. 

కమిటీలు ఏవీ? 
బస్సులను నడపడానికి కొత్త రూట్లను ఎంపిక చేయడం, పాత రూట్లలో బస్సుల పునరుద్ధరణ, ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు బస్సుల పొడిగింపు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, నివేదికలు ఇవ్వడానికి ప్రతి డిపో స్థాయిలో ‘డిపో అడ్వయిజరీ కమిటీ’లు ఉండాలి. డిపో మేనేజర్‌ ఆధ్వర్యంలో ఉండే ఈ కమిటీల్లో డిపోలోని ఒక సూపర్‌వైజర్‌, గుర్తింపు కార్మిక యూనియన్‌ నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కానీ… ఏ డిపోలో కూడా ఈ కమిటీలు ఉనికిలో లేవు. రూట్‌ సర్వేల మాట లేదు. కొత్త రూట్ల ఊసే లేకపోవడంతో… కమిటీలను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా కొత్త రూట్ల అధ్యయనం అటకెక్కినట్లయింది. 
రోజు పని భారం పెరగడంతో డ్యూటీలు చేయలేక అలిసిపోతున్నారు ఆర్టీసీ సిబ్బంది. డ్యూటీ చేస్తున్న సమయంలోనే కొంతమంది మ తి చెందుతున్నారు. ఆర్టీసీలో 7 వేల మందికి పైగా రిటైరయ్యారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో మిగిలిన కార్మికులపై పనిభారం పడుతోందని ఆర్టీసీ కార్మిక యూనియన్‌ నాయకులు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు పడుతున్న కష్టాలు అదనపు పనిభారంపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. 
ప్రయాణికుల డిమాండ్‌ ఉన్నా ఆర్టీసీ అన్ని ప్రాంతాల.కూ సర్వీసులను నడపలేక చేతులెత్తేస్తోంది. ఒకవైపు ప్రయాణికులను కష్టాలపాలు చేస్తూ.. మరోవైపు నష్టాలను మూటగట్టుకుంటోంది. గ్రేటర్‌లో 3,818 బస్సులుండగా రోజూ సుమారు 3,657 బస్సులు రోడ్లపైకి వస్తున్నాయి. అవి 45 వేల ట్రిప్పుల్లో 10.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 33లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వాస్తవానికి గ్రేటర్‌లో ప్రయాణ అవసరాలకు కనీసం ఏడు వేలకు పైగా బస్సులు కావాల్సి ఉన్నాయి. అందులో సగం బస్సులనే గ్రేటర్‌ ఆర్టీసీ నడుపుతోంది. ప్రైవేట్‌ వాహనాల సంఖ్య నగరంలో గణనీయంగా పెరిగేందుకు ఆర్టీసీయే కారణమవుతోందని రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగుళూర్‌లో కోటి జనాభాకు 7,500 పైగా బస్సులను నడుపుతున్నారు. అదే తరహాలో గ్రేటర్‌లో మరో 2 వేలకు పైగా కొత్త బస్సులు తీసుకొస్తే రోడ్లపై ప్రైవేట్‌ వాహనాల రద్దీ కొంత తగ్గే అవకాశముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలకు బస్సులు సరిగా లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. 
ప్రయాణికుల పాట్లు 
నగరం శరవేగంగా విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొత్తకాలనీలు, బస్తీలు పుట్టుకొస్తున్నాయి. కానీ గ్రేటర్‌ ఆర్టీసీ పరిధిని అధికారులు విస్తరించలేకపోతున్నారు. మెట్రో ప్రారంభం తర్వాత పలు రూట్లలో ఆర్టీసీ బస్సుల డిమాండ్‌ తగ్గుతుందని గతంలో భావించినా ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఎల్‌బీనగర్‌ – మియాపూర్‌, నాగోల్‌-హైటెక్‌సిటీ మెట్రో కారిడార్‌ ప్రాంతాల్లో మెట్రోరైళ్లు పరుగులు తీస్తున్నా ఆయా రూట్లలో నడుపుతున్న ఆర్టీసీ సర్వీసులపై పెద్దగా ప్రభావం పడలేదని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ రూట్లలో బస్సులు నడిపితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఆ దిశగా అధికారులు ద ష్టిసారించకనే సంస్థకు నష్టాలు స్తున్నాయని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. 
ముందు చూపేది? 
ప్రజారవాణా వ్యవస్థ అభివ ద్ధిపై ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ”రద్దీ సమయాల్లో ప్రజారవాణా అందుబాటులో లేక ప్రజలు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పలు రూట్లలో ప్రయాణికులు ఉన్నా లేకున్నా బస్సులను నడపాలి. ప్రతి 5, 10 నిమిషాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సులు నడిపితే ప్రైవేటు వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే అవకాశాలుంటాయి” అని ప్రజా రవాణా నిపుణులు ప్రొఫెసర్‌ రామచంద్రయ్య అన్నారు