బీసీలకు న్యాయం జరిగేనా?!

తెలంగాణ ప్రభుత్వం 50 శాతం పరిమితికి లోబడకుండా బీసీ జనాభా ఎంతుందో ఆ దామాషాలో మున్సిపాలిటీ, నగరపాలిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకోసం అవసరమైతే సుప్రీం కోర్టు తలుపు తట్టాలి. ఇటీవల ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు తెలంగాణలోని వైద్య విద్యా రంగంలో 50 శాతానికి మించిపోయాయి. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించడంలో కూడా ఇబ్బంది ఉండకూడదు. 
దేశంలో ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పాలసీగా ఉన్నది. ఒక రాష్ట్రం 72 శాతం రిజర్వేషన్లు కల్పించినా అది న్యాయ సమ్మతంగానే ఉంటుంది. మరో రాష్ట్రంలో 50శాతం దాటితే సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమంటూ హైకోర్టులు కొట్టేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రాల జాబితాలో ఉన్నందున ఆ రాష్ట్ర రిజర్వేషన్ల శాతాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అంశం కేంద్ర జాబితాలో ఉండడంతో వాటిలో మార్పులు, చేర్పులు పార్లమెంట్‌ ఆమోదంతో రాష్ట్రపతి చేస్తారు. అందుకే 25 ఏండ్లుగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తేలేక పోతున్నాయి. 
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లు బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఇటీవల పెంచాయి. ఇది చెల్లుబాటవుతుందని కూడా బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ అక్కడ ‘స్టే’ ఇవ్వలేదు. 2017–18లో మరాఠాలు తమకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేయడంతో ఓబీసీ కోటాలో 16శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నాయంటూ కొందరు కోర్టుకు వెళ్ళిండ్రు. అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించి ఉండటంలో తప్పేమీ లేదని ఈ జూన్‌లో తీర్పునిచ్చింది. అయితే, ప్రభుత్వం ఆమోదించిన విధంగా 16 శాతం గాకుండా విద్యా సంస్థల్లో 12, ఉద్యోగాల్లో 13 శాతంగా ఉండాలని ఆదేశించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు ఆ రాష్ట్రంలో గరిష్ఠంగా 65శాతానికి పెరిగాయి. 
ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికలకు ముందు మార్చి 2019లో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కమలనాథ్‌ బీసీలకు రిజర్వేషన్లను 14 నుంచి 27శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్‌ చేసిండు. ఈ ఆర్డినెన్స్‌ని బిల్లు రూపంలో గత నెలలో శాసనసభలో ప్రవేశ పెట్టిన సందర్భంలో బిల్లుకు ప్రతిపక్షమైన బీజేపీ మద్దతునిస్తూ ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేసింది. చట్టమైన ఈ బిల్లు ప్రకారం ఎస్సీలకు 16, ఎస్టీలకు 20, ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి పది శాతం%–% మొత్తంగా 73 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ మొన్న స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27కు పెంచుతున్నట్లు ప్రకటించాడు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 12 నుంచి 13శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎస్టీలు ఎక్కువగా ఉండడంతో వారికి 37శాతం కల్పించారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 72 శాతానికి పెరిగాయి. ఇప్పటికీ హర్యానాలో 70, తమిళనాడులో 69, జార్ఖండ్‌లో 60, రాజస్థాన్‌లో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఒక్క తమిళనాడులో మాత్రమే రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చబడ్డాయి. మిగతా రాష్ట్రాల్లో ఆ షెడ్యూల్‌తో సంబంధం లేకుండానే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 
1986లో ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 25 శాతమున్న రిజర్వేషన్లను మురళీధరరావు కమీషన్‌ సిఫారసుల మేరకు 44శాతానికి పెంచారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 67శాతానికి పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ నవనిర్మాణ సమితి పేరిట అగ్రకులాల వాళ్లు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీసిండ్రు. ఈ సందర్భంలోనే హైకోర్టు 1986 సెప్టెంబర్‌లో రిజర్వేషన్లు మొత్తంగా 50 శాతానికి మించుతున్నాయనీ, ఇది 1963లో సుప్రీం కోర్టు ఎం.ఆర్‌.బాలాజీ వర్సెస్‌ మైసూరు రాష్ట్రం కేసులో ఇచ్చిన తీర్పునుకు విరుద్ధమంటూ కేసుని కొట్టివేసింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కోరుకున్నది కూడా అదే కావడంతో అప్పట్లో సుప్రీం కోర్టుకు వెళ్ళే ఉద్దేశం లేదంటూ ప్రకటించాడు. ఈ విషయంలో ఎన్టీఆర్‌ వైఖరిని, అలాగే కోర్టులు తమకు లేని అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయని బాలగోపాల్‌ విమర్శించాడు. 50శాతం రిజర్వేషన్లకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నాడు. 
