చందమామ..అందిన రోజు

చంద్రుడిపై కాలుమోపనున్న ‘చంద్రయాన్‌-2’
  • ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న చంద్రోదయం
  • అంతా అనుకున్నట్టే జరుగుతోంది: ఇస్రో ఛైర్మన్‌
  • నెలవంకను అందుకునే ఉత్కంఠ సమయం ఆసన్నం
  • భారత అంతరిక్ష రంగ చరిత్రలో కొత్త అధ్యాయం
  • చందమామపై అడుగు పెట్టే ఆ 15 నిమిషాలు కీలకం
  • విద్యార్థులతో కలిసి వీక్షించనున్న ప్రధాని మోదీ

బెంగళూరు: కోట్ల మంది భారతీయుల దూతగా వ్యోమనౌక ‘చంద్రయాన్‌-2’ మరికొన్ని గంటల్లో గగన వీధిలో చందమామపై కాలుమోపనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌ 2లోని ‘విక్రమ్‌’ల్యాండర్‌ కదలికలపై ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ స్పందించారు. అంతా తాము అనుకున్నట్టుగానే జరుగుతోందని అన్నారు. నెల వంకను అందే అపూర్వమైన చారిత్రక ఆవిష్కరణ కోసం తామెంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఇదో అత్యంత కీలకమైన రోజుగా ఆయన అభివర్ణించారు.
అయితే, చందమామపై అడుగు పెట్టేందుకు ఆఖరు 15 నిమిషాలు ఎంతో క్లిష్టమైనవని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రయాణం ఒక ఎత్తైతే.. ఆ చివరి 15 నిమిషాలు చాలా చాలా సంక్లిష్టతతో కూడుకున్నదన్నారు. అప్పుడే పుట్టిన శిశువును అకస్మాత్తుగా మన చేతుల్లో పెడితే ఏ సాయం లేకుండా మనం పట్టుకోలేం. ఎటు కదులుతుందో తెలియక చాలా ఆందోళన పడతాం. అలాగే.. చంద్రయాన్‌ 2 కూడా చందమామపైకి ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఈ మనోహరమైన ఘట్టాన్ని దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లోనూ వీక్షించవచ్చని ఇస్రో అధికారులు వెల్లడించారు.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 2లోని విక్రమ్‌ ల్యాండర్‌ శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 – 2.30గంటల మధ్య జాబిల్లి ఉపరితలంపై అడుగు పెట్టనుంది. ఈ వ్యోమ నౌక చెప్పబోయే కొత్త సంగతుల కోసం భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జులై 22న శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే జాబిల్లిపై వ్యోమనౌకను సురక్షితంగా దించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను దించిన తొలి దేశంగా మనం ఘనతి సాధించనున్నాం.
అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణాక్షరాలు లిఖించే క్షణాలు మరికొన్ని గంటల్లో ఆవిష్క తం కానున్నాయి. ప్రతి భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. మన వ్యోమనౌక ‘చంద్రయాన్‌-2’ మరికొన్ని గంటల్లో జాబిల్లిపై కాలుమోపబోతోంది. అందులో నుంచి ఓ బుల్లి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై అటూఇటూ కలియతిరగనుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ‘చంద్రయాన్‌- 2 దక్షిణ ధ్రువంపై దిగుతున్న ప్రత్యేక క్షణాలు చూడాలని మీ అందరిని కోరుతున్నాను!. ఇందుకు సంబంధించిన మీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయండి. వాటిలో కొన్నింటిని నేను రీట్వీట్‌ చేస్తాను.’ అంటూ ట్విటర్‌ ద్వారా కోరారు.
