మహా మాంద్యం
పేరుకు భాగ్యనగరం…కొనుగోళ్లు లేక మార్కెట్ మందగమనం
- భాగ్యనగరంలో ఆన్‌లైన్ దెబ్బకు కుదేలయిన కొనుగోళ్లు
- ఆర్థిక లావాదేవీలు లేక వ్యాపారుల విలవిల
- పండుగలొచ్చినా కొనుగోళ్లు లేక దుకాణాల వెలవెల
- నిర్మాణరంగంలో ఆవహించిన స్తబ్ధత
- రియల్ ఎస్టేట్ పుంజుకున్నా కొనుగోళ్లు అంతంతమాత్రం
- కొండెక్కిన బంగారం ధరతో కొనుగోళ్లు ఢమాల్
- ఆటోమొబైల్స్‌కూ భారీగా తగ్గిన గిరాకీ
- ఆన్‌లైన్‌లోనే మొబైల్స్ అమ్మకాల జోరు
- హోటళ్లలో పడిపోయిన రూవమ్ ఆక్యుపెన్సీ
- కేసీఆర్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే గంపెడాశలు
హైదరాబాద్:
నగర మార్కెట్‌ను మాంద్యం ఆవహించింది. ఏ వ్యాపారిని కదిపినా కన్నీరే తక్కువ. లావాదేవీలు లేవని, చేతిలో డబ్బులు ఆడడం లేదని, అప్పులు పెరిగిపోతున్నాయని, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రంగం, ఈ రంగం అని లేకుండా అన్ని వ్యాపారాల పరిస్థితి అలాగే ఉంది. తెలంగాణ ప్రజలకు ఉపాధి కేంద్రం హైదరాబాద్. చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరికి ఎక్కడ పని దొరక్కపోయినా నగరానికి వలస వచ్చేస్తారు. ఇక్కడే ఏదో ఒకటి చేసుకుంటూ బతికేస్తారు. అలా లక్షలాది మందిని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న హైదరాబాద్ నగరం ఇప్పుడు బేలచూపులు చూస్తోంది. ఆర్థిక లావాదేవీలు తగ్గిపోయాయి.
ముఖ్యంగా ఇసుక లభించక నిర్మాణరంగం చతికిలపడింది. అత్యధికులకు ఉపాధి కల్పించే నిర్మాణ రంగం కుదేలయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోతున్నాయి. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేక ప్రాజెక్టుల్లో చిక్కుకుపోయాయి. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక భవన నిర్మాతలు విలవిలలాడిపోతున్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి దొరక్క పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. ఈ సమస్య నిర్మాణ రంగంతోనే ఆగిపోలేదు. మిగిలిన రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆటోమొబైల్ కుదేల్
హైదరాబాద్‌లో ఆటోమొబైల్ పరిశ్రమది కీలక స్థానం. ప్రతి నెల నగరంలో సుమారు ఐదు నుంచి పది వేల కొత్త వాహనాలు అమ్ముడవుతాయి. అందులో 6000 వరకు ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు వుంటే, 500 ఆటోలు, మరో 200 కార్లు, ఇంకో 200 ఇతర రవాణా వాహనాలు (లారీలు, ట్రాక్టర్లు వగైరా) ఉంటాయి. ప్రతిరోజు 250 నుంచి 400 ద్విచక్ర వాహనాలు విక్రయిస్తుంటారు. అయితే గత రెండు నెలలుగా వాహన విక్రయాలు దారుణంగా పడిపోయాయి. రోజుకు 50 నుంచి 80కి వాహనాలు మాత్రమే అతి కష్టం మీద అమ్మగలుగుతున్నారు. అవి కూడా నెలసరి వాయిదాలు కట్టే పద్ధతిలోనే వెళుతున్నాయి. రోజుకు 20 వాహనాలు అమ్మిన షోరూమ్‌లు ఇప్పుడు ఒకటి, రెండుతోనే సరిపెట్టుకుంటున్నాయి. గోదాముల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. పెట్టుబడులపై లాభాల సంగతి పక్కనపెడితే వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదని యజమానులు వాపోతున్నారు. ఆషాఢమని గత నెల సర్దుకున్నా, ఇప్పుడు శ్రావణం వచ్చినా పరిస్థితి ఏమాత్రం మారలేదంటున్నారు. దసరాకు అయినా వ్యాపారం పుంజుకుంటుందా? లేదా? అనేది అనుమానంగా ఉందంటున్నారు.
మొబైళ్ల వ్యాపారం అంతా ఆన్‌లైన్‌లోనే
హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లోను ఎక్కడికక్కడే మొబైళ్లు విక్రయించే దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఏడాదికోసారి మొబైల్ మార్చడం అలవాటుగా మారడం వల్ల ఈ వ్యాపారం బాగానే ఉండేది. అయితే షాపులకు వచ్చి కొనేవారి సంఖ్య ప్రస్తుతం దారుణంగా పడిపోయింది. దాదాపు 80 శాతం మంది ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్లిప్‌కార్టు, ఆమెజాన్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు ఆఫర్లు, తగ్గింపు ధరలు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులు, అధిక సిబ్బందితో షాపులు నిర్వహిస్తున్న పెద్ద పెద్ద సంస్థలు రోజుకు పది మొబైళ్లు అమ్మడం కష్టంగా ఉంది. చిన్న షాపుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్క్రీన్ గార్డు, కవర్లు వేయించుకోవడానికి వచ్చేవారు సైతం వాటినీ ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడంతో ఆ వ్యాపారం కూడా పడిపోయింది.
హోటళ్లలో తగ్గిన ఆక్యుపెన్సీ
హైదరాబాద్ పర్యాటక నగరం. రోజూ వివిధ పనులపై నగరానికి వేలాది మంది వస్తుంటారు. నగరంలో చిన్న, పెద్ద కలిసి 1000 వరకు హోటళ్లు ఉన్నాయి. ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు ఆక్యుపెన్సీ పడిపోయింది. ఇంతకు ముందులా నగరంలో సదస్సులు, సమావేశాలు జరగడం లేదు. దాంతో భారీ వ్యాపారం లేదు. చిన్నచిన్న హోటళ్లు కూడా 40-50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి.
రెస్టారెంట్లకు రెండు రోజులే ఆదరణ
నగరంలో 200 వరకు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి నిత్యం కస్టమర్లతో, ఘుమఘుమలాడే వంటకాలతో రద్దీగా ఉండేవి. ఇప్పుడు శని, ఆదివారాల్లో తప్పితే సాధారణ రోజుల్లో జనాలే కనిపించడం లేదు. ఉద్యోగ వర్గాలు తప్పితే ఇతర వర్గాలు, కొందరు యువత తప్పితే ఇతర వర్గాలు రెస్టారెంట్ల వైపు వెళ్లడం లేదు. స్విగ్గీ, జొమోటాల వ్యాపారం విస్త తం కావడం కూడా రెస్టారెంట్లలో రద్దీ తగ్గడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
15 ఏళ్లుగా ఇదే వ్యాపారం
గత పదిహేనేళ్లుగా మొబైల్ వ్యాపారంలోనే ఉన్నా. గుడ్‌విల్ చెల్లించి, నెలకు రూ.80 వేల అద్దె కడుతూ షాపు నిర్వహిస్తున్నాను. గత కొద్ది నెలలుగా అమ్మకాలు లేకపోవడంతో రూ.15 లక్షల పెట్టుబడి హారతి కర్పూరంలా కరిగిపోతోంది. రోజుకు రెండు మొబైళ్లు అమ్మడం కష్టంగా ఉంది. పది కవర్లు కూడా అమ్ముడవ్వడం లేదు. ఇప్పుడు మరొక వ్యాపారంలోకి వెళ్లలేని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది.
-మల్లికార్జునరావు, సెల్‌పాయింట్, కుకట్‌పల్లి
దసరాపైనే ఆశలు
ఇంతకు ముందు నెలకు 250 వరకు ద్విచక్ర వాహనాలు అమ్మేవాళ్లం. గత రెండు నెలలుగా రోజుకు ఒకటి అమ్మడమే కష్టంగా ఉంది. విక్రయాలు తగ్గడంతో సిబ్బందిని తగ్గించుకున్నాం. వచ్చే దసరాపైనే ఆశలుపెట్టుకున్నాం. మళ్లీ వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నాం.
-విశ్వనాథం, ద్విచక్ర వాహన షోరూమ్ అధినేత, దిల్‌షుక్‌నగర్
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మాంద్యం
ఆర్థిక మాంద్యం ఈ పేరు చెప్పగానే దేశాలన్నీ భయపడుతుంటాయి. అగ్రరాజ్యాలు సైతం వణికిపోతాయి. అలాంటి ఆర్థిక మాంద్యం ప్రభావం ఇప్పుడు భారత్‌పై కనిపించడం ప్రారంభమైంది. దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళన అందరిలో మొదలైంది. కంపెనీల లాభాలు తగ్గిపోతున్నాయి పలు సంస్థల్లో ఉద్యోగాలపై వేటు మొదలైంది. ఇదంతా దేనికి సంకేతమనే భయం పట్టుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రారంభమైందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి మందగించనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో అమెజాన్ తన అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల మరే దేశంలోనూ ఇంత పెద్ద కార్యాలయం లేదు. మరో వైపున ఆ సంస్థ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తోంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి మరో వైపు చూడాలంటేనే భయమేస్తోంది. అదే ఆర్థిక మాంద్యం. ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోవడం ఆర్థిక మాంద్యానికి ఒక సంకేతం మాత్రమే. సాధారణంగా ఆర్థికాభివ ద్ధికి సూచికగా కార్ల విక్రయాలను పరిగణిస్తుంటారు. ఆ రకంగా చూస్తే ఆర్థిక మాంద్యం ప్రభావం మొదటగా పడేది వాహనాల విక్రయాల పైనే. తాజాగా కార్ల విక్రయాల లెక్కలు చూస్తుంటే భారత్ పై ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రారంభమైందనే ఆర్థిక నిపుణులు అంటున్నారు. కార్ల పరిశ్రమలో గత 19 సంవత్సరాలలో కనీవినీ ఎరుగని మాంద్యం నెలకొంది. 2018 జులై నెలలో వివిధ రకాల వాహనాలు 22.45 లక్షలు అమ్మగా, 2019 జులైలో 18.25 లక్షలకు పడిపోయింది. 4.20 లక్షల వాహనాల అమ్మకం తగ్గింది. గత మూడు నెలల కాలంలోనే వాహన పరిశ్రమలో 15 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మాంద్యం ఇలానే కొనసాగితే ఒక్క వాహన రంగంలోనే వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మాంద్యం ప్రభావం ఇతర రంగాలకు విస్తరిస్తే ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.
ఆర్థిక మాంద్యం అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలే. గతంలో ఇలాంటి ప్యాకేజీలే దేశాన్ని ఆదుకున్నాయి. ఈ దఫా కూడా ఇలాంటి ప్యాకేజీలను ప్రకటించాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఒక్క వాహన పరిశ్రమనే లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కోరుతోంది. ఆ లెక్కన చూస్తే వివిధ పరిశ్రమలు మరెన్నో లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీలను కోరే అవకాశం ఉంది. ఉన్నత, మధ్యతరగతి వారిలో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో కంపెనీల విక్రయాలు భారీగా పడిపోతున్నాయి. పార్లే కంపెనీ లాభాలు బాగా తగ్గిపోయాయి. పార్లే చిన్న కంపెనీ ఏమీ కాదు. సుమారు లక్ష మంది ఆ కంపెనీలో పని చేస్తున్నారు. వారిలో పదో వంతును అంటే సుమారు పదివేల మందిని తొలగించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. జీఎస్టీ రేటు తగ్గించాలని పార్లే కంపెనీ కోరింది. అది ఒక్కటే కాదు మరెన్నో కంపెనీలు కూడా జీఎస్టీ రేట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల విక్రయాలు తగ్గితే వాటి లాభాలు తగ్గుతాయి. దాంతో అవి ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాలపై వేటు వేస్తాయి. ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు రుణాలను చెల్లించలేరు. దాంతో బ్యాంకులపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అవి వేరేవారికి మరింతగా రుణాలు ఇవ్వలేకపోతాయి. ఇదంతా ద్రవ్య వ్యవస్థపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనబరుస్తుంది. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుతో ప్రారంభమైన ప్రతికూల ఫలితాలు జీఎస్టీ తో మరింత అధికమై చివరికి ఆర్థికమాంద్యం గా రూపుదాలుస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దేశానికి కొత్తేమీ కాదు. ప్రతీ పది, ఇరవై ఏళ్లకోసారి ఆర్థిక మాంద్యం తలెత్తుతూనే ఉంది. కాకపోతే ఆర్థిక స్థితిగతులన్నీ బాగా ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో ఆర్థికమాంద్యం రావడమే ఆశ్చర్యంగా మారింది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో మొదలయ్యే ఆర్థిక మాంద్యం క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రపంచానికి కొత్తేమీ కాదు. అంతే కాదు ఒక దేశంలో ప్రారంభమయ్యే మాంద్యం అంటువ్యాధిలా ఇతర దేశాలకూ విస్తరిస్తుంది. అమెరికా విషయానికి వస్తే అక్కడ వచ్చే ఆర్థిక మాంద్యం యావత్ ప్రపంచానికి విస్తరిస్తుంది. అమెరికాలో గత 200 ఏళ్ళ కాలంలో సుమారు 17 సార్లు ఆర్థికమాంద్యం ఏర్పడింది. 1797లో తొలి ఆర్థిక మాంద్యం అప్పుడే ఏర్పడ్డ అమెరికాను ప్రభావితం చేసింది. 1929లో అమెరికాలో భారీ స్థాయి ఆర్థిక మాంద్యం నెలకొంది. అమెరికా ఆర్థిక చరిత్రలో అతి గడ్డుకాలంగా చరిత్రకెక్కింది. ఆ పరిస్థితి 1938 వరకూ సాగింది. నిరుద్యోగ సమస్య అత్యధిక స్థాయిలో 25 శాతానికి చేరింది. 2008 – 2009లో ఆర్థిక మాంద్యం అమెరికాను తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. సబ్‌ప్రైమ్ మార్ట్‌గేజ్ సంక్షోభంగా దాన్ని వ్యవహరించారు. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ ప్రభావితం చేసింది.