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే పార్లమెంట్‌ చట్టాలు చేస్తుంది, కోర్టులు వాటికి అనుగుణంగా న్యాయం చేకూరుస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 (4), ఆర్టికల్‌ 16(4)లో ఎక్కడా కూడా మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని పేర్కొనలేదు. అయినప్పటికీ కోర్టులు తమ పరిధిలోలేని విషయంలో జోక్యం చేసుకొని రిజర్వేషన్లను 50శాతానికి మించకూడదని నియంత్రించాయి. ఈ అధికారం కోర్టులకు లేదని జస్టిస్‌ చిన్నపరెడ్డిబీ జస్టిస్‌ ఫజల్‌ అలీబీ హక్కుల ఉద్యమకారుడు, అడ్వకేటు కూడా అయిన బాలగోపాల్‌ తమ తీర్పుల్లో, రచనల్లో పేర్కొన్నారు. 
చర్చనీయాంశమేమిటంటే త్వరలో తెలంగాణలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాజ్యాంగం 73, 74వ సవరణ ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 70శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించారు. అయితే మొన్నటి పంచాయతీరాజ్‌ ఎన్నికల సందర్భంలో హైకోర్టు తీర్పుకు అనుకూలంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూసిండ్రు. దీని వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం 50శాతం పరిమితికి లోబడకుండా బీసీ జనాభా ఎంతుందో ఆ దామాషాలో మున్సిపాలిటీ, నగరపాలిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకోసం అవసరమైతే సుప్రీం కోర్టు తలుపు తట్టాలి. ఇటీవల ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు తెలంగాణలోని వైద్య విద్యా రంగంలో 50 శాతానికి మించిపోయాయి. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించడంలో కూడా ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ కావాల్సింది చిత్తశుద్ధి. బీసీ సామాజిక వర్గాల శ్రేయస్సు రీత్యా తెలంగాణ ప్రభుత్వం జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇదే సమయంలో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టులకు ఎలాంటి అధికారం లేదని నిరూపించాల్సిన అవసరమున్నది. అలాగే తమిళనాడు మాదిరిగా తొమ్మిదో షెడ్యూల్‌లో బీసిల అంశాన్ని చేర్చి జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలి. దీనితో ఈ విషయంలో న్యాయ సమీక్షాధికారానికి వీలుండదు. 
రిజర్వేషన్ల కల్పన రాను రాను చాలా క్లిష్టంగా మారింది. వీటన్నింటికీ పరిష్కారంగా 2020 ఏప్రిల్‌ నుంచి జరిగే జనగణనలో బీసీ కులాల సమాచారాన్ని కూడా సేకరించాలి. ఆ లెక్కల ఆధారంగా బీసీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించాలి. ఎందుకంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ బీసీ కమిషన్‌ పనిచేస్తోంది. బీసీ కులాలను గ్రూపులుగా విభజించే అంశంపై ఏర్పాటు చేసిన రోహిణీ ప్రసాద్‌ కమిటీ కూడా త్వరలో తమ నివేదికను సమర్పించనుంది. అలాగే ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల అమలుకు పాటు పడాలి. తెలంగాణలో న్యాయమైన రిజర్వేషన్లు కల్పించి బీసీలకు చేయూతనివ్వాల్సిన సందర్భమిది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించక పోవడం వల్ల ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పటికే కొన్ని వేల సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, జెడ్‌పీటీసీ, ఎంపీటీసి, జెడ్పీ చైర్మన్‌ పదవులు కోల్పోయారు. ఈ తప్పుని సరిదిద్ది రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాళోజి మెడికల్‌ యూనివర్సిటీ యాజమాన్యం బీసీ వ్యతిరేకత వల్ల మెరిటోరియస్‌ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. వీటన్నింటిని దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమ బీసీ పాలసీని పునః సమీక్షించాల్సిన అవసరమున్నది. 
రిజర్వేషన్లపై సుహద్భావ వాతవరణంలో చర్చలు జరగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంచాలక్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల ప్రకటించాడు. చాలా ఏండ్లుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడుతూ వస్తున్నది. ట్రిపుల్‌ తలాఖ్‌ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దుకు పార్లమెంట్‌లో తమకున్న బలంతో ఆమోదింపజేసుకుంది. అట్లనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు కూడా కేంద్రం స్వస్తి పలుకనుందనే భావన ప్రజల్లో ప్రబలంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం తర్వాతి టార్గెట్‌ రిజర్వేషన్ల స్వస్తి అన్న అంశమని తెలుస్తోంది. 
దేశంలో ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు రిజర్వేషన్లు పెంచిన విషయాన్ని దష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అటు బీసీలకు జానాభా దామాషాలో రిజర్వేషన్లు ప్రకటించాలి. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన జనాభా లెక్కలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు. పెంచిన రిజర్వేషన్లతోనే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలి. జనాభా దామాషాలో బీసీలకు అంటే 54 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.