150-250 గ్రాముల అణుబాంబులు

పాకిస్థాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు 

ఇస్లామాబాద్‌: 
‘మా దగ్గర 150-250 గ్రాముల అణుబాంబులు కూడా ఉన్నాయి. అనుకున్న లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి ఇవి చాలు’ అని పాకిస్థాన్‌ మంత్రి ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అంతలోనే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ మేము తొలుత అణ్వాయుధాలు ఉపయోగించబోం అని చెప్పారు. అసలీ చిన్న అణ్వాయుధాల గొడవేంటీ.. ఇప్పుడు పాకిస్థాన్‌ పదేపదే వీటి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తోంది.. భారత్‌ వద్ద దీనికి సమాధానం లేదా.. అనే విషయాలను చూద్దాం. భారత్‌తో సంప్రదాయ యుద్ధం తలెత్తితే పాకిస్థాన్‌ ఓడిపోవడం ఖాయం. గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఇదే విషయాన్ని మన దాయాదికి తేల్చిచెప్పాయి. దీంతో పాక్‌ ఇప్పుడు సీమాంతర ఉగ్రవాదం రూపంలో పరోక్ష యుద్ధానికి తెరతీసింది. భారత్‌లో సహనం నశించడంతో సర్జికల్‌ స్ట్రైక్స్‌కు శ్రీకారం చుట్టింది. దీంతోపాటు మెరుపుదాడి వ్యూహమైన ‘కోల్డ్‌స్టార్ట్‌ ‘ అమలు చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ విషయం పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో చిన్న అణ్వాయుధాలను తెరపైకి తెచ్చింది. 
అసలేమిటీ టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ 
అణ్వాయుధాలు సాధారణంగా భారీగా శక్తిని సష్టిస్తాయి. ఈ క్రమంలో లక్ష్యంలో లేనివి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని నిర్దేశించిన లక్ష్యాలపై దాడి చేయడం కోసం వీటిని అభివ ద్ధి చేశారు. ఒక కిలోటన్ను కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేసే అణ్వాయుధాలను టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌గా పరిగణిస్తారు. వీటిని శత్రుదేశం కబ్జాలోని భూభాగాలను విడిపించుకోవడానికి వినియోగించేలా, చిన్న సైనిక పటాలాన్ని నాశనం చేసేలా వీటిని రూపొందించారు. ఎయిర్‌-టు-ఎయిర్‌ మిసైల్స్‌, శతఘ్నులు వంటివాటిల్లో పెట్టి ఉపయోగిస్తారు. సాధారణంగా దేశాలు తమ అణ్వాయుధాల బరువును బహిరంగంగా వెల్లడించవు. పాక్‌ మంత్రి చెబుతున్న 250 గ్రాముల అణుబాంబులు కూడా ఈ కేటగిరిలోకే వస్తాయి. చాలా అణుశక్తి దేశాలకు వీటిని తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నా వీటిపై ద ష్టిపెట్టవు. కేవలం న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడానికి మాత్రమే వీటిని వాడతారు. ఈ ఉద్దేశంతోనే పాక్‌ కూడా వీటిని అభివ ద్ధి చేసింది. 
గతంలో ఏ దేశమైనా ప్రయోగించిందా..? 
ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం ప్రయోగించిన దాఖలాలు లేవు. కానీ, 2004లో ఇరాక్‌లోని ఫల్లూజా నగరంపై అమెరికా స్వల్పశ్రేణి అణ్వాయుధాలను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక్కడ అమెరికా దాడి తర్వాత ఇక్కడ క్యాన్సర్‌ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. రేడియేషన్‌ కూడా కొన్ని రెట్లు పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇక్కడే పుట్టే పిల్లల్లో 1000కి 80 మంది వైకల్యాలతో జన్మిస్తున్నారు. లుకేమియా రోగుల సంఖ్య 38 రెట్లు పెరిగింది. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 10 రెట్లు ఎక్కువైంది. ఇక్కడ మగపిల్లల పుట్టుక సంఖ్యకూడా భారీగా పడిపోయింది. దాడి తర్వాత 2005లో 1000 బాలికలకు 850 మంది మాత్రమే బాలురు జన్మించారు. దాడికి ముందు ఈ నిష్పతి 1000కి 1050 మంది బాలురుగా ఉండేది. ఈ ప్రాంత వాసుల జన్యువుల మార్పులకు ఇదే నిదర్శనం. 
