భారీ పెట్టుబడులకు

యాక్ట్‌ ఈస్ట్‌
తూర్పు దేశాల అభివద్ధి కోసం భారత్‌ బిలియన్‌ డాలర్ల సాయం: మోదీ
  • ఆర్ధిక దౌత్యానికి ఈ విధానం కొత్త దారి
  • మానవాళి మానవ సంక్షేమానికి సరికొత్త ఊతం
  • నూతన భారతావని నిర్మాణానికి నడుం బిగించాం
  • దౌత్య కార్యాలయం ప్రారంభించిన తొలి దేశం మనదే
  • తూర్పు దేశాలతో భారత్‌ బంధం ఈనాటిది కాదు
  • ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేందుకు నూతనావిష్కరణలు
  • సహజవాయువు క్షేత్రాల సంయుక్త అభివద్ధి
  • తూర్పు ఆర్థిక వేదిక 5వ సదస్సులో ప్రసంగం

”తూర్పు దేశాల అభివద్ధి కోసం భారత్‌ బిలియన్‌ డాలర్లు ఇవ్వనుంది. ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంలో భాగంగా మా ప్రభుత్వం తూర్పు ఆసియా సంబంధాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మన ఆర్ధిక దౌత్యానికి ఈ విధానం కొత్త దారి చూపిస్తుంది…ఈ మేథోమథనం కేవలం తూర్పు ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాళి మానవ సంక్షేమానికి ఊతమిస్తుంది. ఇతర దేశీయులపై ఆంక్షలున్నప్పటికీ కూడా భారతీయుల కోసం వ్లాదివోస్టోక్‌ తలుపులు తెరిచే ఉంచింది” -నరేంద్రమోదీ

