‘ఆమె’ ఒక సైన్యం
ఆమెకు ‘ఆమే’అభయం.. ఆమెను వేధిస్తే ఇక అంతే. వెకిలిచేష్టలు, మకిలి మనుషులపై కొరఢా ఝళిపిస్తోంది. పోకిరీలపై ప్రతాపం చూపుతోంది. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు… షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చే గహిణులు… ఇలా ఎవరు ఏ పనిమీద వెళుతున్నా ఎవరైనా వేధిస్తే షీటీమ్‌లు ఇట్టే పట్టేస్తున్నాయి. బాధిత మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ షీ బందాలు గత మూడేళ్లలో 5,432 కేసులు నమోదు చేశాయి. అయితే, వీటిల్లో 4,830 కేసు లు మేజర్లపై, 602 కేసులు మైనర్లు నమోదయ్యాయి. మహిళలను వేధించేవారిలో కాలేజీల విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న మరికొందరు ఉన్నట్లు షీ బందాలు సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విస్తత ప్రచారంతో అవగాహన
బస్టాప్‌లు, ఆటోస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు… ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తత ప్రచారం బాగానే పనిచేస్తోంది. లైంగిక వేధింపులకు గురయ్యే యువతులకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు గత మూడేళ్లలో దాదాపు ఐదువేల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపు పది లక్షల మందిలో మార్పు తీసుకురాగలిగాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, మురికివాడ లు, పనిచేసేప్రాంతాల్లో విస్తతంగా జాగతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళాచట్టాల గురించి వివరించారు. పోలీసుస్టేషన్లే కాకుండా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈమెయిల్, హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రచారం చేయడం అమ్మాయిలకు, మహిళల్లో భరోసా కలిగించింది. ఫలితంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఈ-మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీ దుస్తుల్లో షీ బందాలు అక్కడికి చేరుకొని వీడియో చిత్రీకరణ ద్వారా ఆకతాయిల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలుగా కోర్టులో సమర్పిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి స్త్రీలపట్ల గౌరవం పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం, తల్లిదండ్రుల అతి గారాబంతో షీ బందాలకు చిక్కుతున్నవారిలో 19 నుంచి 55 ఏళ్ల వయసువారే ఎక్కువగా ఉంటున్నారు.
నోరెళ్లబెడుతున్నారు…
‘మేమేమీ తప్పుచేయలేదంటూ చిలుకపలుకులు పలికే ఈవ్ టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలోనే వీడియో ప్రదర్శించడంతో కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ‘మేం పట్టుకున్న ఈవ్‌టీజర్లలో 80 శాతం మంది రోజూ సిగరెట్లు తాగుతున్నారు. వారాంతాల్లో మద్యం పార్టీలు చేసుకుంటున్నారు. హుక్కా కేంద్రాలకు వెళ్తూ మత్తును రుచిచూస్తున్నారు’ అని షీ టీమ్ సభ్యులు తెలిపారు.
కౌన్సెలింగ్‌తో మార్పు
షీ బందాలకు చిక్కిన ఆకతాయిలకీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మార్పు వస్తోంది. పశ్చాత్తాపపడేలా చేయడంతోపాటు మరోమారు ఈవ్‌టీజింగ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం. వేధింపులపై ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగి మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నాం. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోందంటున్నారు షీ టీమ్స్ సిబ్బంది. పిల్లల ముందే ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటం కూడా ఎదుటివారంటే లెక్కలేనితనాన్ని పెంచుతుంది. మగపిల్లలకు ఇష్టానుసారంగా డబ్బులు, స్వేచ్ఛ ఇవ్వడం వల్ల దారి తప్పుతున్నారు. అమ్మాయి కనబడితే కామెంట్ చేయడం మామూలు విషయమేనని భావిస్తున్నారు. అందుకే చిన్నప్పుడే పిల్లల మనస్తత్వం బాగుండేలా చూడాలి. మహిళల ఆత్మరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అక్టోబర్ 24న తెలంగాణ పోలీస్‌శాఖలో షీ టీమ్ పేరుతో ప్రత్యేక పోలీస్ బందాలను హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి షీటీమ్ బందాలను నియమించింది. ఏడాది పాటు హైదరాబాద్ నగరంలో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో షీ టీమ్ బందాలను ఏర్పాటు చేసింది. 2015 అక్టోబర్ 31న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 23 షీ టీమ్ బ ందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. మఫ్టీలో ఉంటు ఆకతాయిల భరతం ప్రడుతుండే వారు. ఇటీవల కొంత డీలా పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల రామగుండం పోలీస్ కమిషనర్‌గా వి.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతం షీ టీమ్‌పై ప్రత్యేక ద ష్టి సారించారు. గోదావరిఖనిలో ఏసీపీగా రక్షిత కే మూర్తి (ప్రస్తుతం మంచిర్యాల డీసీపీ)పని చేసిన సమయంలో పెద్దపెల్లి, మంచిర్యాల రెండు జిల్లాలకు షీ టీమ్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో రక్షిత కే మూర్తి షీ టీమ్ కార్యకలపాలపై ప్రత్యేక దష్టి సారించారు.