విద్యార్థులతో కలిసి వీక్షించనున్న ప్రధాని
‘చంద్రయాన్‌-2’ జాబిల్లిపై దిగే ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 60-70 మంది విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ల్యాండింగ్‌ ప్రక్రియను మనం కూడా చూడొచ్చు. ఇస్రో ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోని శాటిలైట్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఎస్‌సీసీ) నుంచి క్షణ క్షణం సమాచారాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తారు. యూట్యూబ్‌లో ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా ఛానల్‌ ద్వారా కూడా చూడొచ్చు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌లో నాసా వ్యోమగామి జెర్రీ లినెంగర్‌ అనుభవాలతో ‘చంద్రయాన్‌-2’పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
విక్రమ్‌ సాఫీగా దిగడంలో ఒక్కొక్కటి 800 న్యూటన్‌ సామర్థ్యమున్న ఐదు థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. సంక్లిష్టమైన ఈ యంత్రాలను భారత్‌లో తయారుచేయడం ఇదే మొదటిసారి. ఇవి సమన్వయంతో, నియంత్రిత పద్ధతిలో ప్రజ్వరిలిల్లుతూ ల్యాండర్‌ను కిందకు దించుతాయి. ల్యాండర్‌లోని నేవిగేషన్‌, గైడెన్స్‌, కంట్రోల్స్‌, చోదక, సెన్సర్లు, ఇతర సాధనాలతోనూ సమన్వయం చేసుకుంటాయి. ద క్కోణం, ఎత్తు, వేగం వంటి అంశాలపై అందే డేటా ఆధారంగా ఇవి తమ పనితీరును సర్దుబాటు చేసుకుంటాయి. నియంత్రణ కోసం 50 న్యూటన్‌ సామర్థ్యమున్న ఎనిమిది నియంత్రణ థ్రస్టర్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వ్యోమనౌకను పైకి, కిందకి, పక్కకు అవి తరలించగలవు.
కిందకు దిగే దశలో ల్యాండర్‌కు ఇనర్షియల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ మార్గనిర్దేశం చేస్తుంది. ఇందులో ఏమైనా వైరుద్ధ్యాలు తలెత్తితే సరిచేయడానికి ఆప్టికల్‌ సెన్సర్లు ఉన్నాయి. ల్యాండింగ్‌ సమయంలో ఆర్బిటర్‌, ల్యాండర్‌లోని కెమెరాలు ఎప్పటికప్పుడు ద శ్యసహిత వివరాలను అందిస్తాయి. ల్యాండర్‌లో దిగువ భాగంలో ఉన్న కెమెరా.. ల్యాండింగ్‌ ప్రదేశంలో ఏమైనా అవరోధాలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తుంది. అప్పటికే తనలో నిక్షిప్తం చేసిన ఫొటోలను, వాస్తవ ద శ్యాలను ల్యాండర్‌ పోల్చి చూసుకుంటుంది. వాటి ఆధారంగా తన మార్గాన్ని సరిచేసుకుంటుంది.
ల్యాండింగ్‌ సమయంలో రాకెట్‌ నుంచి వెలువడే వేడి వాయువుల వల్ల జాబిల్లి నుంచి కొంత ధూళి పైకి లేచే అవకాశం ఉంది. అయితే చంద్రుడి వద్ద పెద్దగా వాతావరణం లేకపోవడం వల్ల ల్యాండర్‌ కింది భాగంలోనే ఈ ధూళి పైకి ఎగస్తుందని భావిస్తున్నారు.
ల్యాండర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను రక్షించడానికి బంగారు వర్ణంలోని బహుళ పొరల ఇన్సులేషన్‌ పాలీమర్‌తో రక్షణ కవచం ఏర్పాటు చేశారు.
గరిష్ఠంగా సౌరశక్తి: చంద్రయాన్‌-2 ల్యాండర్‌, రోవర్‌లోని సౌరఫలకాలు.. చంద్రుడి ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఉండేలా ప్రత్యేకంగా అమర్చారు. ల్యాండింగ్‌ ప్రదేశ తీరుతెన్నుల ద ష్ట్యా అక్కడ సూర్యుడు ఆకాశంలో 19 డిగ్రీలను మించి ఉదయించే పరిస్థితి ఉండదు. అందువల్ల అటూ ఇటూ సౌర శక్తిని గ్రహించే సామర్థ్యమున్న ఫలకాలు నేరుగా సూర్యుడికేసి ఉంటాయి. దీనివల్ల గరిష్ఠ స్థాయిలో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది.
అంతా సవ్యంగా ఉందనుకున్నాక శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి కిందకు దిగే క్రమంలో ప్రధాన దశకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’ ల్యాండర్‌కు ఆదేశాలిస్తారు. ఆ సమయంలో అది జాబిల్లిపై 35ఐ100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంటుంది. దాని వేగం గంటకు 6120 కిలోమీటర్ల మేర ఉంటుంది.
