సెల్ఫీ ట్రెండ్ తీస్తోంది బెండ్
పిచ్చికి మందు ఉందేమో గానీ.. సెల్ఫీ పిచ్చికి మాత్రం మందులేదు. సోషల్ మీడియాలో కొత్తగా కనిపించేందుకు, ఎక్కువ లైకులు పొందేందుకు నెటిజన్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సెల్ఫీలకు దిగుతున్నారు. ఈ సందర్భంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు శరీర భాగాలను కోల్పోయి వికలాంగులవుతున్నారు. ఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. సెల్ఫీలు దిగాలి.. సోషల్ మీడిమాలో అప్‌లోడ్ చేయాలి.. లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవాలి. దీనికోసం ఎంతటి ప్రమాదాన్నైనా లెక్క చేయడం లేదు కొందరు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల వచ్చే ఆనందం కన్నా ఆరోగ్య సమస్యలే ఎక్కువంటున్నారు నిపుణులు. సెల్ఫీ తీసుకునేందుకు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌ను పట్టుకోవడం వల్ల మణికట్టులో సమస్య తలెత్తుతుంది. ఇది కార్పల్‌టన్నెల్ సిండ్రోమ్‌కి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మణికట్టులో తీవ్రమైన నొప్పితో పాటు జలదరించినట్లు అనిపించడం ఈ సిండ్రోమ్ లక్షణాలు. ఇలాంటి కేసుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు.
ఆమధ్య ఆరిజోనాలోని ఫీనిక్స్ జూలో ఓ మహిళా జాగ్వర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ సందర్బంగా జాగ్వర్‌ను ఉంచే కంచె దూకి లోపలికి వెళ్లింది. అనంతరం జాగ్వర్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమెపైకి దూకింది. దీంతో ఆమె రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఎన్‌క్లోజర్‌లో అటూ ఇటు పరుగులు పెట్టింది. చివరికి అందులో నుంచి బయటపడింది. జాగ్వర్ దాడిలో ఆమె భుజానికి బలమైన గాయమైంది. ఈ సమాచారం అందగానే జూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. అయితే, ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకు నేందుకు జూలోని సీసీటీవీ కెమేరా ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
సెల్ఫీ మరణాలు భారత్‌లోనే అధికం గత ఏడాది అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులు విహారయాత్ర కోసం ఒడిశా వెళ్లారు. అక్కడ నాగావళి నదిలో దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. నిరుడు జులైలో 22 ఏళ్ల ఫార్మసీ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌లోని బొర్రా గుహల యాత్రలో సెల్ఫీ సరదా కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బొర్రా గుహలు కనిపించేలా రైల్లోనుంచి సెల్ఫీ తీసుకోబోయి జారిపడి మ తిచెందాడు. గతంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి అరకు వద్ద గూడ్స్ రైలుపై కూర్చుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కి గురై ప్రాణాలు కోల్పోయాడు.
రైల్వేట్రాక్‌పై సెల్ఫీలు తీసుకోవాలనే ఉత్సాహంతో కర్ణాటకలోని బిడాదిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత ఏడాది అక్టోబరులో చోటుచేసుకుంది.
2014 మార్చి నుంచి 2016 సెప్టెంబరు మధ్య ప్రపంచవ్యాప్తంగా 127 మరణాలు నమోదు కాగా, అందులో 76 భారతదేశంలో జరిగినవని ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో తేలింది.
సమాజానిదే బాధ్యత
సెల్ఫీలు యువత జీవితంలో ఒక భాగంగా మారిపోయాయని, ప్రస్తుత యువతరాన్ని సెల్ఫీతరంగా చెప్పొచ్చని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజి లెక్చరర్ ప్రసూన బాలాంత్రపు అన్నారు. పెద్దవాళ్ళే సెల్ఫీలు తీసుకోకుండా ఆగలేకపోతున్నారని.. అలాంటప్పుడు ఉత్సాహం ఉరకలేసే యువజనులు ఎలా ఆగుతారని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రధాని నుంచి సినిమా నటుల వరకు అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు, శారీరక బలాన్ని హీరోయిజంగా సినిమాలు చూపిస్తున్నపుడు యువత ప్రభావితం కాకుండా ఎలా ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా సెల్ఫీ ప్రమాదాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ ఉదాహరణలు చూపుతూ జాగ్రత్తలు చెప్తున్నా వారు పెడచెవిన పెడుతున్నారని ఆమె అన్నారు. కష్టపడకుండా, ఇలాంటి సాహస సెల్ఫీలతో వచ్చే తాత్కాలిక గుర్తింపు కోసం యువత పాకులాడడం దీనికి కారణమని ప్రసూన అన్నారు. ప్రమాదకరమైన ప్రాంతాలలో సెల్ఫీలు తీసుకునే సంస్కతిని నివారించాలని ఆమె సూచించారు.
‘నో రూల్ చిల్డ్రన్’
తమ ఉనికిని చాటుకునేందుకు సహజంగా ఇలాంటి సాహసాలు చేస్తుంటారని హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణులు వీరేందర్ చెప్పారు . చాలా మందికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ ) ఉంటుందని అది తల్లితండ్రులు గుర్తించి మానసిక నిపుణుడికి చూపిస్తే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. చాలా మందికి సమాజం, కుటుంబం చెప్పేదానికి వ్యతిరేకంగా ప్రవర్తించే మనస్తత్వం కలిగి ఉంటారని, వారి పనులకు పర్యవసానాలు ఆలోచించే స్థితిలో ఉండరని.. ఇలాంటివాళ్లనే ‘నో రూల్ చిల్డ్రన్’ అంటారని తెలిపారు. సాంకేతికతకు అవతల ఉన్న జీవితానికి విలువ ఇస్తేనే ఇలాంటి సెల్ఫీ ప్రమాదాలను నివారించగలమని అబుదాబిలో ఉన్న వైద్యుడు కిరణ్ కుమార్ అన్నారు. నిజ జీవితంలో పొందలేని ప్రశంసలు, అభినందనలను సోషల్ మీడియాలో పొందాలనే తపనతోనే చాలా మంది ఇలా చేస్తుంటారని చెప్పారు.
సెల్ఫీ నిషిద్ధ ప్రాంతాలు!
సెల్ఫీ సరదాతో ప్రమాదాలు కొనితెచ్చుకోవడం ఎక్కువవు తుండడంతో భారత ఆర్థిక రాజధాని ముంబయిలో 16 ప్రదేశా లను సెల్ఫీ నిషిద్ధ ప్రాంతాలుగా ప్రకటించారు. హైదరాబాద్ సెల్ఫీ ఉదంతం తర్వాత, రైల్వే ట్రాక్‌లు ఫుట్‌బోర్డులపై సెల్ఫీలు తీసుకోవడం రైల్వే చట్టం 1989, సెక్షన్-145, 147 ప్రకారం శిక్షార్హమని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ఘాటించింది. ఇలా చేసిన పక్షంలో 6 నెలల జైలు, రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా ఉంటుందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకట నలో తెలిపింది. ఈ చట్టం చాలా కాలంగా అమల్లో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని దక్షిణ మధ్య రైల్వే ప్రజాసం బంధాల అధికారి షకీల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించే ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు కేంద్ర రవాణా, జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత జూన్‌లో ప్రకటించారు.