పాక్‌ వీటిని ఎలా ప్రయోగించే అవకాశముంది.. 
పాక్‌ వీటిని ప్రయోగించడం కోసం స్వల్పశ్రేణి దూరాల్లోని లక్ష్యాలను ఛేదించేలా నాసర్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ను అభివ ద్ధి చేసింది. సాధారణంగా గురిపెట్టిన స్వల్పశ్రేణి దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించాలంటే క్రూజ్‌ క్షిపణులను వాడతారు. బాలిస్టిక్‌ క్షిపణులపై నియంత్రణ తక్కువగా ఉండడంతో కచ్చితత్వం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే వీటిల్లో కొంచెం పెద్దస్థాయి వార్‌హెడ్‌లను అమరుస్తారు. స్వల్పశ్రేణి దూరానికి బాలిస్టిక్‌ క్షిపణిని తయారు చేసిందంటే అది టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ కోసమే అని అర్థం చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అణుదాడి చేసేలా దీనిని రూపొందించింది. 
పాక్‌ వీటిని ప్రయోగిస్తుందా.. 
పాక్‌ వీటిని కేవలం బ్లాక్‌ మెయిల్‌ కోసమే వాడుకొనే అవకాశం ఉంది. భారత్‌పై అణుదాడి జరిగితే దానికి ప్రతిదాడి అత్యంత భారీగా ఉంటుందని మన న్యూక్లియర్‌ డాక్టరీన్‌ చెబుతోంది. అందుకే భారత భూభాగంపై చిన్న అణుదాడి చేసినా పాక్‌ తీవ్రమైన ప్రతిదాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్‌ ఒక వేళ పాక్‌ను అక్రమిస్తే.. అప్పుడు భారత దళాల నుంచి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాక్‌ వీటిని వాడే అవకాశముంది. అది కూడా అన్ని చోట్లా వాడే అవకాశం లేదు. పాక్‌లోని పంజాబ్‌ వంటి ప్రాంతాలను భారత్‌ ఆక్రమిస్తే అక్కడ అణుదాడి చేయదు. ఎందుకంటే పాక్‌లో కొంత ప్రశాంతంగా ఉండే ప్రాంతం పంజాబ్‌ ఒక్కటే. దాడి తర్వాత ఆ ప్రాంతం భారీగా రేడియేషన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజస్థాన్‌ సరిహద్దుల వంటి ఎడారి ప్రాంతాల్లో ప్రయోగించే అవకాశం ఉంది. అదే కశ్మీర్‌ వంటి కొండ ప్రదేశాల్లో ఈ టాక్టికల్‌ నూక్లియర్‌ వెపన్‌ అంత ప్రభావవంతంగా పనిచేయకపోగా.. అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అంతేకాదు తొలుత అణుదాడి చేస్తే ప్రపంచ దేశాల నుంచి తీవ్రమైన ఆగ్రహాన్ని పాక్‌ ఎదుర్కొవాల్సి ఉంటుంది.. అవి ఆంక్షలు ఇతర చర్యల రూపంలో ఉండే అవకాశం ఉంది. ఇవి ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అందుకే స్వదేశంలోని ప్రజలను బుజ్జగించడం కోసం పాక్‌ మంత్రులు ఇటువంటి ప్రకటనలు చేస్తూ జబ్బలు చరుచుకొంటుంటారు.