న్యూఢిల్లీ: తూర్పు దేశాల అభివద్ధిలో భాగంగా భారత్‌ బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్‌లో జరిగిన 5వ తూర్పు దేశాల ఆర్ధిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ”తూర్పు దేశాల అభివద్ధి కోసం భారత్‌ బిలియన్‌ డాలర్లు ఇవ్వనుంది. ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంలో భాగంగా మా ప్రభుత్వం తూర్పు ఆసియా సంబంధాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మన ఆర్ధిక దౌత్యానికి ఈ విధానం కొత్త దారి చూపిస్తుంది…” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తూర్పు దేశాల ఆర్ధిక సదస్సుకు తనను ఆహ్వానించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సు సందర్భంగా జరిగిన మేథోమథనం కేవలం తూర్పు ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాళి మానవ సంక్షేమానికి ఊతమిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా వ్లాదివోస్తోక్‌లో జరుగుతున్న తూర్పు ఆర్థిక వేదిక 5వ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం కేవలం తూర్పు దేశాలతో సంబంధాలను బలపరిచేందుకు మాత్రమే కాదని, మొత్తం మానవాళితో సత్సంబంధాలను ఏర్పరుస్తుందని తాను నమ్ముతున్నట్లు మోదీ పేర్కొన్నారు. తూర్పు దేశాలతో భారత్‌ బంధం ఈనాటిది కాదని మోదీ తెలిపారు. వ్లాదివోస్తోక్‌లో దౌత్య కార్యాలయం ప్రారంభించిన మొదటి దేశం భారత్‌ అని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులకు తూర్పు దేశాల్లో ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ అనే నినాదంలో నూతన భారతావని నిర్మాణానికి నడుం బిగించినట్లు మోదీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేందుకు నూతనావిష్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ గల దేశంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తూర్పు ఆసియా అభివ ద్ధిలో భాగంగా ‘యాక్ట్‌ ఈస్ట్‌’ పాలసీ కోసం తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇది రెండు ప్రాంతాల మధ్య ఆర్థికబంధం బలపడేందుకు ఉపయోగపడుతుందన్నారు.
తూర్పు దేశాలతో భారత్‌కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదనీ, చాలా పురాతనమైనది మోదీ అన్నారు. వ్లాదివోస్టోక్‌లో తొలి దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది భారతదేశమేనని గుర్తుచేశారు. ”ఇతర దేశీయులపై ఆంక్షలున్నప్పటికీ కూడా భారతీయుల కోసం వ్లాదివోస్టోక్‌ తలుపులు తెరిచే ఉంచింది” అని పేర్కొన్నారు. 2024 నాటికి భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. ‘సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌’ అన్న ‘మంత్రం’తో నవభారతాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కషిచేస్తోందని మోదీ పేర్కొన్నారు.
ఇంధన రంగంలో మరింతగా సహకరించుకోవాలని రష్యా, భారత్‌ నిర్ణయించాయి. కోకింగ్‌ కోల్‌ సరఫరాకు, భారత్‌ను గ్యాస్‌ ఆధారిత దేశంగా మార్చేందుకు ద్రవరూపిత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరా మరింతగా చేసేందుకు రష్యా అంగీకరించింది.. జల, బొగ్గు ఆధారిత, సంప్రదాయేతర రంగాల్లో విద్యుత్తు ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని విస్తరించుకునేందుకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడ జరిగిన 20వ భారత్‌-రష్యా వార్షిక సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వాదిమిర్‌ పుతిన్‌ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు అవగాహనా ఒప్పందాలపై సంతాకలు చేశారు. అనంతరం ఇరుదేశాల తరఫున సంయుక్త ప్రకటనను రష్యా ప్రభుత్వం విడుదల చేసింది. రష్యా, భారత్‌లలో చమురు, సహజవాయువు (గ్యాస్‌) క్షేత్రాలను సంయుక్తంగా అభివద్ధి చేయాలని నిర్ణయించారు. ‘2019-24 సంవత్సరాలలో పెట్రో, గ్యాస్‌ రంగాల్లో సహకరించుకునే ప్రణాళికపై ఇరు దేశాలు సంతకం చేశాయి. రాబోయే అయిదేళ్లలో సరికొత్త గరిష్ఠ ఉత్పత్తులు సాధించేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి’ అని ఆ ప్రకటన పేర్కొంది. మొత్తం 15 అవగాహనా ఒప్పందాలు కుదిరాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2018-19లో 8.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.57,400 కోట్లు) మేర ఉండగా, 2025కు 30 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల)కు చేరేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇందుకోసం పారిశ్రామికంగా సహకరించుకోవాలని, అధునాత సాంకేతికతల అభివ ద్ధికి పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇరుదేశాల కరెన్సీల్లోనే చెల్లింపులను ప్రోత్సహించాలని తీర్మానించారు.
– రవాణా రంగంలో గ్యాస్‌ వినియోగం పెంచేందుకు, చమురు, సహజవాయువు రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవాలనీ నిర్ణయించాయి.
-రష్యా నుంచి భారత్‌కు ఇంధన సరఫరాకు మార్గాలను అభివ ద్ధి చేయాలని, రష్యా నుంచి ముడిచమురు దీర్ఘకాలం సరఫరా చేసుకునేందుకు పైప్‌లైన్‌ వేయాలని నిర్ణయించారు.
– గుజరాత్‌లోని వాదినార్‌ చమురు రిఫైనరీ సామర్థ్యం పెంచడానికి రష్యాకు చెందిన రోజ్‌నెఫ్‌ సహకారం ఉన్న నయరా ఎనర్జీ లిమిటెడ్‌కు భారీ అవకాశాలున్నాయి.
-ఇంధనాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపైనా సహకరించుకోనున్నాయి.
– విద్యుత్తు, అణుఇంధన యేతర రంగాల్లో సహకారానికి భారీ అవకాశాలున్నాయని, సహకరించాలని గుర్తించారు.
– రష్యాలో చమురు, గ్యాస్‌ క్షేత్రాల అభివ ద్ధి, భారత్‌ (గుజరాత్‌)లో నయారా చమురు రిఫైనరీ అంశాల్లో ఇరుదేశాల మధ్య సహకారం బాగా ఉందని సమావేశం అభిప్రాయ పడింది. భారత్‌ చమురు రంగంలో రష్యా సంస్థలు పెట్టుబడి పెట్టాలని కోరారు.
-కోకింగ్‌ కోల్‌ను భారత్‌కు సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది.. ఇందుకోసం కోల్‌ఇండియా, ఫార్‌ఈస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఏజెన్సీ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.
ఎల్‌ఎన్‌జీ కొనుగోలుకు హెచ్‌-ఎనర్జీ, పెట్రోనెట్‌ ఒప్పందం
ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఎల్‌ఎన్‌జీ అపార నిల్వలున్నందున, కొనుగోలుకు రష్యా గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ నోవాటెక్‌తో దీర్ఘకాల ఒప్పందాలను భారత సంస్థలు హెచ్‌-ఎనర్జీ (ముంబయి స్థిరాస్తి సంస్థ హీరానందాని గ్రూప్‌), పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ చేసుకున్నాయి. విద్యుదుత్పత్తితో పాటు వాహనాలకు ఇంధనంగా వాడేందుకు ఎల్‌ఎన్‌జీ కేంద్రాలు, గ్యాస్‌ సరఫరాకు ప్రత్యేక వాహనాల్లో కూడా ఇరుదేశాల సంస్థలు పెట్టుబడి పెడతాయి. ఇందుకోసం దేశీయంగా జైగర్‌ నుంచి మంగళూరుకు, కన్నైచట్ట నుంచి శ్రీరామ్‌పూర్‌కు పైపులైన్లు వేస్తారు.