ఐఎస్‌ఐ నుంచి లంచం

బీజేపీపై దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ బీజేపీపై ఆదివారంనాడు సంచలన ఆరోపణలు చేసారు. పాక్‌ గూఢచారి సంస్థ ‘ఐఎస్‌ఐ’ నుంచి బీజేపీ డబ్బులు తీసుకుంటోందని అన్నారు. ‘భజరంగ్‌ దళ్‌, బీజేపీలు ఐఎస్‌ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి. దీనిపై దష్టి సారించాలి. ముస్లింల కంటే ముస్లిమేతరులే ఎక్కువగా పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేస్తున్నారు’ అని దిగ్విజయ్‌ వివాదాస్పద ప్రకటన చేశారు. బీజేపీపై దిగ్విజయ్‌ ఈ తరహా ఘాటు విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. ‘పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యానికి పాల్పడి అరెస్టయిన బీజేపీ నేతలపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద గట్టిగా శిక్షించాలి. శివరాజ్‌ సింగ్‌ సిగ్గుపడాలి. మీ శిష్యులు పాకిస్థానీ ఏజెంట్లుగా మారుతుంటే వారిని బెయిలుపై తీసుకువచ్చేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు. దేశద్రోహి ఎవరు?’ అంటూ దిగ్విజయ్‌ సింగ్‌ గత ఆగస్టులో ఓ ట్వీట్‌ చేశారు. టెర్రర్‌ ఫండింగ్‌ కేసు కింద భజరంగ్‌ దళ్‌ నేత బలరాం సింగ్‌ సహా ఐదుగురు వ్యక్తులను ఆగస్టు 21 మధ్యప్రదేశ్‌లో ఎటీఎస్‌ అరెస్టు చేయడం బీజేపీని ఇరకాటంలో పెట్టింది. ఇదే తరహాలో గూఢచర్యం, ఉగ్రవాద నిధుల కేసులో రెండేళ్ల క్రితం సాత్నాలో భారతీయ జనతా యవ మోర్చా (బీజేవైఎం) నేత ధ్రువ్‌ సక్సేనాను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు.