ఆ ఫ్యాక్టరీకి లైసెన్సు లేదు
టపాసుల పరిశ్రమపై ఎన్ని కేసులున్నా చర్యల్లేవు
బటాలా: పంజాబ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలోని ఓ టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ శిథిలాల కింద కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న విషయాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. టపాసుల ఫ్యాక్టరీపై గత రెండేళ్లుగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ ఫ్యాక్టరీకి లైసెన్సు కూడా లేదు. ఎన్నో సార్లు లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నా అధికారులు తిరస్కరించారు. 2017లోనూ ఇక్కడ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఒకరు మ తి చెందగా.. చాలా మంది గాయపడ్డారు. అప్పటి నుంచి అక్కడ చిన్నా చితకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని మూసి వేయించాలని స్థానికులు జిల్లా అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. నిన్న జరిగిన ప్రమాదంలో అత్యధికంగా నష్టపోయింది స్థానికులే.
గురునానక్ జయంతి సందర్భంగా భాగంగా గురువారం గురునానక్ దేవి వివాహమహోత్సవం జరగనుంది. ప్రజలంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. పర్వదినాలు కావడంతో చాలా మంది పక్కనే ఉన్న గురుద్వారా బేస్‌మెంట్‌లో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలోనే పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా అంటుకున్న మంటలు..పక్కనే ఉన్న కంప్యూటర్ సెంటర్‌కు, అక్కడే ఉన్న కారు షెడ్డుకు అంటుకున్నాయి. దీంతో మ తుల సంఖ్య పెరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.