లి ఇస్రో నుంచి ఆదేశాలు రాగానే ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు ప్రజ్వరిల్లుతాయి. అవి ల్యాండర్‌ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ ఆ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ల్యాండర్‌ కిందకు దిగడం మొదలవుతుంది.
చంద్రుడిపై విక్రమ్‌ కాలుమోపే సమయానికి అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో ఈ వ్యోమనౌక తన సౌర ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్‌విడ్త్‌ లింక్‌ను ఏర్పాటు చేసుకొని సంభాషిస్తుంది. తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. మొదట ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌ ‘ఆరోగ్య పరిస్థితి’పై తనిఖీలు చేస్తారు. అనంతరం జాబిల్లి ఉపరితల కార్యకలాపాలు మొదలవుతాయి.
ల్యాండింగ్‌ సమయంలో పైకి లేచే జాబిల్లి ధూళి నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. అప్పుడు ల్యాండర్‌ నుంచి జారుడు బల్ల లాంటి ర్యాంప్‌ విచ్చుకుంటుంది. దాని మీద నుంచి ఆరు చక్రాల ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ కిందకు దిగుతుంది. ఈ రోవర్‌ నేరుగా భూ కేంద్రంతో సంభాషించలేదు. ఆర్బిటర్‌తో మాత్రమే కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. ఈ రోవర్‌పై భారత జాతీయ పతాకాన్ని, ఇస్రో లోగోను చిత్రీకరించారు.
దిగేది ఇక్కడ
చంద్రుడి దక్షిణార్ధగోళంలో మాంజినస్‌ సి, సింపెలియస్‌ ఎన్‌ అనే రెండు బిలాల మధ్య ప్రాంతంలో ల్యాండర్‌ దిగుతుంది. జపాన్‌కు చెందిన కగుయా ఆర్బిటర్‌, అమెరికాకు చెందిన ఎల్‌ఆర్‌వో ఆర్బిటర్లు అందించిన చిత్రాలు, డేటాను విశ్లేషించిన ఇస్రో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. అమెరికాకు చెందిన అపోలో-16, సర్వేయర్‌-7లు మాత్రమే ఇప్పటివరకూ ఎగువ మైదాన ప్రాంతాల్లో దిగాయి. మిగతా వ్యోమనౌకలన్నీ చీకటిమయంగా ఉండే, నున్నగా ఉండే లావా మైదాన ప్రాంతాల్లో కాలుమోపాయి. చంద్రయాన్‌-2 కాలుమోపుతున్న దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో వ్యోమనౌకలేవీ ఇప్పటివరకూ దిగలేదు.
అంతా సొంత తెలివే!
ఒక సంకేతం భూమి మీదున్న ఇస్రో నియంత్రణ కేంద్రం నుంచి ల్యాండర్‌కు వెళ్లి, మళ్లీ భూమిని చేరడానికి దాదాపు మూడు సెకన్లు పడుతుంది. శరవేగంగా సాగిపోయే ల్యాండింగ్‌ ప్రక్రియలో అది గణనీయమైన జాప్యం కిందే లెక్క. అందువల్ల ల్యాండింగ్‌కు ఇస్రో ఇంజినీర్లు మార్గనిర్దేశం చేయడం సాధ్యం కాదు. సొంతంగానే ఈ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన మేధస్సును విక్రమ్‌ ల్యాండర్‌కు అందించారు. అందులోని కంప్యూటర్‌.. దూరం, త్వరణం, వేగం, ద క్కోణం వంటి అంశాలపై నిరంతరంగా వివిధ సెన్సర్ల నుంచి ఎప్పటికప్పుడు డేటాను సేకరిస్తుంది. తాను ప్రయాణించాల్సిన మార్గంపై లెక్కలు కడుతుంది. అవసరమైతే ఇంజిన్ల ప్రజ్వలనలో మార్పులు చేయడం ద్వారా మార్గాన్ని సరిచేసుకుంటుంది. జాబిల్లిపై క్షేమంగా దిగే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మానవ నియంత్రణతో ల్యాండింగ్‌కు ప్రయత్నించడం వల్ల ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన బెరెషీట్‌ వ్యోమనౌక చంద్రుడిపై దిగే క్రమంలో కూలిపోయింది.