పని విధానం
మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీ టీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. షీ టీమ్స్ పోలీసులు చేసిన ఆపరేషన్స్, అవగాహన సదస్సులు మహిళ భద్రతకు రక్షణ కవచంగా మారింది. రోజురోజుకు జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, పార్కులు, బస్టాండ్, బస్ స్టాప్‌లు, కళాశాలలు, ప్రభుత్వ, ప్క్రెవేటు కార్యాలయాల వద్ద షీ టీమ్ పోలీసులు మఫ్టీలో నిఘా వేసి ఉంటారు. వారి వద్ద స్పై కెమెరాలు సైతం ఉంటాయి.
ర్యాగింగ్ నిరోధానికి
విద్యార్థులకు కళాశాలల్లో అడ్మిషన్లును ఇచ్చే సమయంలో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో విద్యార్థుల తరుపున కొందరు, అధ్యాపకుల తరుపున కొందరు ఉండాలి. కొంత మంది విద్యార్థుల నేరుగా చెప్పుకోలేని పరిస్థితి ఉంటే కళాశాలలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలి. ప్రతి కళాశాలలో నోటీస్ బోర్డుపై పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు టోల్‌ఫ్రీ నెంబర్ 100ను విధిగా ఏర్పాటు చేయాలి.
విద్యాసంస్థలు సైతం
ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోని విద్యాసంస్థల యాజమాన్యాలు శిక్షార్హమవుతాయి. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు గురైన బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే ప్రోత్సహించినట్లవుతుంది. చట్ట ప్రకారం యాజమారీన్యాలను సైతం శిక్షించే అవకాశం ఉంటుంది.
సమాచారం ఇవ్వడం ఇలా…
చాలామంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడుతారు. ఇలాంటి వారిని దష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబర్లను అందుబాటులో ఉంచారు. ఫోన్‌లో సమాచారం ఇచ్చేందుకు 100 నెంబరుకు డయల్ చేసి సమాచారం అందించవచ్చు. 100కు ఇచ్చిన సమాచారం హైదరాబాద్‌లోని పోలీస్ కంట్రోల్‌రూంకు వెళుతుంది. అక్కడికి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సెకన్లలో సమాచారం వెళ్తోంది. సదరు పోలీస్ అధికారులు షీటీమ్ బ ందాలు ఘటన స్థలానికి రహస్యంగా చేరుకొని సమస్యలను పరిష్కరిస్తారు.
అమలయ్యే శిక్షలు…
విద్యార్థులు, మహిళలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలు ఉంటాయి. విద్యాలయాల నుంచి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, మరే విద్యాలయంలో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీచేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడిన వారి ఉపకారవేతనాలు నిలిపివేయడం, పోటీపరీక్షలకు హాజరుకాకుండా చేయడం, రూ.2.50లక్షల వరకు జరిమానా విధిస్తుంది.
నిర్భయంగా సమాచారం ఇవ్వాలి
ఎవరైన వేధించిన వెంటనే 100కు నిర్భయంగా సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీటీమ్‌లను ఏర్పాటు చేసింది. కాలేజ్ విద్యార్థులు మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌కు గురిచేసినా, సెల్‌ఫోన్‌ల ద్వారా వేధింపులకు గురి చేసిన వెంటనే 100 డయల్‌కు గాని, వాట్సాప్ నెంబర్ 6303923700కు సమాచారం అందిస్తే తక్షణమే రక్షణ చర్యలు చేపడుతాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగ ఉంచబడుతాయి.
ధైర్యంగా వెళ్తున్నాం…
షీటీమ్ వచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తున్నాం. మా కాలేజీలో ఇప్పటి వరకు షీ టీంపై ఐదుసార్లు అవగాహన సదస్సు నిర్వహించారు. షీటీం ఏర్పడినప్పటి నుంచి యువకులు ఆమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేసేందుకు బయపడుతున్నారు. ఇప్పుడు బయటకు వెళ్లే ముందు దైర్యంగా అనిపిస్తుంది అంటున్నారు నేటి ఆధునిక యువతులు.
ఒక్క కాల్‌తో రక్షణ
షీటీమ్ మహిళలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 100 నెంబర్‌కు ఒక కాల్‌చేస్తే చాలు పక్కనే ఉంటారు. ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రావాలంటే ఒకప్పుడు భయంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు. సివిల్ డ్రెస్‌లో పోలీసులు ఎవరో తెలియకుండానే మన మధ్యన ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు.